రాష్ట్రాల అధికారాలను లాక్కునేందుకు కేంద్రం కుట్ర
కర్నాటక, కేరళం రాష్ట్రంతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధం
జులై 2న రాష్ట్ర క్యాబినెట్‌లో తుది నిర్ణయం
మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వీబీ గ్రామ్ జీ చట్టం–2025ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ యథాతథంగా అంగీ కరించబోదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం నిర్వహించారు. మంత్రులు దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోందని విమర్శించారు. ఇది కేవలం ఉపాధి హామీ చట్ట సవరణ మాత్రమే కాదనీ, భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిపైనే జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను క్రమంగా తగ్గించి, గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రాల పాత్రను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల భవిష్యత్‌ను తాకట్టు పెట్టే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదని తేల్చి చెప్పారు. అవసరమైతే ఈ చట్టంపై సుప్రీంకోర్టులో సవాలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని చెప్పారు. సమాఖ్య వ్యవస్థను విశ్వసించే ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. కర్నాటక, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. సమావేశంలో పాల్గొన్న 20 పౌరసంఘాలు కేంద్ర ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం స్వంత ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని వారు సూచించారని చెప్పారు. 60 రోజుల ఉపాధి పరిమితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ, ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 200 రోజుల ఉపాధి కల్పించాలనీ, చట్టబద్ధ కనీస వేతనాలు చెల్లించాలని పౌరసంఘాలు ప్రభుత్వాన్ని కోరాయని మంత్రి వివరించారు. కేంద్రం ప్రతిపాదించిన 60:40 నిధుల భాగస్వామ్య విధానం తెలంగాణపై వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపే ప్రమాదం ఉందనీ, ఈ అంశాన్ని రాష్ట్ర న్యాయశాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. పనితీరు బాగున్న రాష్ట్రాలను శిక్షిస్తూ, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించేలా కేంద్రం రూపొందించిన నిధుల కేటాయింపు విధానం అన్యాయమన్నారు. ఈ అంశంపై జులై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సమీక్షలో పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిశోర్, కమిషనర్ డి.దివ్య తదితరులు పాల్గొన్నారు.
వీబీ గ్రామ్ జీని అంగీకరించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



