– ప్రతి పేద కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ వర్తింపు
– మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
– రెండు రోజుల్లో రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం : ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ
నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ చేసిన ఆరు గ్యారంటీల్లో రెండింటినీ రెండు రోజుల్లోనే ప్రభుత్వం అమలు చేసిందని, ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో తెచ్చిన మహాలక్ష్మి పథకాలను సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం జోగిపేట బస్టాండ్ ఆవరణలో ఆదివారం మంత్రి ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బస్సులను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీని మొదలుపెట్టామని, అదే ఆరోగ్యశ్రీతో ప్రతి పేద కుటుంబానికి రూ.10 లక్షల వరకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని అందజేస్తామన్నారు. రూ.ఐదు లక్షల పరిమితిని రూ.పది లక్షలకు పెంచినట్టు తెలిపారు. పేదవాడు ఆరోగ్యానికి సంబంధించి అప్పులపాలు కావొద్దని, కాంగ్రెస్ సర్కారు ప్రజల వెంట ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. తెలంగాణ మహిళలు ఏ పుణ్యక్షేత్రమైనా, మారుమూల ప్రాంతమైనా వెళ్లేలా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మొదలుపెట్టామన్నారు. ఇది కాంగ్రెస్ రెండో వాగ్దానమని చెప్పారు. ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జడ్పీ సీఈఓ ఎల్లయ్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు.