నవతెలంగాణ – హైదరాబాద్ : ఐసీసీ తాజాగా విడుదల చేసిన ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత యువ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్, తన సహచర ఆటగాడు అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. దాదాపు ఏడాది పాటు అగ్రస్థానంలో కొనసాగిన అభిషేక్ శర్మ ఆధిపత్యానికి ఇషాన్ తెరదించాడు. మరోవైపు టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన కెరీర్‌లో తొలిసారి నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత ఆటగాడు శివమ్ దూబే మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు.
టీ20 ఫార్మాట్‌లోనే కాకుండా టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ భారీ మార్పులు జరిగాయి. న్యూజిలాండ్‌తో జరిగిన నాటింగ్‌హామ్ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జో రూట్ విఫలం కావడంతో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ నంబర్ 1 స్థానానికి చేరాడు. దీంతో బ్రూక్ రెండో స్థానానికి, రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయారు. ఇదే సమయంలో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బూమ్రా, న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీని వెనక్కి నెట్టి టెస్ట్ బౌలింగ్‌లో తిరిగి ఏకైక నంబర్ 1గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ విజయం ఆ జట్టు ఆటగాళ్ల ర్యాంకులపై సానుకూల ప్రభావం చూపింది. బ్యాటింగ్ విభాగంలో రచిన్ రవీంద్ర ఏడో స్థానానికి, డారిల్ మిచెల్ 11వ స్థానానికి, డెవాన్ కాన్వే 15వ స్థానానికి చేరుకున్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, తన కెరీర్‌ను టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో మూడో స్థానంతో ముగించడం విశేషం. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన వెస్టిండీస్ పేసర్లు షమర్ జోసెఫ్ (14వ ర్యాంకు), కెమర్ రోచ్ (17వ ర్యాంకు) కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.



