మహారాష్ట్రలో టెట్ పేపర్లు లీక్..ముగ్గురి అరెస్టు..పరీక్ష వాయిదా
యువత జీవితాలతో బీజేపీ ప్రభుత్వాల చెలగాటం..రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనలు
ముంబయి: మహారాష్ట్రలో ఉపాధ్యా య అర్హత పరీక్ష (టెట్) – 2026 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. దీంతో ఈ నెల 28న ఆదివారం నాడు 1728 కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉన్న ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. టెట్ పరీక్షను మళ్ళీ ఎప్పడు నిర్వహించేది తర్వాత తెలియచేస్తామని పేర్కొంది. థానే జిల్లాలోని భివాండిలో ముగ్గురు వ్యక్తులు ఈ టెట్ ప్రశ్నాపత్రాలను విక్రయి స్తుండటంతో లీకేజీ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలో 2013లో చివరి సారిగా టెట్ నిర్వహించారు. అప్పటి నుంచి ఈ పరీక్ష మళ్లీ జరగలేదు. ప్రభుత్వాలు ఈ పరీక్షను నిర్వహించకుండా ఇప్పటి వరకూ సాగదీస్తూ వచ్చాయి. అయితే మళ్లీ ఇప్పుడు టెట్ నిర్వహి స్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పేపర్ లీక్ అయ్యింది.
దీంతో అభ్యర్థుల నిరాశలో కూరుకుపోయారు. భివాండి ఘటనలోనే ఏకంగా రూ.1.5 కోట్లకు ప్రశ్నాపత్రాన్ని విక్రయించినట్టు సమాచారం.దీనిపై ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి ఆగ్రహం వ్యక్తమవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ పవన్ బన్సోద్ నేతృత్వంలో 20 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు చేపట్టింది. ముగ్గురు నిందితుల ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ మొత్తంలో నగదు, పలు ప్రశ్నాప్రతాలను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షా మండలి అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి..అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించారు. సంబంధిత వ్యక్తుల దగ్గర వున్న కొన్ని ప్రశ్నలు, ఆదివారం జరగాల్సిన టెట్ పరీక్షలోని కొన్ని ప్రశ్నలు ఒకటే అని తేల్చారు. నిందితుల వివరాలను, కొన్నది ఎవరు? అమ్మింది ఎవరు? అసలు ఈ లీకేజీ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు అనే వివరాలను పోలీసులు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నేతలు ఉన్నందునే అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నీట్ పరీక్ష పేపర్ల లీకులు, వివిధ పరీక్షల ప్రశ్నాప్రతాల ఆన్‌లైన్ మూల్యాంకనాలకు సంబంధించిన అక్రమాలు, వినాశకర విద్యా విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరవధిక నిరాహార దీక్ష చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణమే ఈ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు హర్షవర్ధన్ సప్కల్ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వాలు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, పరీక్షలు నిర్వహించడం కూడా వారికి చేతకావడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టెట్ ప్రశ్నాప్రతం లీకేజిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. టెట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
అంగట్లో ప్రశ్నాపత్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



