Wednesday, February 25, 2026
E-PAPER
Homeక్రైమ్కోఠి కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు

కోఠి కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌లోని కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద గత నెలలో జరిగిన కాల్పుల కేసును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. రూ. 6 లక్షల నగదు దోచుకున్న ఏడుగురు అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, సుల్తాన్‌ బజార్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి ఒక నాటు తుపాకీ, 35 తూటాలు, 2 మ్యాగజైన్లు, రూ. 2,38,000 నగదుతోపాటు 2 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం డీసీపీ కె. శిల్పవల్లితో కలిసి హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫుర్కాన్‌ అహ్మద్‌, హైదరాబాద్‌లో నివసిస్తున్న మహమ్మద్‌ తయబ్‌ త్యాగిని అరెస్టు చేశారు. తయబ్‌ త్యాగి నగరంలో ఓలా/ఉబర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ, కోఠి, అబిడ్స్‌ ప్రాంతాల్లో తెల్లవారుజామున నగదు డిపాజిట్‌ చేసే వారిని గమనించి దోపిడీకి పథకం వేశాడు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి తన బంధువులను, నేర చరిత్ర కలిగిన ముఠాను పిలిపించాడు. అదునుకోసం వేచిచూస్తున్న సమయంలోనే జనవరి 31న కోఠి ఎస్‌బీఐలో నగదు డిపాజిట్‌ చేసేందుకు రిన్షద్‌ అనే వ్యక్తి వచ్చాడు. అతడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్దనున్న రూ. 6 లక్షల నగదుతో పాటు బాధితుడి వాహనాన్నీ తీసుకుని పరారయ్యారు. ఈ కాల్పుల్లో రిన్షద్‌ కాలికి గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, శాస్త్రీయ ఆధారాలు, ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరించి నిందితులను షాహీన్‌ నగర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు (ఫహీమ్‌ అహ్మద్‌, నౌషాద్‌, ఆబిద్‌, డానిష్‌ త్యాగి, మహమ్మద్‌ మత్లూబ్‌) పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ మట్టయ్య, ఇన్‌స్పెక్టర్లు కే. చంద్రశేఖర్‌, ఎన్‌. రంజిత్‌ కుమార్‌ గౌడ్‌, జి. నరేష్‌తోపాటు ఎస్‌ఐలు పి. జ్ఞానదీప్‌, జీ. శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -