Sunday, June 28, 2026
E-PAPER
Homeసోపతిసుజాత ఒక విషాదాంత జీవన గాధ

సుజాత ఒక విషాదాంత జీవన గాధ

- Advertisement -

మెరుపులు, ఆకర్షణలే ప్రధానంగా సాగే సినీ పరిశ్రమలో భారీ యాక్షన్‌ కథలకే ప్రాధాన్యం ఉండటం, అందులోనూ మహిళలు కేవలం అలంకారప్రాయమైన డాన్సులకు, పాటలకే పరిమితం కావడం పరిపాటి. అయినా అప్పుడప్పుడు కొందరు దర్శకులు ఈ ధోరణిని మారుస్తుంటారు. తద్వారా సవాలుతో కూడిన పాత్రలను పోషించి, ఆ సినిమాకు కొత్త కోణాన్ని జోడించి, కథను తమ పాత్ర చుట్టూ తిరిగేలా చేయగల నటీమణులు ప్రేక్షకులకు వాస్తవిక జీవితాన్ని చూపిస్తారు. అలాంటి తారలలో మూడవ తరానికి చెందిన, చెప్పుకోదగిన వారిలో ఒకరు సుజాత. భావోద్వేగం, గాంభీర్యం, హుందాతో కూడిన నటనకు ఆమె మారుపేరు.

సుజాత 1952 డిసెంబర్‌ 10న శ్రీలంకలోని గాల్‌ అనే ఊర్లో పుట్టింది. ఆ తర్వాత వారి కుటుంబం కేరళకు వలస వెళ్లింది. మొదట్లో ఆమె తన అన్న ప్రేరణతో నాటకాలలో నటించేది. ఆమె నటించిన మొదటి నాటకం ‘పోలీస్‌ స్టేషన్‌’. ఒకసారి ‘సినిమా మాసియా’ అనే మలయాళ పత్రికలో ఆమె ఫొటో వేశారు. ఇది చూశాక ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా వారి దష్టిలో పడి 1967లో 14వ ఏట కష్ణ నాయర్‌ తీసిన ‘తబస్విని’ అనే మలయాళ సినిమాలో మొదటిసారిగా నటించింది. తర్వాత ‘ఎర్నాకులం జంక్షన్‌’ అనే చిత్రంలో నటించింది. ఆమె తమిళ సినిమాల కథల మూస పద్ధతులను బద్దలు కొట్టే దర్శకుడు కె. బాలచందర్‌ దష్టిని ఆకర్షించింది. ఆయన దర్శకత్వంలో ‘అవల్‌ ఒరు తొడర్‌ కథై’ (1974) తమిళ చిత్రంలో నాయికగా నటించే అవకాశం వచ్చింది.

ఈ చిత్రంలో స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి ఆఫీసులో సహోద్యోగులతో కలిసి పనిచేసే ‘కవిత’ పాత్రలో ఆమెను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్య పోయారు. కానీ, ఆమె ఇంటికి వెళ్ళాక కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తూ, తల్లిని, తోబుట్టువులను కఠినంగా మందలిస్తుంది. తాగుబోతు సోదరుడిని నిలదీసి, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపడం వంటి దశ్యాలను చూసి ప్రేక్షకులు ఆమె నటనకు ముగ్ధులయ్యారు. ఈ సినిమా పూర్తిగా బలమైన మహిళా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సుజాత ఆ పాత్రలో అద్భుతమైన దఢత్వాన్ని ప్రదర్శిస్తూనే, అందులో సున్నితత్వాన్ని కూడా ఆవిష్కరించింది. ఇదే సినిమాను బాలచందర్‌ తెలుగులో ‘అంతులేని కథ’గా తీసినప్పుడు ఈ పాత్రను జయప్రద పోషించి అంతే పేరు తెచ్చుకున్నది.

‘అవల్‌ ఒరు తొడర్‌ కథై’ తర్వాత సుజాత సినీ జైత్రయాత్ర మొదలైంది. 1976లో ‘అన్నకిలి’ తర్వాత కె. బాలచందర్‌ మరో క్లాసిక్‌ ‘అవర్గల్‌’ (1977) వచ్చింది. ఈసారి ఆమె ‘అను’ అనే పాత్రలో నటించింది. ఒక బిడ్డ తల్లిగా క్రూరుడైన మాజీ భర్త, తన పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోని పాత ప్రేమికుడు, తన ప్రేమను పొందాలని ఆశిస్తున్న కొత్త వ్యక్తి, వీరి మధ్య ఆమె పడే సంఘర్షణే ఈ సినిమా ఇతివత్తం. ఇదే ఆ తర్వాత తెలుగులో ‘ఇది కథ కాదు’గా వచ్చింది. మరొక చిత్రం ‘నూల్వెలి’. ఇందులో ఆమె రచయిత్రిగా, సెన్సార్‌ బోర్డ్‌ సభ్యురాలిగా ఎంతో హుందాగా నటించారు. గ్లామర్‌ హవా పెరిగి గంభీరమైన నటనకు సవాలు ఎదురవుతున్న తరుణంలో కూడా ఆమె తనదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ‘విధి’ (1984) వంటి చిత్రాలలో బలమైన మహిళా ప్రధాన పాత్రలను పోషించింది. ఇందులో అత్యాచారానికి గురైన తన క్లయింట్‌కు న్యాయం చేయడానికి పోరాడే న్యాయవాదిగా ఆమె అద్భుతంగా నటించింది. అయితే కాలక్రమేణా ఆమె తన వయసు, కెరీర్‌ దశకు ముందే తమిళ చిత్రసీమలో ఒక సాధారణ ధోరణిగా మారిపోయిన ‘తల్లి’ పాత్రలను పోషించడం మొదలుపెట్టింది. తెల్లని చీరలు ధరించి, సాత్వికమైన నటనకు అవకాశం వుండే తల్లి పాత్రలు పోషించింది. ఉదాహరణకు ‘ఉళైప్పాలి’, ‘బాబా’ సినిమాల్లో రజనీకాంత్‌కు తల్లిగా నటించింది. ఆ తర్వాత ‘అవల్‌ వరువాలా’, ‘అరుల్‌’, ‘అట్టహాసం’ వంటి సినిమాల్లోనూ ఆమె అటువంటి పాత్రలే పోషించింది. ఆమె నటించిన చిరస్మరణీయమైన చివరి పాత్ర భారీ విజయం సాధించిన ‘వరలారు’ (2004)లో అజిత్‌కు అత్తగా నటించింది.

తల్లి, అత్త పాత్రలు పోషించినప్పటికీ అందులోనూ ఆమె తనదైన ప్రత్యేకత ముద్రను వేసింది. ఆయా పాత్రలకు ఉండే దఢత్వం, వ్యక్తిత్వం, దేనికీ లొంగని, వెనకడుగు వేయని దక్పథం ఆమె నటనలో కనిపించేవి. అయితే కెరీర్‌ ప్రారంభంలో ఆమె ప్రతిభను వినియోగించుకున్నంత సమర్థవంతంగా, తర్వాతి కాలంలో తమిళ చిత్రసీమ ఆమె సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది. నిజల్‌ నిజమాగిరదు (1978), ఆరిలిరుందు అరుబదు వరై (1979), విధి (1984), ఒరు ఖైదియిన్‌ డైరీ (1985), అపూర్వ సహోదర గళ్‌ (1989) వంటి తమిళ చిత్రాలతో తన కెరీర్‌ చివరి దశలో ఎక్కువగా తల్లి పాత్రలు పోషించినప్పటికీ, తమిళ సినీ అభిమానులు ఆమెను ప్రధానంగా ‘కవిత’ పాత్రకు ప్రాణం పోసిన నటిగానే గుర్తుంచుకున్నారు. కానీ తెలుగు సినిమా పరిశ్రమ ఆమెను శక్తివంతమైన తల్లిపాత్రలలో గొప్పగా చూపించినవి. ఉరవు సొల్ల ఒరువన్‌ (1975), అన్నకిలి (1976), అవర్గళ్‌ (1977), గుప్పెడు మనసు (1979) వంటి చిత్రాలకు సుజాత సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను కూడా గెలుచుకున్నది. ఆమె పాత్రలు అన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నవి. ఆమె తునైవి (1982) పరిట్చైక్కు నేరమాచు (1982) వంటి చిత్రాలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది.

1970, 80లలో సుజాత శివాజీ గణేశన్‌, శివకుమార్‌, జయశంకర్‌, కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, కె. భాగ్యరాజ్‌, మోహన్‌లాల్‌ వంటి అగ్రశ్రేణి నటుల సరసన నటించి ప్రముఖ నటిగా ఎదిగింది. మావీరన్‌ (1986), కోడి పరాకుత్తు (1989), ఉజైప్పాలి (1993), బాబా (2002) చిత్రాలలో రజనీకాంత్‌ తల్లిగా నటించింది. అజిత్‌ చిత్రాల్లో ఆమె వరువాలా (1998), విలన్‌ (2002), అట్టహాసం (2004) చిత్రాలలో తల్లి పాత్రలు పోషించింది. తెలుగువారికి మొదటిసారిగా ‘గోరింటాకు’ (1979)లో ఆమె శోభన్‌ బాబుతో హీరోయిన్‌గా చేసింది. తన సహజ నటనతో ఒక ఆసక్తికరంగా మలుపు తిరిగే ప్రేమకథలో తన ప్రేమను త్యాగం చేస్తుంది. అలాంటి పాత్రల వల్లనే తెలుగు వారికి చేరువయ్యింది. గోరింటాకులో తెలుగు రాకపోవడం వల్ల ఆమెకు ఇతరులు డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలుగు నేర్చుకుని తన పాత్రలకు తానే డబ్బింగ్‌ చెప్పుకునేది. ఆ తర్వాత సుజాత సర్కస్‌ రాముడు (ఎన్టీఆర్‌ హీరో), ప్రేమ తరంగాలు, బెబ్బులి, సిరిమల్లె నవ్వింది, సీతాదేవి, ఎమ్మెల్యే ఏడుకొండలు, అనుబంధం, అగ్ని గుండం, జస్టిస్‌ చక్రవర్తి వంటి చిత్రాలలో నటించింది. చంటి, సూరిగాడు, పెళ్లి, స్నేహం కోసం, నీకు నేను – నాకు నువ్వు, జెమిని, చిత్రాల్లో తల్లి పాత్రలో కూడా ఆమె నటన సినిమా విజయాలకు కారణమయింది.

ఉదాహరణకు ‘పెళ్లి’ చిత్రంలో కొడుక్కు విషమిచ్చి చంపడం, చంటిలో ఒక ఉదాత్తమైన తల్లిపాత్ర, ఎమ్మెల్యే ఏడుకొండలు, సూరిగాడు, సుబ్బరాజు కుటుంబం, నాన్నగారు వంటి చిత్రాలలో దాసరికి జోడీగా నటించడం ఆమెకే సాధ్యమైంది. శోభన్‌ బాబుతో కలిసి ఆమె వంశగౌరవం, పండంటి జీవితం వంటి సినిమాలలో చేసిన నటన తెలుగు మహిళలు మర్చిపోలేరు. శ్రీరామదాసులో దమ్మక్క పాత్రలో ఆమె జీవించింది. ఎన్టీఆర్‌, అక్కినేని, శోభన్‌ బాబు, కష్ణ, కష్ణంరాజు వంటి అగ్రతాలతో ఆమె జోడిగా నటించింది. శోభన్‌ బాబు తర్వాత అక్కినేనితో నటించిన ఏడంతస్థుల మేడ, బహుదూరపు బాటసారి, అనుబంధం, సూత్రధారులు సినిమాలు సుజాతకు మంచి పేరు తెచ్చినవి. సూత్రధారులులో కొడుకు కలెక్టరై ఊరికి వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని వ్యక్తపరచడానికి గది తలుపులు మూసి అక్కినేని బుగ్గ మీద ముద్దు పెట్టి ‘ఎంత మంచి కొడుకుని ఇచ్చావయ్యా’ అంటూ సుజాత చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల హదయాలను హత్తుకుంటుంది. దాసరిగారైతే ఏకంగా ‘సుజాత’ అన్న పేరు మీద ఒక సినిమానే తీశాడు. నిజానికి ఆమె డైరెక్టర్స్‌ నటి. సుజాత తెలుగు, తమిళ, మలయాళంలోనే గాక కన్నడ, హిందీ భాషల్లో సుదీర్ఘకాలం పాటు 300 పైగా చిత్రాలలో నటించింది. హిందీ చిత్ర రంగంలో ఒక ప్లేయిన్‌ యాక్ట్రెస్‌గా పేరొందిన నూతన్‌తో సుజాతను పోల్చవచ్చు. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా వెంగమాంబ.

నటిగా సంతప్తికరమైన జీవితం గడిపిన సుజాత వైవాహిక జీవితం మాత్రం విషాద భరితం అనే చెప్పాలి. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న జై శంకర్‌ ఆమెకు నరకం చూపించాడు. సుజాత తెరమీద తన సాత్వికాభినయంతో ఎంత ప్రొఫెషనల్‌గా కనిపించేదో ఆమె వ్యక్తిగత జీవితం అంత సంఘర్షణలతో గడిచిపోయింది. ప్రేమించి పెద్దల్ని ఎదిరించి తమ ఇంటి యజమాని కొడుకు జయశంకర్‌ని పెళ్లి చేసుకుంది. అతను పచ్చళ్ళు వ్యాపారం చేసేవాడు. వాటిని విదేశాలకు పంపించేవాడు. పెళ్లి తర్వాత సినిమాలను వదిలిపెట్టి వారిద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. గర్భవతి అయిన తర్వాత అమెరికాలోని పద్ధతులు నచ్చక ఆమె తిరిగి ఇండియా వచ్చేసింది. భర్త కూడా తర్వాత ఆమె దగ్గరికి వచ్చాడు. తిరిగి వచ్చాక వ్యాపారం నష్టాలు తేవడంతో పూర్తిగా భార్య సంపాదన మీదే ఆధారపడ్డాడు. సుజాతతో కలిసి షూటింగులకు వెళ్లేవాడు.

ఆమె నవ్వుతూ ఎవరితోనైనా మాట్లాడితే చాలు అనుమానం పెంచుకుని ఇంటికి వెళ్ళాక మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. మంచానికి కట్టేసి బెల్టుతో బాదేవాడు. అందుకే ఆ తర్వాత సుజాత సెట్టులో ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేది. భర్త ఎంత హింసిస్తున్నా భరిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. సుజాత కొడుకు సాజిద్‌ సాఫ్ట్‌వేర్‌గా, కుమార్తె దివ్య డాక్టర్‌గానూ స్థిరపడ్డారు. అయితే విపరీతమైన మానసిక ఒత్తిడి సుజాత ఆరోగ్యానికి కృంగ తీసింది. రెండు కిడ్నీలు దెబ్బతిన్నవి. కనీసం నడవలేని స్థితిలో తన చివరి రోజులను గడిపింది. తన సహజమైన నటనను, అమాయకపు చిరునవ్వును, మేకప్‌ అక్కర్లేని ఒక దక్షిణ భారత సినీ నాయికగా మనపై చెరగని ముద్ర వేసి 2011 ఏప్రిల్‌ 6న గుండెపోటుతో కన్ను మూసింది. ఆమెదొక ఒక విషాదాంత జీవన గాధ.

హెచ్‌ రమేష్‌ బాబు,
7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -