Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీవరేజ్‌‌పై జాయింట్ ఇన్‌స్పెక్షన్‌

సీవరేజ్‌‌పై జాయింట్ ఇన్‌స్పెక్షన్‌

- Advertisement -

సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలి
సీఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ ఆదేశం
కొల్లూరులో పర్యటన


నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌‌లోని కొల్లూరు ప్రాంతంలో సీవరేజీ వర్షపు నీటి కాలువ ద్వారా చెరువు, వ్యవసాయ భూముల్లోకి చేరుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి శుక్రవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తో కలిసి పరిశీలించారు. కొల్లూరులో డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ కాలనీలోని 9 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ పని చేయకపోవడంతో శుద్ధి చేయని మురుగునీటిని సమీప చెరువు, వర్షపు నీటి కాలువలోకి మళ్లిస్తున్నట్టు గుర్తించారు. అలాగే ఈ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా సీవరేజ్‌ వ్యవస్థ ‌కూడా మెరుగపడాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. హౌసింగ్ శాఖ నిర్వహణలో ఉన్న 9 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ మరమ్మతులకు నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఎండీ ఆదేశించారు. కొల్లూరు, పరిసర ప్రాంతాలకు సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ప్రణాళికను రూపొందించి, ప్రధాన ట్రంక్ సీవర్ మెయిన్ ఏర్పాటు ద్వారా మొత్తం మురుగునీటిని సేకరించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. వర్షపు నీటి కాలువలపై ఉన్న ఆక్రమణలను గుర్తించి హద్దులు నిర్ధారించాలని, నీటిపారుదల, రెవెన్యూ శాఖలతో కలిసి సంయుక్త సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్‌టీపీ సీజీఎం సుజాత, ప్రాజెక్టు, ఓ అండ్‌ ఎం డివిజన్ అధికారులు, హౌసింగ్, నీటిపారుదల శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -