నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్య విరాళాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ(SIT)పై ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పలువురిని రక్షించే ధోరణిలో సిట్ దర్యాప్తు ఉందని ఆయన ఆరోపించారు. కమిటీ దర్యాప్తులో పారదర్శకత లేదని లక్నో మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘ఈ SITకి దర్యాప్తు చేసే అధికారం లేదు, కాబట్టి ప్రజల దృష్టిలో ఇది కేవలం ఒక మోసం మాత్రమే. ఇది మొత్తం వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం, అలాగే ప్రభావవంతమైన వ్యక్తులను కాపాడటమే ఈ SIT లక్ష్యం, ఆలయ ఖజానా నుండి కానుకలు మాయమయ్యాయన్న వార్తలు తనను ఎంతగానో కలచివేసాయన్నారు. “శ్రీరామ ఆలయానికి సంబంధించి వస్తున్న వార్తలు నా హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దేవునికి సమర్పించిన వజ్రాలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దాదాపు రూ. 200 కోట్ల నగదు కూడా అపహరణకు గురైందని అంటున్నారు. ఒకరు 200 కిలోల వెండిని విరాళంగా ఇస్తే, అది కూడా చోరీకి గురైంది. నా మనసు ఎంతో బాధపడుతోంది. పరిస్థితిని సమీక్షించడానికి, మత పెద్దలతో చర్చించడానికి శుక్రవారం(రేపు) అయోధ్యకు బయలుదేరుతున్నాను. ఆ తర్వాత హనుమాన్‌గఢీని కూడా సందర్శిస్తాను. అక్కడ కొంతమంది సాధువులను కలుస్తాను, వారితో మరింత వివరంగా చర్చిస్తాను. నేను ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నాను`అని ఆయన తెలిపారు.



