ఆగస్టులో 2 టెస్టుల సిరీస్
కొలంబో (శ్రీలంక) :భారత్, శ్రీలంక సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు సమరానికి సై అంటున్నాయి. 2008 నుంచి ద్వీప దేశంలో టెస్టు సిరీస్ ఓడని టీమ్ ఇండియా.. తొమ్మిదేండ్లలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత్ అక్కడ రెండు టెస్టులు ఆడనుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో ఈ సిరీస్ భాగం కావటంతో టీమ్ ఇండియాకు ఇది ప్రతిష్టాత్మకంగా మారనుంది. 2025-27 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో 4 విజయాలు, 4 ఓటములు, ఓ డ్రాతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. దీంతో శ్రీలంకతో సిరీస్‌లో వంద శాతం పాయింట్లను సొంతం చేసుకోవటంపై శుభ్‌మన్ సేన దృష్టి పెట్టనుంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను షెడ్యూల్ చేశారు. గతంలో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ సైతం షెడ్యూల్‌లో ఉండగా.. ప్రస్తుతం ఆ మ్యాచ్‌పై స్పష్టత ఇవ్వలేదు. ఆగస్టు 15-19 వరకు గాలెలో తొలి టెస్టు, 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు జరుగనున్నాయి. సింహాళిస్ స్పోర్ట్స్ క్లబ్‌లో నూతనంగా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసినా.. భారత్, శ్రీలంక డే నైట్ టెస్టులో తలపడే అవకాశాలు లేవు. ఆగస్టులో శ్రీలంకలో వాతావరణం సైతం ఆహ్లాదరకరంగా ఉంటుంది. వర్షం అంతరాయం కలిగించే పరిస్థితులు తక్కువ. దీంతో ఈ సిరీస్‌తో ఆదాయం పెంచుకునేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉండగా, స్వదేశంలో భారత్ తో ఆడిన చివరి ఐదు టెస్టుల్లోనూ శ్రీలంక పరాజయం పాలైంది. ఇటీవల వెస్టిండీస్ చేతిలో రెడ్ బాల్ ఫార్మాట్ లో ఓటమిపాలైన శ్రీలంక ఆగస్టు సవాల్ కోసం ఎదురుచూస్తుంది.
శ్రీలంకతో భారత్ టెస్టు సవాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



