నవతెలంగాణ–జన్నారం
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ ఆదేశాల మేరకు బుధవారం జన్నారంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వరద బాధితుల కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందిస్తున్నామని చెప్పారు. గ్రామాలకు అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
చిన్నారులను పనులకు పంపించవద్దని, బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పిస్తామని, వారిని పనుల్లో పెట్టుకున్న యజమానులతో పాటు తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో పత్రాలు లేని 47 మోటారైసైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఒక లీటర్ గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజల తక్షణ పరిష్కారం కోసం పోలీసులు మీకోసం వందకు డయలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జన్నారం ఎస్సె గుర్రం ఉదయ్ కిరణ్, లక్షేట్టిపేట ఎస్సె గోపతి సురేష్, దండేపల్లి ఎస్సై గుండేటి రాజవర్ధన్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



