Friday, June 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘కాషాయ’ క్రీడలో విలీనాలు, స్వాధీనాలు

‘కాషాయ’ క్రీడలో విలీనాలు, స్వాధీనాలు

- Advertisement -

ఒక రాజకీయ క్రమంలో ఆర్థికాంశాలు, ద్రవ్య వ్యవహారాలు తప్పక ప్రత్యక్షమవుతాయి. అయితే సమకాలీన సన్నివేశంలో ఇప్పుడు మనం చూస్తున్న స్థాయిలో ఈ రెండూ పూర్తిగా సమ్మిశ్రితమైపోవడం చాలా అసాధారణం. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నదేమీ కాదని బాగా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే అర్థమవుతుంది. భారత దేశంలో సంపద, ఆదాయం పంపిణీలో అసమానతలు అంతుపట్టని స్థాయికి చేరడం గురించి కొంత కాలంగా పదేపదే చాలా చర్చలు జరుగుతూనే వున్నాయి. కొద్దిమంది చేతుల్లోనే విపరీతంగా సంపదలు పోగుపడటం అన్నది పెట్టుబడిదారీ విధానం సహజ సూత్రాల పర్యవసానమేమీ కాదు. ముగ్గురు నలుగురు కుబేరులతో భారత రాజ్యం కుమ్మక్కు అయిన ఫలితమది. మనం హిందూ రాష్ట్ర గురించి చాలానే మాట్లాడుకుంటున్నాము. కానీ భారత రాజ్యం కొద్దిమంది ఎంపిక చేసిన కుబేరుల ప్రయోజనాలను పెంచేయాలని పట్టుకు వేలాడ్డం కూడా అంతే నిజమన్నది మాసిపోదు. ద్రవ్య ప్రభుకూటమిగా గుర్తించబడే ఆ అతి కొద్దిమంది బృందానికి ఆయుధాలు అందిస్తున్నది రాజ్యం. నిజానికి ఈ ప్రభుకూటమి విధానాల నిర్దేశంలో ఎంత ప్రాబల్యం వహిస్తున్న దంటే ఇండియాను కార్పొరేట్ స్వామ్యం (కార్పొరేటోక్రసీ)గా ఇప్పుడు వర్ణించే స్థితి వచ్చింది. మనం స్థాపించాలనుకున్న, తీర్చి దిద్దాలనుకున్న లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌కు భిన్నమైన ఈ కార్పొరేట్ స్వామ్యం వచ్చి కూర్చుంది. మన సామ్రాజ్యవాద వ్యతిరేక స్వాతంత్య్ర పోరాట స్వభావానికి అనుగుణమైంది రిపబ్లిక్.

అంతటా అదానీనే…
ఈ పరిణామ క్రమంలో అదానీ గ్రూపు నిస్సందేహంగా ప్రధాన చోదక శక్తిగా, ప్రయోజనాల భోక్తగా ముందు కొచ్చింది. ఇటీవలనే మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం భారత ప్రభుత్వం దీర్ఘకాలిక బొగ్గు ఒప్పందాల విధానం చేపట్టిన 2024 నుంచి అదానీ గ్రూపు ప్రభుత్వ కాంట్రాక్టులు పొందుతున్నది. వీటి ద్వారా రానున్న పాతికేళ్లలో దానికి రూ.13.27 లక్షల కోట్లు లభిస్తాయి. ఇందులో ఒకటి తప్ప మిగిలినవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే దక్కాయనేది ఏమీ ఆశ్చర్యం కలిగించదు. 2024 మార్చి 2026 జనవరి మధ్య అలాంటి దీర్ఘకాలిక కాంట్రాక్టుల కోసం 12 వేలం పాటలు నడిచాయి. వాటిలో ఎనిమిది బీజేపీ పాలిత రాష్ట్రాలు. అదానీ గ్రూపు తనకు తనే గానీ లేక మరో బృందంలో భాగస్వామిగా గానీ వీటన్నిటినీ కైవశం చేసుకుంది. అధికార పత్రాలను పరిశీలించినపుడు ఈ రాష్ట్రాలలో టెండరు నిబంధనలను అదానీ గ్రూపునకు లబ్ధి చేకూర్చే విధంగా మార్చేశారని అర్థమవుతుంది. ఒక్కో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ప్రకటించిన టారిఫ్‌లు, వాటి కాలపరిమితి గమనించినపుడు రూ.13.27 లక్షల కోట్ల ఆదాయం సమకూరు తుందని అంచనా వచ్చింది. బొగ్గు ఇంధనంతో నడిచే ఈ కాంట్రాక్టులు ఇరవయ్యేళ్ల దీర్ఘకాల ఉత్పత్తి తీసుకునేలా ఆ రాష్ట్రాలను ముడివేసి పెడుతున్నాయి. ఒకవైపున ఇంధన రంగం శరవేగంగా మారుతున్నా ఈ కాంట్రాక్టులు మాత్రం ఆ విధంగా సాంకేతిక అవకాశాలను ఉపయోగించుకునే వీలు లేకుండా చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ప్రభుత్వ ధాన్యాల నిల్వల గోదాముల అప్పగింతపై పరిమితి తొలగించారు. తద్వారా ఇక్కడ కూడా అదానీ గ్రూపునకు చెందిన గోదాములు, నిల్వ కేంద్రాల ప్రవేశానికి నిర్వహణ నియంత్రణకు అవకాశం కల్పిం చేందుకే ఇదంతా ఉపయోగపడింది. మొత్తం నిల్వ సామర్థ్యంలో అరవై శాతం వారికే అప్ప గించబడింది. ఓడరేవుల నుంచి విమనాశ్రయాల వరకూ మరీ ముఖ్యంగా ఇంధనం, మీడియా రంగాలలో చాలా స్పష్టంగా అదానీల చేతుల్లోకి పోవడం చూస్తున్నాం. వ్యక్తిగతంగా మోడీ రాజకీయంగా బీజేపీ అంతకంతకూ దూసుకుపోవడమూ, అదానీ దూసుకుపోవడమూ ఎలా జరిగిందో గతం నుంచీ ‘పీపుల్స్ డెమోక్రసీ’లో మేము సవివరంగా చెబుతూ వస్తున్నాము. ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట’ సంరంభాల నిర్వహణతో ఇది మొదలైన తీరు పేర్కొన్నాము.

అందుకే బుల్డోజర్
ఈ నమూనా ప్రకారం చట్టవిరుద్ధమైన బుల్డోజర్ తరహా ప్రయోగంతో విభిన్న రాజకీయ వాస్తవాలను ఒకే గొడుగు కింద కుక్కడం తప్పనిసరి అవసరంగా మారుతుంది. ప్రతిపక్ష శ్రేణుల్లో కొత్త విలీనాలు, స్వాధీనాల జోరు దాదాపు తుపానులా తయారైంది. ఇటీవలే ముగిసిన శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఇది ఊపందుకుంది. 2024 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ లోక్‌సభలో 400 స్థానాలకు మోపు పెట్టింది. అయితే తన మిత్రులతో కలసి కూడా 300 స్థానాలు కూడా తెచ్చుకోలేకపోయినప్పటికీ ఆరెస్సెస్‌, ‌బీజేపీలు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. కార్పొరేట్ రంగంలో మనం చూసే విలీనాలు, సంలీనాల పద్ధతినే రాజకీయ రంగంలోనూ బరితెగించి అమలు చేస్తున్నది. కార్పొరేట్ల అభివృద్ధి ప్రత్యేకించి అదానీల ముంద డుగు రాజకీయ వ్యవస్థపై బీజేపీ ఉక్కు పట్టు బిగుసు కోవడంతో సన్నిహితంగా ముడిపడి వుంది. సంపద, రాజకీయ ఆధిక్యత కేంద్రీకతం కావడం ఒకే కేంద్రకంగా జరగడం ఇప్పుడు ఎవరి దృష్టి నుంచి తప్పించుకో లేనిదిగా జరగుతున్నది. ఈ ఆధిక్యత స్థాపనను ఇలాగే కొనసాగించుకోవడానికి గాను పార్లమెంటు లోనూ సభ్యుల సమీకరణ క్రీడ అవసరమైంది. కనుక బీజేపీ ప్రయోజనాల సాధనకు అనుగుణంగా భారత ఎన్నికల కమిషన్‌తో మాయాజాలం చేయడం కూడా చాలా లోతైన సంబంధం కలిగివుంది.

హిందూత్వ దృక్పథం మేరకే
సామాజిక రాజకీయ మతపరమైన అనుబంధాలను బట్టి ఓటర్లను ఎంపిక చేసుకోవడమనేది హిందూత్వ ప్రాపంచిక దృక్పథంతో పూర్తిగా అమరిపోతుంది. ఈ ప్రక్రియతో పాటుగానే జాతీయ జనాభా మిషన్ స్థాపించేందుకు చొరవ తీసుకోవడం కూడా దీనికి సమాంతరంగా జరిగిందే. భారతదేశంలో చొరబామా దార్లు నిండిపోవడంతో ప్రమాదం వచ్చిపడుత్నుదనే కట్టుకథలు ఇందుకు ఆధారంగా నిలిచాయి. అయితే దీంతోపాటు పార్టీల అంతర్గత వ్యవస్థలలోనూ నిజంగానే లొసుగులు వున్నాయని చెప్పాల్సి వుంటుది. వాటిలో కొన్ని తృణమూల్ కాంగ్రెస్ వంటివి ఇతర పార్టీలను దిగమింగే పద్ధతులతో తప్పు చేశాయి. అయితే దాన్ని బట్టి ఆరెస్సెస్, బీజేపీలు అన్నిటినీ ఆక్రమించే కేంద్రీకృత క్రీడను తక్కువగా చూడటానికి లేదు. ఇలాంటి ప్రక్రియ వల్ల అంతర్గతంగా అసలు ప్రజాస్వామ్య భావన మనుగడకే ముప్పు వచ్చి పడవచ్చని నొక్కి చెప్పవలసి వుంది. ప్రజాస్వామ్యం బతకాలంటే బహుళ పార్టీల ఉనికి, పౌరులకు రాజకీయ ఎంపిక స్వేచ్ఛ వుండటం తప్పనిసరి అవసరం. జాతీయోద్యమంలో ఒక పార్టీకే అత్యధిక ప్రాబల్యం వున్నప్పటికీ సమాన అవకాశాలు కల్పించే రాజకీయ వ్యవస్థ పునాది ప్రాతిపదికతో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎవరు ఓటు చేయాలో నిర్ధారించే కొత్త పోకడలు వయోజన సార్వత్రిక ఓటింగు అనే రాజ్యాంగ హక్కును పూర్తిగా తోసిపుచ్చుతున్నది. మోసపూరితమైన విలీనాలు, స్వాధీనాలతో ఫిరాయింపుల క్రీడను పక్కకు నెట్టేస్తున్నది. మన రాజకీయ ప్రక్రియ కొత్త ముఖచిత్రం ఇలా తయారైందన్నమాట.

విశాల వేదికగా.. విస్తృత ప్రతిఘటనలు
ఈ పరిణామాలకు విడివిడిగా స్పందించడం గాక కార్పొరేట్ హిందూత్వ దుర్మార్గ వ్యవహారాలను ప్రతిఘటించేందుకు ఒక విశాల ప్రాతిపదికన వేదిక రూపొందించుకోవాలి. ఇందులో కేవలం రాజకీయ పార్టీలనేగాక లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌ను కాపాడుకోవాలని ఆకాంక్షించే సంఘాలు, బృందాలు, వ్యక్తులు అందరూ కలసి రావాలి. ఈ సర్వం సహా కేంద్రీకరణ ధోరణిపై వివిధ తరగతులకు చెందిన ప్రజలు ఇప్పటికే వీధుల్లోకి వచ్చేశారు. విద్యార్థులు నిరసనలు తెల్పు తున్నారు. కార్మికులు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఈ ప్రతిఘటన పోరాటం అనేక స్థాయిల్లో ఆర్థిక సామాజిక, రాజకీయ, సైద్ధాంతిక స్థాయిల్లో జరుగుతుంది. ఒక్కతాటిపై కదలి ఢీకొన్న ప్రజాశక్తిని తట్టుకుని నిలబడ్డ పాలకులు చరిత్రలోనే లేరు.
(జూన్ 23 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -