తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, వినతి
నవతెలంగాణ-డిచ్‌పల్లి
గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాదిగ కులస్తులపై విధించిన గ్రామ బహిష్కరణను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైటాయించి తమకు న్యాయం చేయాలని, దీనికి కారణమైన వారిని అరెస్టు చేసి చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ గుర్రం బాలయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గన్నారం గ్రామ శివారులో గత కొన్ని నెలలుగా భూ వివాదం కొనసాగుతుందని.. అయితే వీడీసీ చెప్పిన మాట వినకపోవడంతో తమను గ్రామ బహిష్కరణ చేసినట్టు తెలిపారు. అయితే మాదిగలతో ఇతర కులాలు ఎవరైనా పనిచేయించుకున్నా, వారికి పనులిచ్చినా, వారి వద్దకు పనికి వెళ్లినా వారికి రూ.50వేలు జరిమానా విధిస్తామని వీడీసీ నిర్ణయించిందని అన్నారు. దాంతో తాము పనులు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. వ్యవసాయం చేసుకోవడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఏ దుకాణంలో, టీ కొట్టులో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయలేక, ఇతరత్రా పనులు చేసుకోలేక పోతున్నామని వాపోయారు. వీడీసీ నిర్ణయం రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులకు విరుద్ధమని, సామాజిక వివక్షను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా గ్రామ బహిష్కరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇందుకు బాధ్యులైన వీడీసీ కమిటీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘం సభ్యులు, బాధితులు తదితరులు పాల్గొన్నారు.
దళితులపై గ్రామ బహిష్కరణను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



