Monday, March 2, 2026
E-PAPER
Homeఆటలుసెమీస్‌కు భారత్‌

సెమీస్‌కు భారత్‌

- Advertisement -

విండీస్‌పై 5 వికెట్లతో ఘన విజయం
ఛేదనలో దంచికొట్టిన సంజు శాంసన్‌
వెస్టిండీస్‌195/4భారత్‌ 199/5

ఉత్కంఠకు తెరపడింది. కరీబియన్లతో నాకౌట్‌ ఫైట్‌లో ఆతిథ్య భారత్‌ పైచేయి సాధించింది. ఈడెన్‌గార్డెన్స్‌లో విండీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛేదనలో సంజు శాంసన్‌ (97 నాటౌట్‌) అర్థ సెంచరీతో చెలరేగగా, తిలక్‌ వర్మ (27) రాణించాడు. టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా తలపడనుండగా.. రెండో సెమీస్‌లో భారత్‌తో ఇంగ్లాండ్‌ ఢీకొట్టనుంది.

నవతెలంగాణ-కోల్‌కతా
ఉత్కంఠరేపిన సూపర్‌8 పోరులో వెస్టిండీస్‌పై భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (97 నాటౌట్‌, 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగటంతో 196 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మరో 4 బంతులు ఉండగానే ఛేదించింది. తిలక్‌ వర్మ (27, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (18), హార్దిక్‌ పాండ్య (17) విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్‌ ఛేజ్‌ (40, 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), జేసన్‌ హౌల్డర్‌ (37 నాటౌట్‌, 22 బంతుల్లో 2 ఫోర్లు,3 సిక్స్‌లు), రోవ్‌మాన్‌ పావెల్‌ (34 నాటౌట్‌, 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో చెలరేగిన సంజు శాంసన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

చెలరేగిన శాంసన్‌
భారత్‌ లక్ష్యం 196 పరుగులు. భీకర ఫామ్‌లో ఉన్న భారత్‌కు పెద్ద కష్టం కాదు. కానీ అభిషేక్‌ శర్మ (10), ఇషాన్‌ కిషన్‌ (10) రెండేసి బౌండరీలు బాదినా వికెట్‌ నిలుపుకోలేదు. 41/2తో భారత్‌ కష్టాల్లో కూరుకోగా… సంజు శాంసన్‌తో కలిసి సూర్య కుమార్‌ యాదవ్‌ (18) విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. పవర్‌ప్లే తర్వాత దూకుడుగా ఆడిన సూర్య, సంజు.. విండీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ అవుటైనా.. తెలుగు తేజం తిలక్‌ వర్మ (27)తో కలిసి సంజు శాంసన్‌ అదరగొట్టాడు. ఈ ఇద్దరు నాల్గో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 26 బంతుల్లో సంజు శాంసన్‌ అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా.. భారత్‌ మ్యాచ్‌పై పట్టు బిగించింది. పవర్‌ప్లేలో అకీల్‌ హుసేన్‌, మిడిల్‌ ఓవర్లలో షమర్‌ జొసెఫ్‌ వికెట్లు పడగొట్టి ఉత్కంఠ పెంచినా.. సంజు శాంసన్‌ ఓ ఎండ్‌లో బలంగా నిలబడ్డాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్య (17) వికెట్‌ పడినా.. శివం దూబె (8 నాటౌట్‌)తో కలిసి సంజు శాంసన్‌ లాంఛనం ముగించాడు.

విండీస్‌ సమిష్టిగా
టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పవర్‌ హిట్టర్లతో కూడిన విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ సమిష్టిగా రాణించింది. ఓపెనర్లు షాయ్ హౌప్‌ (32), రోస్టన్‌ ఛేజ్‌ (40) తొలి వికెట్‌కు అదిరే ఆరంభం అందించారు. షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (27), రూథర్‌ఫోర్డ్‌ (14) సిక్సర్లతో ఎదురుదాడి చేసినా.. ఎంతోసేపు వికెట్‌ నిలుపుకోలేదు. రోవ్‌మాన్‌ పావెల్‌ (34 నాటౌట్‌), జేసన్‌ హౌల్డర్‌ (37 నాటౌట్‌) ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అందరూ మెరవటంతో విండీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/36), వరుణ్‌ చక్రవర్తి (1/40), హార్దిక్‌ పాండ్య (1/40) వికెట్లు పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -