Sunday, June 28, 2026
E-PAPER
Homeసోపతిమనసొక దిగులు బావి

మనసొక దిగులు బావి

- Advertisement -

ఎంత తోడినా తరిగిపోని బాధల తడి
కనురెప్పల కడవతో
కన్నీటి చుక్కలు చెదినా…
లోతుల్లో దాగిన క్షోభ తీరదే…
మట్టిపొరల్లా మళ్లీ పైకొస్తుంది…
ఒక్క జ్ఞాపకం రాయి పడితే
అలలై అల్లకల్లోలమౌతుంది యెద బావి…
ఒక్క మాట గాయం చేస్తే…
గుండె గర్భంలో గబ్బిలంలా..
చీకటి దిగులు వేలాడుతుంది…
నిజంగానే.. మనసొక దిగులు బావి
కాలం తాడు వేసి ఎన్నిసార్లు కొలిచినా….
అంతుచిక్కని అగాధం అది
కత్రిమ నవ్వులు విసిరినా.. వెగటు
నీడల జాడలు చెదరని ప్రతిబింబాలు…
ఓదార్పుల గాలులు వీచినా…
వేదన వేర్లు పెకలని లోతు
అక్కడ దుఃఖాలకు ఔషధాలు దొరకని స్థితి
కొన్ని గాయాలకు లేపనాలే ఉండని దుస్థితి
దిగులు బావి అంచు వెంట
ఎన్ని ధైర్యపు దోనెలను దించానో….
ప్రతి అంధకార మనసు బావిలోనూ…
ఒక వెలుగు ఊట దాగి ఉంటుందనే నమ్మకం
ప్రతి దిగులు గుండెలోనూ..
సంతోషాల జలధార పుడుతుందనే విశ్వాసం
ప్రతీ రేపటిని చూస్తుంది..మనసు..!
– డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -