– ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ
– విద్య, క్రీడలు, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
– బాయ్స్ హైస్కూల్‌కు రూ.5 కోట్లు
– ఇందిరాగాంధీ స్టేడియం ఆధునికీకరణ
– దోమకొండలో రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య, క్రీడలు, వైద్యం, సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్న ఆయన, బాయ్స్ హైస్కూల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.
పాఠశాలలో ఏసీ తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ లైబ్రరీతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి రాష్ట్రానికి ఆదర్శ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, రూ.9 కోట్లతో 8 లేన్ అథ్లెటిక్స్ ట్రాక్, టెన్నిస్ కోర్టులు, యోగా భవన్, జిమ్, షూటింగ్ రేంజ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మిస్తామని చెప్పారు. దోమకొండలో రూ.10 కోట్లతో ఫైర్ స్టేషన్, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు లభించాయని వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, రైతులకు సాగునీటి సౌకర్యాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కాలేశ్వరం (ప్రాణహిత–చేవెళ్ల) ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి కామారెడ్డి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితో ప్రత్యేకంగా చర్చిస్తామని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐరిని సందీప్ కుమార్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, దోమకొండ సర్పంచ్ ఐరిని నరసయ్య, గంగాధ, తిరుమల గౌడ్ సుతారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



