ఉత్తరాఖండ్‌లోని టెన్నెల్‌ ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని టెన్నెల్‌ ప్రమాదం– కార్మికులను రక్షించిన కార్మికులకు సీఐటీయూ సన్మానం
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడంలో కార్మికులే కీలక పాత్ర పోషించారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. దేశంలోని కార్మికులకు తగిన వేతనాలు, ఇతర ప్రయోజనాలను డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ప్రధాన కార్యాలయం బీటీఆర్‌ భవన్‌లో కార్మిక సంఘాలన్నీ ఉమ్మడిగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడిన కార్మికులను సన్మానం చేశారు. మిషన్‌లో పాల్గొన్న పన్నెండు మందికి సన్మానం చేశారు. రెస్క్యూ మిషన్‌ చాలా కష్టతరమైనదని జట్టుకు నాయకత్వం వహించిన వకీల్‌ హసన్‌ తెలిపారు. కార్మిక వర్గాన్ని విభజించేందుకు ఒక వర్గం నిరంతరం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రెస్క్యూ మిషన్‌లో మత భేదాలు పట్టింపు లేదని, పరస్పర అపనమ్మకం, విభజన సృష్టించే అన్ని ఎత్తుగడలకు స్వస్తి పలకాలని హసన్‌ పిలుపునిచ్చారు. 26 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తూనే చిక్కుకుపోయిన వారి కుటుంబాల గురించి ఆలోచించినట్టు కార్మికుల వద్దకు తొలుత చేరుకున్న మున్నా ఖురేషీ తెలిపారు. అన్నింటికంటే, ఐదుగురు హిందూ సోదరులు, ఏడుగురు ముస్లిం సోదరులు మిషన్‌ను విజయవంతం చేశారని తెలిపారు. ఖురేషీ మతపరమైన విభేదాలను కొట్టిపారేశారు. ఇతర కార్మికులు మోను, అన్సారీ తదితరులు మాట్లాడారు. కాగా, సమావేశంలో ఢిల్లీ సైన్స్‌ ఫోరం ప్రతినిధి డి.రఘునందన్‌ మాట్లాడుతూ సిల్క్యారా టన్నెల్‌ సహా చార్తామ్‌ ప్రాజెక్టు పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. సొరంగం తప్పించుకునే మార్గం కూడా లేదని అన్నారు.
900 కిలో మీటర్ల పొడవైన ప్రాజెక్ట్‌ పర్యావరణ ప్రభావ అంచనాను దాటవేయడానికి ప్రభుత్వం దీనిని 50 చిన్న ప్రాజెక్టులుగా మార్చిందని విమర్శించారు. సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా తీసుకోలేదన్నారు.
సిఐటియు, ఏఐటియుసి, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్టీయూసీ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవా, ఎల్పిఎఫ్‌, ఏఐసీసీటీయూ, యూటీయూసీ, ఎంఈసీ, యూటీయూసీ, ఎంఈసీ, ఐసీటీయూ, ఐఎఫ్టీయూ, ఎంఈసీ, ఐసీటీయూ, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం జరిగింది.

Spread the love