ఓ నాన్నా నీ మనసే వెన్న అని సినారె గారు ధర్మదాత సినిమాకు పాట రాశారు. అమ్మంటే నీలాకాశం, నాన్నంటే మెరిసే మేఘం కురిసేవాన అని వేటూరివారు ఇంకో సినిమాకి పాట రాశారు. ఇలా ఎవరికి తగినట్టు వాళ్లు నాన్న మీద పాటలు రాసి రెచ్చిపోయారు. నిజంగానే ఎవరి నాన్న మనసు వారికి వెన్నే మరి. కొన్నిసార్లు కఠినంగా ఉన్నా దాని వెనుక ఉండే మంచిని చూడమని ప్రపంచ నాన్నల దినోత్సవంనాడు వచ్చే పోస్టర్లు, కొటేషన్లు చూస్తే మనకు తెలిసిపోతుంది. మొన్ననే నాన్నల దినోత్సవం కూడా జరుపుకున్నాం. అసలు ఇలాంటివి మనకు లేనేలేవు మనం జరుపుకోవడం పద్ధతి కాదు అని సనాతనవాదులు అననే అన్నారు. నాన్న బతికుండగానే నాన్నకు దినం పెట్టేస్తున్నారనీ అంటారు. నిజమే మరి ఈ సో కాల్డ్ వాదులు నిజంగానే తమ నాన్నలని ఎంతమంది బాగా చూసుకుంటున్నారో చెప్ప మనండి. అసలు బైబిలు ప్రకారం దేవుడు అంటే వాళ్లకు తండ్రి, ప్రభువు. తల్లీ తండ్రి ఈ భూమి మీద ఉన్న దైవాలని మనం రోజూ చెప్పుకుంటాం. ఇలా చెప్పు కుంటూ పోతే మాతృ భూమి అని మనం ఎలా అనుకుంటామో పితృభూమి అని చెప్పేవాళ్లూ ఉన్నారు.
నాన్నల దినోత్సవంనాడు నాన్నను, అలాగే అమ్మను అమ్మలరోజున పొగడడం మామూలే. ఒకరిని పొగుడుతున్నామంటే ఇంకొకరిని తక్కువచేస్తున్నామని కాదు. ఎవరిరోజు వాళ్లకొస్తుంది వెయిట్ చేయాలి మరి. పెద్దరాణి మంచిదంటే చిన్నరాణికి కోపమొస్తే మనమేం చేయలేము. పోల్చడాలు ఉండవా అంటే ఉంటాయి మరి. మనది, మనము, మనకు అనుకున్నప్పుడు ఈ పోలికలు ఇంకా అధికమవుతాయి. ప్రేమలూ, దురభిమానాలూ, ఇతరులేమైపోయినా పరవాలేదన్న ఆలోచనలు మొదలవుతాయి. సరిగ్గా ఇక్కడే నాన్నల గురించి మాట్లాడుకుందాం. ఇది అమ్మలకూ వర్తిస్తుందండి. ఇంకా చెప్పాలంటే అమ్మా, నాన్నలలాగా ఉండవలసిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది . అమ్మ ఎవరికైనా అమ్మే అన్నట్టు నాన్న ఎవరికైనా నాన్నే.
ట్రంపుగాని, అంతకు ముందు బుష్షుగాని, నెతన్యాహూగాని, పుతిన్‌గాని మంచినాన్నలు కారా? అంటే వాళ్లవాళ్ల పిల్లలకు మంచి నాన్నలే. మరి వాళ్లు చేస్తున్న యుద్ధాల్లో ఎంతమంది నాన్నలు చనిపోతున్నారు, తమ పిల్లల వయస్సున్నవాళ్లు ఎంతమంది చనిపోతున్నారు అన్న విషయం తీసుకొని ఆలోచిస్తే, వీళ్ల మనసులు వెన్ననా లేక పాసిపోయిన జున్నా లేక ఇంకో పదార్థమా అన్న అనుమానం వస్తుంది. రాజకీయాలు, సినిమాలు, నిజజీవితంలోని ఇతర రంగాల్లో ఈ నాన్నలు తమతమ పిల్లలకు వెన్నలాగా, ఇతరులకు ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నారా లేదా గుండెమీద చెయ్యేసుకొని చెప్పమనండి. వాళ్లకు గుండెలుంటే కదా? అని ఎవరైనా అనుకోవడంలో నిజంగా తప్పులేదు మరి.
నీట్ పరీక్ష తీసుకోండి. తమ పిల్లలు పాస్ కావాలని, సీటు తెచ్చుకోవాలని, మంచి జీవితాన్ని గడపాలని కోరుకోవడంలో తప్పులేదు. ఆ కోరికతో ఇతర పిల్లల్ని తప్పుడు మార్గంలో దాటాలని, డబ్బుతో కొందరిని మచ్చిక చేసుకొని ఇతర పిల్లలకు అన్యాయం చేయడంవల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి? వాళ్ల నాన్నల మనసులూ వెన్నలే కదా? అధికారులు, దీనికి బాధ్యత వహించినవాళ్లు, విద్యా మంత్రి వీళ్లంతా కూడా వారి వారి పిల్లలకు మంచి నాన్నలే, వెన్నలాంటి మనసున్నవాళ్లే. ఇతరుల పిల్లలు పిల్లలు కాదా? నాన్న హృదయమంటే అందరినీ సమానంగా చూసేదీ, సమానంగా చూడమనేదీ కాదా? ఒక రైలు ప్రమాదానికే బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రిగా రాజీనామా చేస్తే, ఇప్పటి విద్యామంత్రి చేయొద్దా? పోలిక ఇక్కడ పెట్టుకోవద్దా లేదా. గారడీ లెక్కలతో పోలికలలు పెట్టుకుంటే సరిపోతుందా.
కాబట్టి నాన్నలు, అమ్మలు ఇతరుల పిల్లలను కూడా తమ పిల్లలలాగా, దైవాలనుకుంటే అందరు భక్తులను ఒకేలాగా చూస్తుకోవాలి. అదే నిజమైన ప్రేమ, భక్తి. కోతులనుండి వచ్చిన మనం వాటి విషయాలు చాలా మరచిపోయాము. ఎందుకంటే మానవులమైపోయాము కదా. వాటికీ మనకూ తేడా ఉండాలి కదా. వాళ్లు మనుషులు అనిపించుకోవాలి కదా. అప్పుడే అమానుషంగా ప్రవర్తిస్తున్నదెవరో కూడా మనకు తెలుస్తుంది. అలాగని అందరినీ ఒకటే గాటన కట్టేయలేము కూడా. ఎమ్‌సెట్ కౌన్సిలింగులో బి క్యాటగిరీ ఫీజు కట్టలేక ఒకమ్మాయి, అతని నాన్న వెనక్కిపోతుంటే కంట్లో నీళ్లు పెట్టుకున్న నాన్నలనీ నేను చూశాను.
విద్య, వైద్యం ప్రయివేటు పరమైనప్పుడు డబ్బు ఆదేశంబగును అని తెలుగు సంధి ఎలాగుంటుందో అలా కొత్త సంధి ఒకటి కనిపిపెట్టుకోవాలి మనం. ఆ విధంగా డబ్బు ఆదేశిస్తున్న ఈ సమాజంలో విద్య అందులోనూ వైద్య విద్యకు ఎంతటి డిమాండు ఉంటుందో చెప్పనక్కరలేదు. అదే విధంగా మానవత్వాన్ని కూడా డిమాండ్ చేయాలి మనం. కోట్ల రూపాయలు పెట్టి చదివినోళ్లు రేపు తమ అమ్మానాన్నలకు కూడా ఊరకే వైద్యం చేయరు. తోటకూరనాడే అని అప్పుడు పెద్దవాళ్లు ఎంత చింతించినా లాభం లేదు.
జంధ్యాల రఘుబాబు 9849753298
ఓ నాన్నా…….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



