నవతెలంగాణ – కామారెడ్డి
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకంకు జూలై 1 నుంచి ఆగస్టు 31 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జపాన్, జర్మనీ దేశాల్లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందజేయబడుతుందని పేర్కొన్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు విదేశీ విద్య ప్రవేశ పరీక్షలు లేదా ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షల్లో నిర్ణీత అర్హత మార్కులు సాధించి ఉండటంతో పాటు, డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు పొందాలి. అలాగే మీ సేవ కేంద్రం ద్వారా ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందాలి. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థులు పాస్పోర్టు, వీసా కలిగి ఉండటంతో పాటు, గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ప్రవేశ పత్రం పొందియుండాలి. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఆగస్టు 31 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ ఆ ప్రకటనలో కోరారు.


