నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుస పేపర్ లీకేజ్ ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. మొన్నటిదాకా రాజస్థాన్ లో నీట్ పేపర్ లీకేజ్ తో ఇటీవల రీ-ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అదే విధంగా పలు పరీక్షల్లో మూల్యాంకనంలో అవకతకలు వెలుగులోకి వచ్చాయి. మరో వైపు ఈ పేపర్ లీకేజ్ లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర లో టెట్(టీచర్ ఎలిజీబుల్ టెస్ట్) పేపర్ లీకేజీ కలకలం రేపుతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షను వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,028 కేంద్రాలలో రేపు (ఆదివారం) జరగాల్సిన ఈ పరీక్ష కోసం సుమారు 4.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని, కేంద్రాలకు బయలుదేరే సమయానికి పేపర్ లీక్ కారణంగా పరీక్ష వాయిదా పడడంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురవుతున్నారు.
భివాండికి చెందిన కొందరు వ్యక్తుల వద్ద TET ప్రశ్నపత్రానికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు తెలిసిందని,. భివాండి పోలీసులు ఆ ప్రదేశంలో దాడులు నిర్వహించగా, అనేక ప్రశ్నలు అసలైన TET పరీక్షా పత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు విచారణలో తేలిందని మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఎగ్జామినేషన్(MSCE) పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత వ్యక్తులపై భివాండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



