తాకట్టు పెట్టిన గోల్డ్ మాయం
అసిస్టెంట్ మేనేజర్‌పై పోలీసుల ఫిర్యాదు
బ్యాంక్‌కు క్యూ కట్టిన బాధితులు
22మందికి చెందిన రూ.91 లక్షల విలువైన 700గ్రాముల బంగారం తస్కరణ!
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా పట్టణంలోని ఇండియన్ బ్యాంక్‌లో గోల్డ్ గోల్‌మాల్ జరిగింది. బ్యాంకులోని అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్ బ్యాంకులో తాకట్టు పెట్టిన 22మందికి చెందిన రూ.91లక్షల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించినట్టు బ్యాంకు మేనేజర్ బాదావత్ మోతిలాల్ ఫిర్యాదు చేశారని సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ఇండియన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్ అనే వ్యక్తి బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన 22మందికి చెందిన రూ.91లక్షల విలువైన 700 గ్రాముల బంగారు నగలను దొంగిలించారు. ఇందులో 16 మంది వినియోగదారులకు చెందిన బంగారు ఆభరణాలను మణపురం గోల్డ్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టగా మిగిలిన ఆరుగురికి చెందిన బంగారు ఆభరణాల ప్యాకెట్లు ఇంట్లో ఉండటంతో ఆయన భార్య తీసుకొచ్చి బ్యాంకులో అప్పగించారు. ఇండియన్ బ్యాంక్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్ రెండు నెలల కిందటే మానుకోట ఇండియన్ బ్యాంకుకు అసిస్టెంట్ మేనేజర్‌గా బదిలీపై వచ్చారు. మరిపెడ బంగ్లా కేంద్రానికి చెందిన భూక్య రాజేష్ ఆరు సంవత్సరాల క్రితం ఇండియన్ బ్యాంక్‌లో క్లర్క్‌గా జాయిన్ అయి అంచెలంచెలుగా ఎదుగుతూ అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు.
గతంలో ఆయన కర్నాటకలోని హుబ్లీ బ్యాంకు నుంచి మానుకోటకు బదిలీపై వచ్చారు. రెండు నెలల కిందట మానుకోటకు వచ్చిన రాజేష్ పలు దఫాలుగా 22 మంది వినియోగదారులకు చెందిన 700 గ్రాముల బంగారాన్ని దొంగిలించి మణపురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టారని బ్యాంక్ ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడింది. మహబూబాబాద్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాదావత్ మోతిలాల్ ప్రతినెలా చివరన ఆడిట్ నిర్వహిస్తారు. బ్యాంకులోని నగదు, బంగారు ఆభరణాల సంచులను సరి చూసుకుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు మొదటి వారంలోనే బ్యాంకు వినియోగదారులకు చెందిన బంగారు ఆభరణాల సంచుల్లో తేడా వచ్చింది. ఈ విషయాన్ని ఆయన వెంటనే జోనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్‌కు సమాచారం అందించారు. వారు గత వారం బ్యాంక్‌కు వచ్చి పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ నిర్వహిస్తుండగానే గురు, శుక్రవారాల్లో భూక్య రాజేష్ సెలవుపై వెళ్ళిపోయారు. శని, ఆది, సోమవారాలు సెలవులున్నాయి. దాంతో బ్యాంక్ ఉన్నతాధికారులు భూక్య రాజేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు మేనేజర్ మోతిలాల్‌ను ఆదేశించారు. ఈ మేరకు మోతిలాల్ గురువారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇండియన్ బ్యాంక్‌లో బంగారం మాయం అయిందన్న ఘటనతో పలువురు వినియోగదారులు బ్యాంక్‌కు వచ్చి తమ బంగారం చూపించాలని బ్యాంకు మేనేజర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. దాంతో బ్యాంక్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఇండియన్ బ్యాంకులో గోల్‌మాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



