కలెక్టరేట్ ముట్టడి.. రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు
తోపులాటలో పలువురికి గాయాలు
నేతల అరెస్ట్.. శ్రేణుల అడ్డగింత…హన్మకొండలో ఉద్రిక్తత
గుడిసెలు కూల్చితే ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలి : కూనంనేని
జులై 6న చలో హైదరాబాద్‌కు పిలుపు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పేదల గుడిసెల కూల్చివేతలపై వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జోలికొస్తే ఇబ్బందులు తప్పవ్.. గుడిసెలు కూల్చితే ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అంటూ హెచ్చరించారు. ఓరుగల్లు పోరాటాల గడ్డ.. ఇక్కడి నుండే పేదలకు ఇండ్ల పట్టాలివ్వా లన్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. శనివారం హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించేందుకు మహాప్రదర్శన.. రాస్తారోకో చేపట్టగా పోలీసులు అడ్డుకుని నేతలను అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో పలువురికి గాయాల య్యాయి. ఆ తర్వాత అరెస్టులను నిరసిస్తూ కార్యకర్తలు ఎక్కడికక్కడా రోడ్లపై బైటాయిం చారు.హన్మకొండలోని గోపాల్‌పూర్, గుండ్లసింగారంలోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వామపక్షాలు సంయుక్తంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపుని చ్చాయి. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఎంసీపీఐ(యు), న్యూడెమొక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హన్మకొండ ఏకశిల పార్క్ నుంచి మహాప్రదర్శన చేపట్టా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు ఇస్తూ ముందుకు కదిలారు. ఈ నేపథ్యంలో హన్మకొండ ఏసీపీ నర్సింహారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రదర్శన అదాలత్ వద్దకు చేరుకోగానే రాస్తారోకోకు వామపక్ష నేతలు, కార్యకర్తలు బైటాయిం చారు. విషయం తెలుసుకున్న ఏసీపీ నర్సింహారావు పోలీసు బలగాలతో అదాలత్‌కు చేరుకొని నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వామపక్ష పార్టీల శ్రేణులకు మధ్య తోపులాట జరగడం తో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాల య్యాయి. అక్రమ అరెస్టులకు నిరసనగా అదాలత్ వద్ద నాలుగు బాటల్లో వామపక్ష శ్రేణులు బైటాయించి నిరసన తెలిపాయి.
ప్రజలే ప్రభుత్వాన్ని కూలుస్తరు : జాన్‌వెస్లీ
గుడిసెలను కూల్చితే ప్రజలే ప్రభుత్వాన్ని కూలుస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చిన చోటే మళ్లీ గుడిసెలేస్తామని, ఇందుకు తెగించి పోరాడేందుకు సిద్ధం కావాలని పేదలకు పిలుపునిచ్చారు. పేదలకు నివాస స్థలాలు లేక, కిరాయిలు కట్టలేక ప్రభుత్వ భూములలో 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుంటే కూల్చేయడం సరికాదన్నారు. గుడిసెలను కూల్చే పనిని మానుకోవాలని, కూల్చిన చోటే పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు కొనలేని వారు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక పట్టాలి స్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందన్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పేదల గుడిసెలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ హిట్లర్ వారసుడిని అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అండగా నిలబ డితే గుడిసెలు కూల్చడం ఆగుతుందన్నారు. హైడ్రాను తెచ్చి పేదల ఇండ్లు కూల్చుతు న్నారన్నారు. కానీ, పేదవాడు తెగిస్తే ఎవడూ అడ్డురారని, ప్రభుత్వ స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయిస్తామని చెప్పారు. జులై 1వ తేదీన కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు, 6న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలన్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్మేయ కూనంనేని సాంబశివరావు
ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెలను కూల్చివేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. పేదలు ఆక్రమణదారులు కాదని, కబ్జాదారులు అసలే కాదని చెప్పారు. ఇక్కడి నుంచే పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలన్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. గుండ్లసింగారం, గోపాలపురంలో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారన్నారు. అధికార పార్టీతో సందర్భానుసారం మాత్రమే కలిశామని, అయినా మేం పేదల పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. పేదలకు ఎర్ర జెండా అండగా ఉంటుందన్నారు. వామపక్ష పార్టీలన్నీ కలిసి పేదల సమస్యలపై ఒక్కటై పోరాడాలని నిర్ణయించాయని తెలిపారు. వేలాది మందితో జులై 6న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ పోరాటంలో పేదలందరూ భాగస్వాములు కావాలని కూనంనేని పిలుపునిచ్చారు.
ఓట్లప్పుడు డబ్బా.. ఇప్పుడు భస్మాసుర హస్తం..
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
ఓట్లప్పుడు డబ్బా కొట్టి ఓట్లు అడిగారని, ఎన్నికల్లో ప్రజలు
కేసీఆర్‌ను పక్కనపెట్టి రేవంత్‌రెడ్డిని తీసుకొస్తే ఇప్పుడు భస్మాసుర హస్తం పెడుతున్నారని సీపీఐఎంఎల్ (మాస్‌లైన్) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. పేదల ఇండ్లు ఎవరికి అడ్డమొస్తున్నాయని ప్రశ్నించారు. పేదలు ప్రభుత్వ స్థలాల్లో వేసుకున్న గుడిసెలను అర్ధరాత్రి కూల్చడం దుర్మార్గమన్నారు.
ఐక్య పోరాటాలతో ముందుకు : గాదెగోని రవి
పేదలు గుడిసెల కూల్చివేత ఆపాలని, వారికి పట్టాలిచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదెగోని రవి అన్నారు. ఈ విషయంలో వామపక్షాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని, పేదలకు ఎర్రజెండా పార్టీలే అండగా ఉంటాయని తెలిపారు. బాలసముద్రం, ఆజాంజాహి మిల్లు భూములను వేలం వేస్తోందని, భూ మాఫియాకు కట్టిపెట్టడానికి ప్రభుత్వం పావులు కదుపుతోందని విమర్శించారు.
వామపక్ష నేతల అరెస్ట్
రాస్తారోకో నేపథ్యంలో వామపక్ష నేతలు జాన్‌వెస్లీ, కూనంనేని సాంబశివరావు, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జి.ప్రభాకర్‌రెడ్డి, కర్రె బిక్షపతి, సింగారపు బాబు, కారు ఉపేందర్ తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) వరంగల్, హన్మకొండ జిల్లాల కార్యదర్శులు సిహెచ్.రంగయ్య, జి. ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ వరంగల్, హన్మకొండ జిల్లాల కార్యదర్శులు షేక్ భాసుమియా, కర్రె బిక్షపతి, ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శులు ఎన్‌రెడ్డి హంసారెడ్డి, పెద్దారపు రమేష్, నూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు, నాయకులు ఎం.చుక్కయ్య, నలిగంటి రత్నమాల, బొట్ల చక్రపాణి, టి.ఉప్పలయ్య, సింగారపు బాబు, గొడుగు వెంకట్, వి.వీరన్న, కారు ఉపేందర్, కాడబోయిన లింగయ్య, దొగ్గెల తిరుపతి, మంద సంపత్, దీప, నేదునూరి జ్యోతి, పంజాల రమేశ్, ఆదరి శ్రీనివాస్, తోట బిక్షపతి, దండు లక్ష్మణ్, మద్దెల మల్లేశ్, మాలోతు సాగర్, ముక్కెర రామస్వామి, గడ్డం నాగార్జున, కొత్తపల్లి రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
గుడిసెల కూల్చివేతపై వామపక్షాల ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



