ఓట్లు తొలగిస్తారని ప్రజల్లో ఆందోళనఅప్రమత్తమైన బీజేపీయేతర పార్టీలు
కార్యకర్తల నుంచి నాయకత్వం వరకు అలర్ట్
వరుస సమీక్షలు.. అవగాహనా సదస్సులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో సర్వత్రా ‘సర్’ భయం పట్టుకుంది. ప్రక్రియ ప్రారంభమై నేటికి నాలుగో రోజు. ఇంటింటి గణనలో బాగంగా బీఎల్‌ఓల ఓటర్ నమోదు ఫారాల అందజేత ప్రక్రియ సాఫీగా సాగుతున్నా… మ్యాపింగ్ కాని 89.88లక్షల ఓటర్లలో మాత్రం ఆందోళన నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియ ప్రతి ఏటా జరిగే ఓటర్ సవరణ జాబితా కాదు. 24 ఏండ్ల క్రితం(2002) నాటి పాత ఓటర్ల జాబితాను ప్రస్తుత (2025) ఓటర్ల డేటాతో లింక్ చేస్తూ నిర్వహిస్తున్న అత్యంత లోతైన క్షేత్రస్థాయి సర్వే. ఓటర్ల జాబితాలోని అక్ర మాలను తొలగించి పారదర్శకత తీసుకు రావడమే దీని ముఖ్య ఉద్దేశమని ఎన్నికల సంఘం చెబుతు న్నప్పటికీ… ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవు తోంది. సర్ ప్రక్రియ పూర్తయిన బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలిగించిన నేపథ్యంలో ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృ తం అందుతుందేమోననే భయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి నగరాల్లో పెద్ద ఎత్తున ఓట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. మ్యాపింగ్ కాని వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన అధారాలు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ కార్డులు, జన్మ ధృవీకరణ పత్రం, పాస్ పోర్ట్, టెన్త్ సర్టిఫికెట్, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, భూమి/ఇంటి కేటాయింపు మొదలగు 12 డ్యాక్యుమెంట్లను ఎన్నికల సంఘం అనుమతించింది. మ్యాపింగ్ పూర్తి కాని వారిలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు బతుకు దెరువు కోసం వలస వచ్చిన వారే ఉన్నారు. వలస కార్మికులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేదలకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆధారాలు సమర్పించడం సాధ్యం కాదు. అలాంటప్పుడు వారి ఓట్లను తొలగిస్తే వారు రేషన్ కార్డుతో పాటు సంక్షేమ పథకాలకు దూరమవుతారు. జన్మతా భూమి పుత్రులైన వారు కూడా సర్ పుణ్యమాని తమ జన్మతను రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సీపీఐ(ఎం), సీపీఐ తదితర రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికల సందర్భంలో ప్రజలతో ఎలా మమేకమై ఓటింగ్‌కు సమాయత్తం చేశాయో… సర్ ప్రక్రియలో బాగంగా చేపడుతున్న ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేసేందుకు చర్యలు చేపట్టాయి. క్షేత్ర స్థాయిలో వరుస సమీక్షలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఆక్టోబర్ 1న తుది జాబితా ప్రచురించే వరకు సర్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి.
మీ ఓటు… మీ హక్కు: కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. ‘మీ ఓటు.. మీ హక్కు’ అనే నినాదంతో ఓటర్లకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని గాందీ భవన్‌లో సర్‌పై ప్రత్యేక వార్ రూం ఏర్పాటు చేసింది. ప్రతి 10 రోజుల కొకసారి అధినాయకత్వం సమీక్ష నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియ మించారు. ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ తదితర అగ్ర నేతలు పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ సర్పంచ్‌లు, పట్టణాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధారాలు లేవనే సాకుతో ఏ ఒక్క అర్హుని ఓటు తొలిగించకుండా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులను కాంగ్రెస్ అప్రమత్తం చేసింది.
ముందస్తు నోటిసివ్వాలి: బీఆర్‌ఎస్
నకిలీ లేదా వలస ఓటర్లుగా అనుమానించబడిన వారి విషయంలో ముందస్తు నోటీసు, సరైన విచారణ, సక్రమ మైన ప్రక్రియ లేకుండా ఏ నిజమైన ఓటరును తొలగించ కూడదని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే సందర్బంలో నకిలీ ఓట్లను తొలగించాల్సిందేనని ఆ పార్టీ అంటోంది. ‘ఒకవ్యక్తికి ఒకే ఓటు’అనే నినాదాన్ని ఆ పార్టీ ఎత్తుకుంది. ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. డీ-డూప్లికే షన్ సాఫ్ట్‌వేర్, టెక్స్ట్ మ్యాచింగ్, ఫోటో సారూప్యత తనిఖీలు, ఆధార్-ఓటర్ ఐడి అనుసంధాన ధృవీకరణ వంటి సాంకేతి కతను ఉపయోగించి జాతీయ స్థాయిలో ధృవీకరణ ప్రక్రియ ను చేపట్టాలని కోరింది. పార్టీ అగ్ర నేతలు, కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సర్‌పై అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
సర్ పేరుతో ఓట్లు తొలగిస్తే ఊరుకోం:
నెల్లికంటి సత్యం, ఎమ్మెల్సీ, సీపీఐ
సర్ పేరుతో రాష్ట్రంలోని అర్హుల ఓట్లను తొలగిస్తే సీపీఐ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎల్లవేళలా పార్టీ వారికి అండగా ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మైనార్టీ, దళితులు, గిరిజనుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోంది. బెంగాల్, బీహార్ తదిర రాష్ట్రాల్లో చేసిన విధంగా ఇక్కడ కుదరదు. చైతన్యవంతమైన తెలంగాణలో ఆ పార్టీ ఆటలు సాగవు. సీపీఐ శ్రేణులను రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం చేశాం. అనర్హులను తీసేసే పేరుతో ఏ ఒక్క అర్హునికి అన్యాయం జరగడానికి వీల్లేదు.
బీజేపీ వ్యతిరేకుల ఓట్ల తొలగింపే సర్
ఎండీ.అబ్బాస్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సీపీఐ(ఎం)
దేశ వ్యాప్తంగా బీజేపీ కాని వారి ఓట్లను తొలగించేందుకే సర్ ప్రక్రియను ఆ పార్టీ వాడుకుంటోంది. తమకు ఓట్లు తక్కువగా వచ్చే బూత్‌లను గుర్తించి వాటిని ఎన్నికల సంఘం సాయంతో తొలగిస్తోంది. బీజేపీ చేస్తున్న కుట్రలను అమలు కాకుండా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశాం. రాష్ట వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ఓటర్లలో చైతన్యం కల్గిస్తున్నాం. సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిం చాలి. సర్ ప్రక్రియ సమయాన్ని పెంచడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలన్నింటిని అనుమతించాలి. పెండ్లైన వారి ఇంటిపేరునే పరిగణలోకి తీసుకోవాలి. షార్ట్ ఫాం ఇంటి పేర్లను గుర్తించాలి. 2002 గుర్తింపు ప్రక్రియలో 1987కు ముందు జారీ చేసిన డాక్యుమెంట్ల నిబంధనను తొలగించాలి.
,



