ఒక్క క్షణం… అంతే! పిల్లల నవ్వులతో నిండిన ఇల్లు శిథిలాల కుప్పగా మారిపోయింది. తల్లి ఒడిలో ఆడుకుంటున్న చిన్నారి కాంక్రీట్ పలకల కింద చిక్కుకుపోయింది. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లి దండ్రుల కోసం పిల్లలు, ఇలా ఎటుచూసినా, శిథిలాల మధ్య చేతులతోనే మట్టిని తొలగిస్తున్న దయనీయ గాథ అక్కడ కనిపిస్తోంది. గురువారం వెనిజులాను కుదిపేసిన భూకంపం భవనాలను మాత్రమే కాదు, వేలాది కుటుంబాల ఆశలనూ నేలమట్టం చేసింది. రక్షణ సిబ్బంది ప్రతి రాయిని జాగ్రత్తగా తొలగిస్తున్న కొద్దీ బయట పడుతున్నవి ప్రాణాలు కాదు, శవాలే. ఒకవైపు సైరన్ల మోతలు, మరోవైపు ఆర్తనాదాలు, ఇంకోవైపు ‘ఎవరైనా బతికే ఉన్నారా’ అంటూ వినిపిస్తున్న పిలుపులు. వారి హృదయ వేదనకు అద్దం పడుతోంది. సామ్రాజ్యవాద ఆర్థిక ఆంక్షలు, చమురు దోపిడీ, మధురో దంపతుల కిడ్నాప్ వంటి అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఒక ఆశయ బలంతో ముందుకు సాగుతున్న దేశానికి ప్రకృతి విపత్తు కోలుకోలేని దెబ్బ తీసింది. వరుసగా సంభవించిన రెండు భూకంపాలు రిక్టర్ స్కేల్‌పై 7.2, 7.5గా నమోదై భారీనష్టాన్ని మిగిల్చాయి.
నిన్నటివరకు 589 మంది సజీవ సమాధి కాగా, మూడు వేలాది మంది గాయపడినట్టు సమాచారం. ఇప్పటికే వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, తీతెనలు దెబ్బతిన్నాయి. ఆస్ప త్రులు రోగులతో నిండిపోయాయి. తాగునీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. అనేక గ్రామాలు, పట్టణాలు ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. ప్రతి గంట గడిచేకొద్దీ బతికున్న వారిని రక్షించే అవకాశాలు తగ్గుతున్నాయి. అయినప్పటికీ ఆశను వదలకుండా కొనసాగుతున్న సహాయక చర్యలు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు అందరినీ ఒకేలా తాకవు. బలమైన భవనాల్లో నివసించే వారికంటే బలహీన గృహాల్లో నివసించే పేదలే ఎక్కువగా నష్టపోతారు. అత్యవసర వైద్య సేవలు, సురక్షిత నివాసం, ఆర్థిక భరోసా లేని ప్రజల జీవితాలే ఎక్కువగా నష్టపోతాయి. వెనిజులాలోనూ అదే జరిగింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్న లక్షలాది మందికి ఈ భూకంపం జీవనాధారాన్నే దూరం చేసింది. ఈ పాపం అమెరికా సామ్రాజదా వాదానిదే. ప్రపంచంలోనే అత్యధిక నిర్ధారిత చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. సహజ వాయువు, బంగారం, ఇనుము, బాక్సైట్, కొల్టాన్ వంటి అరుదైన ఖనిజ సంపద కూడా అపారం. ఒక దేశ అభివృద్ధికి ఈ సంపద వరంగా మారాల్సింది.
కానీ సామ్రాజ్యవాద ప్రపంచ వ్యవస్థలో అదే సంపద శాపంగా మారింది. చమురు ఉన్న ప్రతి దేశంపై ఆధిపత్య పోరు నడిచిన,నడుస్తున్న చరిత్ర ప్రపంచం చూస్తున్నదే. వెనిజులా కూడా అందుకు మినహాయింపు కాదు.
హ్యూగో చావెజ్ హయాంలో చమురు సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగించేందుకు జాతీయం చేశారు. తర్వాత అదే బాటలో నడుస్తున్న నికొలాస్ మదురో ప్రభుత్వంపై అమెరికా వరుస ఆర్థిక ఆంక్షలు విధించింది. చమురు ఎగుమతులపై ఆంక్షలు, విదేశాల్లోని వెనిజులా ఆస్తుల స్తంభింపజేత, ప్రభుత్వ మార్పు ప్రయత్నాలు, అంతర్గత రాజకీ యాల్లో జోక్యం వంటివి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా బలహీనపరిచాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ప్రజల జీవితాలు మరింత దుర్భరమయ్యాయి. ఇప్పుడు భూకంపం ఆ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ప్రభుత్వ ఆదాయంలో ప్రధాన భాగం చమురుపైనే ఆధారపడిన దేశానికి ఇది మరో పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది. అందుకే వెనిజులా ప్రజలకు ఇప్పుడు అత్యవసరంగా కావలసింది సానుభూతి కాదు, సంఘీభావంతో కూడిన సహాయం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, ఆహారం, తాగునీరు, వైద్య సేవలందించడం, పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సహకారం ప్రపంచ దేశాల బాధ్యత.
అయితే గత అనుభవాలు చూస్తే, బలహీన దేశాలు ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటున్నప్పుడు సహాయం పేరుతో రాజకీయ షరతులు విధించడం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా విధానాలు మార్చాలని ఒత్తిడి తేవడం, సహజ వనరులపై బహుళజాతి సంస్థలకు అవకాశాలు కల్పించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెనిజులా విషయంలో అలాంటి ప్రయత్నాలకు తావివ్వకూడదు.
వెనిజులా శిథిలాలపై ఇప్పుడు రెండు శక్తులు నిలబడ్డాయి. ఒకటి ప్రాణాలను కాపాడాలని తపించే మానవత్వం. మరొకటి చమురు బావులు, బంగారు గనులు, ఖనిజ సంపదలనే చూసే సామ్రాజ్యవాదం. విజయం దేనిదైనా అది వెనిజులా భవిష్యత్తును మాత్రమే కాదు, ప్రపంచ మానవత్వం విలువలను కూడా నిర్ణయిస్తుంది. శిథిలాలపై లాభాల రాజకీయాలు కాదు, మానవత్వం పునర్నిర్మాణం జరగాలి. అదే ఈ విపత్తు ప్రపంచానికి నేర్పుతున్న గొప్ప పాఠం.
Highlights: వెనిజులా శిథిలాలపై ఇప్పుడు రెండు శక్తులు నిలబడ్డాయి. ఒకటి ప్రాణాలను కాపాడాలని తపించే మానవత్వం. మరొకటి చమురు బావులు, బంగారు గనులు, ఖనిజ సంపదలనే చూసే సామ్రాజ్యవాదం. విజయం దేనిదైనా అది వెనిజులా భవిష్యత్తును మాత్రమే కాదు, ప్రపంచ మానవత్వం విలువలను కూడా నిర్ణయిస్తుంది. శిథిలాలపై లాభాల రాజకీయాలు కాదు, మానవత్వం పునర్నిర్మాణం జరగాలి. అదే ఈ విపత్తు ప్రపంచానికి నేర్పుతున్న గొప్ప పాఠం.
వెనిజులా వేదన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


