నెల రోజుల పాపను కాపాడిన పోలీసులు
నవతెలంగాణ – శేరిలింగంపల్లి
తనకు తల్లి అయ్యే అవకాశం లేదని, మరో తల్లి కడుపుకోతకు గురి చేయాలని పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠాను అరెస్టు చేశారు. నెల రోజుల పాపను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, టాప్సియాకు చెందిన రహనుమా అలీకి పిల్లలు లేకపోవడంతో ఆమె డబ్బు చెల్లించి దత్తత కోసం ఒక బిడ్డను ఏర్పాటు చేయమని హైదరాబాద్‌లో నివసించే తన అత్త నిమ్మీ జహాన్ అలీ అలియాస్ సీమాను కోరింది. సీమా, ఈ విషయాన్ని నేరెడ్‌మెట్‌కు చెందిన తన స్నేహితురాలు నజియాకు తెలిపింది. నజియా ఈ సమాచారాన్ని వికారాబాద్‌కు చెందిన తన కాబోయే భర్త, నిందితుడు జుబేర్‌కు చెప్పి, నవజాత శిశువు కోసం డబ్బులు చెల్లిస్తామని చెప్పింది. వికారాబాద్‌కు చెందిన మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ఇర్ఫాన్, కలకత్తాకు చెందిన మక్సూద్ అలియాస్ నాజియా, నిమ్మీ జహాన్ అలీ అలియాస్ సీమా అలీ, రహనుమా అలీ, భార్య మొహమ్మద్ సనావర్ ఒక ముఠాగా ఏర్పడ్డారు.
వీరు చిన్నపిల్లలను వెతుకుతున్న క్రమంలో కర్నాటకలోని బీదర్ జిల్లా బల్కి గ్రామం బస్వానగర్ కాలనీకి చెందిన సర్కస్ కార్మికురాలు మలన్ గౌరవ్ శాంత బాయి తన సర్కస్ బృందంలోని సభ్యులతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఆమె ఒడిలో ఉన్న నెల రోజుల పాపను లాక్కెళ్లారు. గత నెల 30వ తేదీ తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఆటో-రిక్షాలో వచ్చి అపహరించారు. పసిపాప ఏడుపు విని ఆమె మేల్కొని, దుండగులను తరిమికొట్టడానికి ప్రయత్నించగా, వారు ఆటో-రిక్షాలో అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ఆమె చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శేరిలింగంపల్లి జోన్, ఆర్సీపురం డివిజన్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ నాయకత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. చందానగర్ ఇన్స్పెక్టర్ విజయ్, అమీన్ పూర్ డీఐ సత్యనారాయణ, ఎన్. భాస్కర్, చందానగర్ డీఐ ఎన్.భాస్కర్ నేతృత్వంలోని బృందాలు సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ నగరాల్లో 3 రోజుల పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
అయితే నిందితులు జుబేర్, ఇర్ఫాన్ పాపను నజియా ఇంటికి తీసుకెళ్లారు. రెహనుమా అలీ అపహరణకు గురైన శిశువును తన సంరక్షణలోకి తీసుకోవడానికి తన అత్త సర్వరితో కలిసి కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. జుబేర్ ఆ శిశువును అక్రమంగా అమ్మినందుకు గాను రెహనుమా అలీ నుంచి ఆన్లైన్ చెల్లింపు ద్వారా రూ.1,50,000 స్వీకరించాడు. నిందితులు అపహరణకు గురైన శిశువుతో కలకత్తాకు పారిపోయేలోపే, పోలీసు బృందం నిందితులందరినీ పట్టుకుంది. నెల రోజుల పసిపాపను రక్షించి, ఆమెను క్షేమంగా తల్లికి అప్పగించారు. కేసును త్వరగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను సీసీ అభినందించి, నగదు బహుమతి అందజేశారు.
అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



