‘కులగోత్రాలు మలమూత్రాలు/ ఒకలాంటివే / వాటిని విసర్జిస్తేనే ఆరోగ్యం/ ఒకటి దేహానికి, మరొకటి దేశానికి’ అంటాడో కవి. సాంకేతికంగా మానవుడు ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మన దేశంలో ప్రత్యేకంగా కులమతాలు అడ్డు గోడల్లా నిలుస్తున్నాయి. అవి గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై దాడి చేసి, రెండేండ్ల పసికందును కాళ్లతో తన్ని, నేలకేసి కొట్టి…చిన్నారి మరణానికి కారణమైంది అగ్రకుల పెత్తందారీతనం. ఇది ఎక్కడో రహస్యంగా జరిగిన ఘటన కాదు. వేలాది మంది భక్తుల సమక్షంలో చోటుచేసుకున్న దారుణం.ఇప్పుడు కులం ఎక్కడుంది? అనే వాళ్లకి ఈ హత్య తిరుగులేని సమాధానం. కులం పేరుతో దూషిస్తూ ఆలయప్రవేశం లేదని నిరాకరించడం, కులాన్నిబట్టి ఆలయ ప్రవేశం నిర్ణయించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, అగ్రకుల పెత్తందారీతనాన్ని ప్రోత్సహించడం బాధాకరం.
కులవ్యవస్థ సహజ లక్షణమైన నిమ్నోన్నతాల భేదభావం మనుషులను పశుతుల్యులుగా ఎలా మార్చగలదో, మానవత్వం కన్నా కులమే విలువైనదన్న వికృత ఆలోచనలు మనుషుల బుర్రల్లో తిష్టవేస్తే ఏం జరగగలదన్న దానికి ఈ సంఘటనే తిరుగులేని ఉదాహరణ. కుమ్మెర జాతరకు లక్షలలోనే జనం వస్తారు. దేవాదాయశాఖ పరిధిలోకి ఈ గుడి వెళ్లకుండా అడ్డుకున్న పెత్తందారుల ఆధ్వర్యంలోనే గుడి నిర్వహణ ఉంది. జాతర కూడా వారే నిర్వహిస్తారు. అయితే ఇక్కడ దేనికీ చట్ట బద్ధమైన నిర్ణయాలుండవు. దేనికైనా భక్తుల నుంచి బలవంతపు వసూల్లే. ‘రసీదు ఇవ్వకుండా రూ.వంద ఎందుకు చెల్లించాలి’ అని ప్రశ్నించిన పాపానికి ఆ కుటుంబం భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ప్రశ్నను సహించలేని అక్కడి పెత్తందారులు ఆ చిన్నారి కుటుంబాన్ని కూలదూషణ చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి, చితకబాదారు. పెత్తందారులకు కొమ్ము కాస్తున్న స్థానిక పోలీసు వ్యవస్థ చిన్నారి మరణాన్ని తొక్కిసలాట ఘటనగా చిత్రించే ప్రయత్నం చేసింది.
అది కాస్త బెడిసికొట్టడంతో పాలలో తేడా వలనే పసికందు మృతిచెందని కొత్తవాదాన్ని తెరపైకి తెచ్చి వారి స్వామిభక్తిని నిరూపించుకుంది.. ‘ఈ దేశంలో హింస అనేది ఒక సంఘటన కాదు. అది ఈ దేశ నిర్మాణం. కులం పేరుతో అది చట్టబద్ధమైనది’ అని అంబేద్కర్ చెప్పిన మాటలు ఎంత వాస్తవమో ఈ ఘటన రుజువు చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు గడుస్తున్నా నేటికీ దాదాపు కోట్ల మంది అంటరానితనం, కులవివక్షతో అణచివేయబడుతున్నారంటే ఆ జాడ్యం దేశంలో ఎంతగా వేళ్లూనుకొని ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ వివక్షల్లో ప్రాంతాల వారీగా వాటి తీవ్రతలో కొంత తేడా వున్నప్పటికీ.. వివక్షలైతే కొనసాగుతున్నాయి. లింగ, కుల, మత, వర్ణ వివక్ష వంటివి అనేక రూపాల్లో కొనసాగుతున్నాయి. ఈ వివక్షను తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంతోపాటు.. ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు తీసుకురావాలి. రాష్ట్రంలో అదీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంతటి దారుణం జరిగితే కూడా ప్రభుత్వం మౌనం వహించడం ఆ పెత్తందారీతనాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఇప్పటికైనా ఇలాంటి పెత్తందారీపోకడలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. బాధితులకు తగిన న్యాయం చేయాలి.
దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించపోవాల్సిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రి తలలు వేస్తోంది. మర్రి ఊడల్లాగా వేళ్లూనుకుంటోంది. ప్రేమానురాగాలను దునుమాడుతున్నది. మానవ్వతాన్ని మంటగల్పుతోంది. కుల దురహంకార హత్యలు, కుల దూషణలు వంటి ఈ ఆకృత్యాలకు బాధ్యత ఎవరిది? ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులదే కాదు, ఈ వ్యవస్థది. నేటి ఆధునిక యుగంలో కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ సనాతన భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పాలకవర్గాలది. నేడు దేశంలో మత దురహంకారం, కుల దురహంకారం మరింత పెచ్చరిల్లుతున్నాయి. భావితరాల భవిష్యత్తు మీద చావుగీతలు గీస్తున్నాయి. ఆ ఫలితమే నేటి కులరక్కసి కోరలకు చిక్కి బలైందీ చిన్నారి. దేవుళ్ల ఆధారంగా ఏర్పడిన ఏ మతమైనా ఆ పసి ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలదా? దేవుని పేరు చెప్పి ఆధిపత్య పెత్తందారీ వర్గాలు చేస్తున్న ఆగడాలను, దుర్మార్గాలను రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వాలు నిలువరించాలి. ‘నిమ్న జాతుల కన్నీటి నీరదములు/ పిడుగులై దేశమును కాల్చివేయునని’ అని హెచ్చరించాడు.. గర్జించాడు.. శాసించాడు.. చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీశాడు జాషువా. కులరక్కసిని అంతం చేయాలంటే సమాజం పిడికిళ్లు బిగించాలి.
పెత్తందారీ హత్య!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



