నేడు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
టెట్ పేపర్ లీక్ తో కేంద్రం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేదని నిరూపితమవుతోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆదివారం జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరుగుతున్న నిరవధిక ఆందోళనలో సోనమ్ కూడా పాలుపంచుకుంటున్నారు. ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేపట్టిన దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము జంతర్ మంతర్‌ను విడిచిపెట్టబోమని ప్రకటించారు. నీట్ వివాదం తరువాత, మహారాష్ట్రలో టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పేపర్ లీక్ ఘటన పోటీ పరీక్షల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి ఎత్తిచూపిందన్నారు.
మహారాష్ట్రలో టెట్ పరీక్ష జరగడానికి ఒక్క రోజు ముందు పరీక్షను వాయిదా వేయడంపై ఆయన ఈ విధంగా ప్రస్తావించారు. “ముందు నీట్, ఇప్పుడు మహారాష్ట్ర టెట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి చివరి నిమిషంలో రద్దయింది. 2017 నుంచే టెట్ కుంభకోణాల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు గళమెత్తుతున్నా, వ్యవస్థను సరిదిద్దడానికి బదులుగా అధికారులు మన యువతను అంధకారంలోకి నెట్టేస్తున్నారు” అని అన్నారు. “ఇప్పుడు స్పష్టమైంది. మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్ ఘటన, రాష్ట్ర స్థాయి అయినా లేదా జాతీయ స్థాయి అయినా, బీజేపీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేదని నిరూపిస్తోంది. రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ వైపు తిప్పుకోవడం తప్ప వారికి చేతనైన పని మరొకటి లేదు” అని విమర్శించారు.‘‘ రాజకీయ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?. ఎంపీలను కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది?” అని ఆయన నిలదీశారు. యువత భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదని, ఈ సమస్యపై గళం విప్పాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జూన్ 28న జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలో పాల్గొనాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలకు పిలుపునిచ్చారు.
ఒక్క పరీక్షా సరిగ్గా నిర్వహించలేదు
- Advertisement -
- Advertisement -



