Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాత్రి వేళల్లో గుట్టుగా స్టీల్‌ దందా

రాత్రి వేళల్లో గుట్టుగా స్టీల్‌ దందా

- Advertisement -

 పటాన్‌చెరు-కర్దనూర్ రోడ్డులో అక్రమ వ్యాపారం
​హైవే పెట్రోలింగ్ విఫలంపై అనుమానాలు
తరచూ ట్రాఫిక్ తిప్పలు.. అనేక ప్రమాదాలు

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే పటాన్‌చెరు-కర్దనూర్ రోడ్డు మార్గంలోని కర్దనూర్ శివార్లలో అర్ధరాత్రి స్టీల్ దందా గుట్టుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి వెన్నెముక లాంటి ఇనుప కడ్డీలు గమ్యం చేరకముందే మధ్యలోనే మాయమవుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం కొందరు ఏజెంట్లకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. సామాన్య ప్రయాణికులకు మాత్రం మృత్యుపాశంగా మారుతోంది. రాత్రి వేళల్లో సాగుతున్న ఈ దందాపై పోలీసుల నిఘా లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మరోపక్క ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురి ప్రాణాల మీదకు వస్తున్నాయి. ​ పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంతో పాటు కర్దనూర్ శివారులో అనేక స్టీల్ కంపెనీలు ఉన్నాయి. ప్రతి రోజూ హైదరాబాద్‌లోని భారీ వెంచర్లు, బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం స్టీల్ లోడుతో వందలాది కంటైనర్లు ఈ రోడ్డు గుండా వెళ్తుంటాయి.

ఈ కంటైనర్ బయలు దేరే సమయంలో ముందుగానే ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. కర్దనూర్ నుంచి పటాన్‌చెరు వెళ్లే దారిలో ఓ కంపెనీ ముందు ఉన్న వెంచర్లలోకి ఈ కంటైనర్లను మళ్లిస్తున్నారు. అక్కడ లోడులో ఉన్న స్టీల్‌ను తక్కువ ధరకే డ్రైవర్ల నుంచి కొనుగోలు చేసి గుట్టుచప్పుడు కాకుండా స్థానిక మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఇలా ఎంత స్టీల్‌ తీశారో.. అవి ఎంత బరువు ఉన్నాయో ఆ బరువుకు తగ్గట్టు కంటెయినర్‌లో వాటర్ క్యాన్లను డ్రైవర్ సీట్ వెనకాల ఉంచి కనిపించకుండా అంతే బరువు వస్తువులుండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ రోడ్డు నుంచి ప్రక్కనున్న వెంచర్‌‌లోకి మళ్లడం, కొన్ని సీకులు తొలగించిన తర్వాత మళ్లీ రోడ్డు మీదికి వాహనాలు రావడం ప్రమాద భరితంగా మారుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

ట్రాఫిక్ గందరగోళం
ఈ అక్రమ దందా జరిగే సమయంలో భారీ కంటైనర్లను రహదారిపైనే నిలిపివేయడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ మార్గంలో అర్ధరాత్రి సమయంలో వోల్వో బస్సులు, ప్రయివేటు వాహనాలు, కార్లు భారీగా వెళ్తుంటాయి. హైదరాబాద్‌-‌పూణే హైవే కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై ఒక కంటెయినర్ నుంచి స్టీల్ తీసేవరకు మరో కంటెయినర్‌ను రోడ్డుపై ఆపడంతో ట్రాపిక్ జామ్ అయ్యి ప్రయా‌ణికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. రాత్రి పూట వేగంగా వాహనాలు వచ్చి ఇక్కడ వాహనాలు ఆపింది తెలియకపోవడంతో హఠాత్తుగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి. గతంలో ఓ కారు కంటైనర్‌ను ఢీకొన్నప్పుడు, ఈ విషయం బయటకు రాకుండా ఏజెంట్లు బాధితులకు డబ్బులు ఇచ్చి అక్కడికక్కడే సెటిల్ చేసినట్టు సమాచారం.

పోలీసుల తీరుపై విమర్శలు
పటాన్‌చెరు-కర్దనూర్ మార్గంలో తిరిగే పోలీసు పెట్రోలింగ్ వాహనాలు, పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఏండ్ల తరబడి ఈ దందా సాగడం వెనుక మర్మమేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. రహదారిపై చిన్న సంఘటన జరిగినా నిమిషాల్లో వచ్చే పోలీసులు, భారీ స్థాయిఓ కంటైనర్లు ఆగి స్టీల్ దించుతున్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల సహకారంతోనే ఈ అక్రమ సామ్రాజ్యం నడుస్తోందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ నెట్‌‌వర్క్‌ను ఛేదించకపోతే, ఈ రోడ్డుపై జరిగే ప్రతి ప్రమాదానికి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -