Friday, June 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి125 రోజుల మాయాజాలం: ఉపాధి ‘హామీ’కి ఉరితాడు!

125 రోజుల మాయాజాలం: ఉపాధి ‘హామీ’కి ఉరితాడు!

- Advertisement -

గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రతగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ‘125 రోజుల ఉపాధి’ పేరుతో కొత్త మాయాజాలానికి తెరలేపుతోంది. ఉపాధి రోజులు పెంచుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నప్పటికీ, అందుకు అవసరమైన నిధులు కేటాయించకుండా భారాన్ని రాష్ట్రాలపై మోపేందుకు విబి-జిరామ్‌జి పథకాన్ని రూపొందించింది. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది, కానీ ఖర్చు మాత్రం రాష్ట్రాలదిగా మార్చే ఈ విధానం కోట్లాది గ్రామీణ కార్మికుల జీవనాధారాన్నే బలహీనపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. జూలై ఒకటినుంచి కొత్త పథకం వీబీ-జీరామ్‌‌జిని అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించిన డ్రాప్ట్‌ ‌రూల్‌ (‌జిఎస్‌ఆర్‌403-ఇ)‌ని రూపొందించింది. వీటిని పరిశీలిస్తే కొత్త పథకం ఉపాధి హామీని విచ్ఛిన్నం చేస్తే, రూల్స్ దాన్ని విధ్వంసం చేసేట్లుగా ఉన్నాయి. యాభై ఐదుకు పైగా ప్రధాన క్లాజులు, రూల్స్, వందలాది ఉప నిబంధనలు, కొత్త పరి పాలనా నిర్మాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థ ఉపాధి హామీని బలోపేతం చేయడానికి బదులు, హక్కు ఆధారిత స్వభావాన్ని పూర్తిగా బలహీనపరిచేలా ఉన్నాయి.

“చెట్టును నరికి నీడ ఇస్తామని చెప్పడం ఎంత మోసమో, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి 125 రోజుల పని కల్పిస్తామని చెప్పడం కూడా అంతకన్నా మోసం” ప్రభుత్వం వంద రోజులకు బదులు 125 రోజుల ఉపాధి హామీ ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ ఏ ఉపాధి పథకమైనా హామీలపై కాదు, నిధులపై నిలబడుతుంది. ఇక్కడే మొదటి వైరుధ్యం కనిపిస్తోంది. గతంతో పోలిస్తే అదనంగా ఇరవై ఐదు రోజుల ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో కొత్త పథకానికి కేవలం రూ.95వేల కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపు ఏమాత్రం సరిపోదని రాష్ట్రాల వారీ పని దినాల గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది కేరళలో సగటు పనిదినాలు 57.81, తెలంగాణలో 50.24, తమిళనాడులో 48.54, పశ్చిమ బెంగాల్‌లో 44.12, ఆంధ్రప్రదేశ్‌లో 42.35 మాత్రమే ఉన్నాయి. బీహార్‌లో 30.94, ఉత్తరప్రదేశ్‌లో 27.50, మధ్యప్రదేశ్‌లో 25.66, మహారాష్ట్రలో 14.40, హర్యానాలో 13.78 రోజులకు పరిమితమయ్యాయి. ప్రస్తుతం పదిహేను నుంచి యాభై రోజుల పని కూడా పూర్తిగా ఇవ్వ లేకపోతున్న ప్రభుత్వం 95 వేల కోట్లతో ఒక్క సారిగా 125 రోజుల ఉపాధి ఎలా కల్పిస్తుంది? రూల్‌ 4(3)లో మోడీ ప్రభుత్వ అసలు ముఖం బయటపెడుతుంది. దీన్ని నిజంగా అమలు చేయాలంటే భారీ స్థాయిలో అదనపు నిధులు అవసరం.

ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి పదిహేడు ప్రధాన రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 7 కోట్ల 69 లక్షల 65 వేల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు 125 రోజుల ఉపాధి హామీని అమలు చేయడానికి మొత్తం రూ.3.61 లక్షల కోట్ల వ్యయం అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేటా యింపు ఈ రాష్ట్రాలకు కేవలం రూ. 85, 605 కోట్లు మాత్రమే. రాష్ట్రాల నలభై శాతం వాటా రూ. 57,071 కోట్లు కలిపినా మొత్తం అందుబాటులో ఉండే నిధులు రూ.1.43 లక్షల కోట్లు మాత్రమే. ఈ నిధులతో సగటున 48.5 పనిదినాలు సంవత్సరంలో ఇవ్వ గలరు. హర్యానాలో 23, మహా రాష్ట్రలో 24 పని దినాలు మాత్రమే కల్పించవచ్చు. అంటే 125 రోజుల ఉపాధి హామీకి అవసరమైన నిధుల్లో రూ.2.18 లక్షల కోట్లకు పైగా లోటు ఉంది. కేంద్రం కేటాయించిన నిధులు తప్ప అదనంగా పైసా నిధులు ఇవ్వబోమని రూల్స్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలే అదనంగా రూ.2.18లక్షల కోట్ల భారాన్ని మో యాల్సి వస్తోంది. అంటే- కేంద్రం రూ.85 వేల కోట్లు, రాష్ట్రాలు మొత్తం 2.75 లక్షల కోట్లు. 30 శాతం వాటా కేంద్రం, 70 శాతం వాటా రాష్ట్రాలు ఖర్చు చేయాలి.

ప్రచారం కేంద్రానిది.. ఖర్చు రాష్ట్రాలది
ఈ లెక్కన చూస్తే తెలంగాణలో 30.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం కేటాయించిన రూ.3,825 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 62 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధికి రూ.12,819 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై రూ. 8,993 కోట్ల అదనపు భారం పడుతుంది. విబి-జిరామ్‌‌జి పేరుతో కేంద్రం బాధ్యతను రాష్ట్రాలపై మోపుతున్నదని ఇది స్పష్టం చేస్తోంది. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది. ఖర్చు మాత్రం రాష్ట్రాలది. నియంత్రణ మోడీది, విఫలమైతే నింద రాష్ట్రాలది. ఇక్కడే ఒక పాత సామెత గుర్తుకొస్తుంది. “ఎద్దు ఇస్తానని చెప్పి తాడు చేతిలో పెట్టినట్టు”గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సాధ్యమా? అంతిమంగా నష్టపోయేది కార్మికులే. ఈ రూల్‌లో ఇంకా చెల్లింపులు,‌ డిబిటి, బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపును ప్రస్తావిస్తుంది. కానీ కార్మికుడి హక్కుల రక్షణపై స్పష్టత కనిపించదు. వేతనాలు ఆలస్యమైతే బాధ్యత ఎవరిది? పరిహారం ఎలా చెల్లిస్తారు? నిరుద్యోగ భృతి చెల్లించకపోతే బాధ్యులపై చర్య ఏమిటి? వంటి ప్రశ్నలకు రూల్స్‌లో స్పష్టమైన సమాధానం లేదు. కార్మికుడి హక్కు కేంద్ర బిందువుగా ఉండాల్సిన చోట పరిపాలనా ప్రక్రియ కేంద్ర బిందువుగా మారుతోంది.

బడ్జెట్‌ ‌పరిమితికి కట్టిపడేసే నిబంధనలు
అత్యంత ప్రమాదకరమైన మార్పు రూల్‌-4లో కనిపిస్తుంది. ముఖ్యంగా ‌రూల్‌4(2)లోని ప్రమాణక కేటాయింపు విధానం ‘ఎంజిఎన్ఆర్‌ ఈజిఎ’ అసలు తత్వాన్నే మార్చే ప్రయత్నం చేస్తోంది. దీని ప్రాథమిక సూత్రం “పని అడిగితే పని ఇవ్వాలి” పని డిమాండ్ ఉంటే ప్రభుత్వం నిధులు సమ కూర్చాలి. కానీ కొత్త విధానం పని హక్కును బడ్జెట్ పరిమితికి కట్టిపడేస్తోంది. అంటే ముందు పని డిమాండ్‌కు అనుగుణంగా నిధులు ఉండేవి, ఇప్పుడు నిధులు ఉంటేనే పని హక్కు నుండి కోటాకు మార్చివేయబడింది. రూల్‌ 7, రూల్‌8, రూల్‌ 11‌లో డ్రాఫ్ట్ రూల్స్ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో పరిశీలించాలి. 7- ఈ-కెవైసి పూర్తి చేసి ధృవీకరించిన ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎ జాబ్ కార్డులను మాత్రమే విబి-జిరామ్‌‌జి కింద చెల్లుబాటుగా గుర్తిస్తుంది. ఆధార్,ఈ-కెవైసి సాంకేతిక సమస్యల కారణంగా లక్షలాది మంది కార్మికులు పని, వేతన హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జాబ్ కార్డులు రద్దయిన అనుభవం ఉంది. ఇందులో సమావేశాల నిర్ణయాలను, చర్చలను ప్రజలకు వెల్లడించాలనే నిబంధన లేదు. పారదర్శకత లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. రూల్‌3- కౌన్సిల్ సభ్యులను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.

కార్మిక సంఘాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లేదు.
ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం తగ్గి, ప్రభుత్వా నుకూల వ్యక్తులతోనే కౌన్సిల్ నడిచే అవకాశం ఉంటుంది. రూల్‌4 -జాతీయ స్టీరింగ్ కమిటీలో మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకే స్థానం కల్పించింది. పనుల ఎంపిక, జాబ్ కార్డుల నుండి రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ప్రతిపాదనల వరకు అన్ని అధికారాలు ఈ కమిటీకి ఉంటాయి. పార్లమెంట్, శాసనసభలకు సంబంధం లేకుండా సర్వాధికారాలు కల్పిస్తుంది. ఇందులో ప్రమాదం ఏమంటే? కార్మికులు, పంచాయతీలు, పనిచేసే దళిత , గిరిజన, మహిళకు, కార్మిక సంఘాలు, గ్రామీణ ప్రజా సంఘాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో కార్మికుల ప్రయోజనాలు నిర్ణయ ప్రక్రియలో ప్రతిబింబించే అవకాశం ఉండదు. పేరుకే కమిటీ స్టీరింగ్ అంతా పీఎంఓ ఆఫీస్ వారినే నియత్రించే నాగ్‌‌పూర్‌ ఆరెస్సెస్‌ ‌ప్రధాన కార్యాలయం చేతిలో ఉంటుంది. రూల్‌ 5-అధికారేతర సభ్యులను తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే లేదా విమర్శించే సభ్యులను ఏకపక్షంగా తొలగించే అవకాశం ఉంటుంది. అంటే కాదు కౌన్సిల్ లో ఎక్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసి దీనిని నామమాత్రం చేశారు. రూల్‌8-జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీ విధుల్లో నిధుల కేటా యింపు, మార్గదర్శకాలు, పర్యవేక్షణ వ్యవస్థలు, డిజిటల్ మౌలిక సదుపాయాలపై కమిటీకి విస్తృత అధికారాలు ఇస్తుంది. అయితే, 
అధికారాలు పూర్తిగా కేంద్ర స్థాయిలో కేంద్రీకృతమై, గ్రామ సభలు, పంచాయతీలు మరియు రాష్ట్రాల పాత్ర బలహీనపడే ప్రమాదం ఉంది. ఇంకా 
కార్మికుల సమస్యల పరిష్కారం, వేతన చెల్లింపులు, నిధుల విడుదల వంటి కీలక అంశాలపై కౌన్సిల్ ప్రభావం చూపలేని పరిస్థితి ఏర్పడుతుంది.

వికేంద్రీకరణకు బదులు కేంద్రీకరణ
సమగ్రంగా ఈ నిబంధనల ద్వారా కార్మికుల హక్కుల కంటే డిజిటల్ నియంత్రణకు ప్రాధాన్యం, ప్రజా స్వామ్య భాగస్వామ్యానికి బదులుగా అధికార యంత్రాంగ ఆధిపత్యం, వికేంద్రీకరణకు బదులుగా కేంద్రీకరణ పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. విబి-జిరామ్‌‌జిలో గ్రామీణ కార్మికుల పాత్రను తగ్గించి, నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వ చేతుల్లో కేంద్రీకరించే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఉపాధి హామీని గ్రామసభను కేంద్రంగా ఉంచి నిర్మించబడింది. పనుల ఎంపిక, ప్రాధాన్యతలు, సామాజిక తనిఖీలు ప్రజల భాగస్వామ్యంతో జరగాలన్న భావన దాని వెనుక ఉంది. కానీ కొత్త వ్యవస్థలో గ్రామసభల పాత్ర తగ్గుతోంది. అధికార యంత్రాంగం బలపడు తోంది. “మా గురించి – మేం, మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేకుండా నిర్ణయాలు” అనే పరిస్థితిని ఈ డ్రాఫ్ట్ చట్టబద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించారన్న ప్రశ్నకూ సమా ధానం దొరుకుతుంది. మహాత్మా గాంధీ పేరు గ్రామ స్వరాజ్యం, వికేంద్రీకరణ, గ్రామసభల పాత్ర, ప్రజల భాగ స్వామ్యం వంటి భావనలకు ప్రతీక.

కానీ కొత్త వ్యవస్థలో గ్రామసభలు బలహీనపడుతున్నాయి. డ్రాఫ్ట్ రూల్స్‌లోని డిజిటల్ నిబంధనలూ ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ-కెవైసి, ముఖ గుర్తింపు, ఎన్‌ఎంఎంఎస్‌, ఆధార్‌ ‌ధృవీకరణ వంటి విధానాలను ఆధునికీకరణ పేరుతో ప్రవేశ పెట్టినా, ఇదే గ్రామీణ పేదలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఎందుకంటే, నెట్‌వర్క్ లేకపోతే పని లేదు. సర్వర్ పనిచేయకపోతే హాజరు లేదు. వేలిముద్ర పడకపోతే వేతనం లేదు. అంటే పని హక్కు కార్మికుడి చేతిలో లేదు. సాంకేతిక వ్యవస్థల చేతిలో ఉంది. ఏపీలోని కాకినాడలో ఆన్‌లైన్ హాజరు నమోదు కోసం రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళా కార్మికులపై లారీ ట్రక్కు పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఈ విధానాల అమానవీయతను బయటపెట్టింది. సాంకేతికత మనిషికి సేవ చేయాలి కానీ, మనిషిని వ్యవస్థ నుంచి బయటకు నెట్టే గోడగా మారకూడదు. ఈ మార్పులన్నింటినీ కలిపి పరిశీలిస్తే ఒక స్పష్టమైన రాజకీయ చిత్రం కనిపిస్తుంది. ఇవి యాదృచ్ఛిక మార్పులు కావు. వీటి వెనుక ఒక నిర్దిష్ట వర్గ దృక్పథం ఉంది.

“ముందు బోర్డు మార్చారు – ఇప్పుడు ఇల్లు కూల్చేస్తున్నారు.”
“ముందు నీడను నరికారు – ఇప్పుడు చెట్టునే నరుకుతున్నారు.”
ఇది పేరు మార్పు కాదు. ఇది తత్వ మార్పు, స్పష్టమైన హిందూత్వ ఎజెండా.
​అందుకే గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వ్యవసాయ, రైతు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు విశాల ఐక్య వేదికలను నిర్మించి శ్రమజీవులపై కేంద్రం దాడిని తిప్పికొట్టాలి.

బి.వెంకట్‌, 9490098045

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -