Friday, August 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ

ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ

- Advertisement -

ఇద్దరు మహిళలు మృతి
 మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘటన
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయిచైతన్య


నవతెలంగాణ-ఆర్మూర్
తీర్థయాత్రకు బయలుదేరిన భక్తులకు.. ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద గురువారం జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన సందర్శకులు హైదరాబాద్‌లోని చిన్నజీయర్ స్వామి దర్శనం కోసం హైదరాబాద్‌ ‌ముచ్చింతల్‌‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి రెండు టూరిస్ట్ బస్సుల్లో బయలుదేరారు. మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్న సమయంలో ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు టైర్ పంక్చర్ అయింది. దాంతో టూరిస్టు బస్సును జాతీయ రహదారిపై నిలిపివేశారు. టైర్ పంక్చర్ కావడంతో బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందికి దిగి.. రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొంది. దాంతో బస్సు ముందుకు కదిలి, డివైడర్‌‌పై కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత (54), మాధవి (47) అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు సునీత, చిటక్క తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు క్రమబద్ధీకరించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్..
ఘటన సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాలు ఏ విధంగా నిలిపి ఉన్నాయనే అంశాలతో పాటు లారీ ఢీకొన్న తీరును అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన విధానం తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం తదితర అంశాలను పోలీసులు పరిశీలించారు. ఈ ప్రమాద స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ కుమార్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బా‌ల్కొండ ఎస్సైలు, అసిస్టెంట్ ఎంవీఐ తదితరులు ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -