కమ్యూనిస్టులతోనే మార్పు సాథ్యం
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఖమ్మంలో జన చైతన్య యాత్రల ముగింపు సభ
నవతెలంగాణ-గాంధీ చౌక్
సువిశాల భారతదేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడీ పిరికివాడిగా మారిపోయారని, ఆయనకు ట్రంప్ ఫోబియా పట్టుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. 145 కోట్ల జనాభా కలిగిన దేశానికి ప్రధానిగా ఉన్నా.. అల్పసంఖ్యాకులైన సంపన్నులు, కార్పొరేట్ల కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జన చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మం నగరంలో పాదయాత్ర నిర్వహించారు. ఖమ్మం జడ్పీ సెంటర్ నుంచి పాత బస్టాండ్, మయూరి సెంటర్ మీదుగా భక్తరామదాసు కళాక్షేత్రం వరకూ భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా భక్త రామదాసు కళాక్షేత్రంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో కూనంనేని మాట్లాడారు. ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, సంక్షేమ పథకాలు.. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే వచ్చాయని, ఇప్పుడు దేశంలో మార్పు సైతం, కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమవుతుందని ఇది తథ్యమని అన్నారు. మోడీకి తిరోగమనం ప్రారంభమైందని, సబ్బండ వర్ణాలు మోడీ పాలనను వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కమ్యూనిస్టులు ప్రపంచ వ్యాపితంగా పురోగమిస్తున్నారని, అందుకే అక్కడ ట్రంప్, ఇక్కడ మోడీ బయటపడుతున్నారని అన్నారు.
దేశాన్ని దోచుకుంటూ సంపదను, కార్పొరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ సర్కార్, ఇప్పుడు అయోధ్య రాముని సొమ్ముకు ఎసరు పెట్టిందని, బీజేపీ దాని అనుబంధ సంస్థలు, దొంగల దండులా దేశంపై పడ్డారని, చీమల దండులా కదిలి దొంగల దండును తరిమి వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారని, అయినా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రశ్శిస్తూనే ఉంటామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఈ సారి పోటీ తథ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో తాత్సారం ప్రదర్శిస్తుందని, హామీలను విస్మరిస్తే ఆందోళన తప్పదని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. హేమంతరావు మాట్లాడుతూ.. అప్పుల పేరుతో హామీలను అమలు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ మహ్మద్ మౌలానా తదితరులు ప్రసంగించగా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో సీపీఐ నగర కార్యదర్శి షేక్ జానీమియా, రాష్ట్ర సమితి సభ్యులు ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, బిజి క్లైమెంట్, అజ్మీరా రామమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.



