Saturday, July 4, 2026
E-PAPER
Homeఆటలుపరుగులవేట సాగేనా?

పరుగులవేట సాగేనా?

- Advertisement -

విజయంపై కన్నేసిన టీమ్‌ ఇండియా
భారత్‌, ఇంగ్లాండ్‌ రెండో టీ20 నేడు
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

భారత్‌, ఇంగ్లాండ్‌ టీ20 ధమాకా మాంచెస్టర్‌కు చేరుకుంది. గతంలో ఇక్కడ ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 304/2 పరుగుల రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న మాంచెస్టర్‌లో ఇటు భారత్‌తో పాటు అటు ఇంగ్లాండ్‌ బ్యాటర్లు సైతం పరుగుల వరద పారించటంపై దృష్టి నిలిపారు. మూడు మ్యాచులుగా గెలుపు రుచి ఎరుగని టీమ్‌ ఇండియా నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్‌, ఇంగ్లాండ్‌ రెండో టీ20 నేడు.

నవతెలంగాణ-మాంచెస్టర్‌
భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టీ20 వరుణుడి ఖాతాలో పడగా.. నేడు మాంచెస్టర్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గతంలో ఇక్కడ రికార్డు స్కోరు చేసిన ఇంగ్లాండ్‌.. స్పిన్నర్లతో కూడిన భారత బౌలింగ్‌ లైనప్‌పై మరోసారి ఆ ప్రదర్శన పునరావృతం చేయాలని ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో భారత్‌ సైతం ఐపీఎల్‌ తరహా మెరుపులు చూపించేందుకు సిద్ధమవుతోంది. టాప్ ఆర్డర్‌లో ఇద్దరు బ్యాటర్లు రాణించినా భారత్‌ను నిలువరించటం ఆతిథ్య ఇంగ్లాండ్‌కు గగనమే కానుంది. జోఫ్రా ఆర్చర్‌ మాంచెస్టర్‌లో ఆడనుండగా.. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వైభవ్‌కు తప్పని నిరీక్షణ?
టీ20ల్లో ప్రపంచ నం.1 బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ, టీ20 ప్రపంచకప్‌ ప్లేయర్ ఆఫ్‌ టోర్నమెంట్‌ సంజు శాంసన్‌ ఓపెనర్లుగా ఉండగా.. ఐపీఎల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ వైభవ్‌ సూర్యవంశీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. సంజు శాంసన్‌ నెమ్మదిగా మొదలెడతాడనే అవగాహన ఉన్నప్పటికీ.. వైభవ్‌ సూర్యవంశీని ఎక్కువ మ్యాచ్‌లు బెంచ్‌కు పరిమితం చేయలేని పరిస్థితి. సంజు శాంసన్‌ వరుసగా 5, 0, 1 పరుగులతో నిరాశపరిచాడు. మాంచెస్టర్‌లోనే అతడిపై వేటు పడుతుందని ఆశించినా.. జట్టు మేనేజ్‌మెంట్‌ అవకాశాలు కొనసాగించేందుకు మొగ్గుచూపుతోంది. దీంతో వైభవ్‌ సూర్యవంశీ నిరీక్షణకు నేడు తెరపడే అవకాశాలు స్వల్పమే. నం.3 బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ సైతం నిరాశపరుస్తున్నాడు. కానీ అందులో గత రెండు మ్యాచుల్లో కిషన్‌ రనౌట్‌గా నిష్ర్కమించాడు. దీంతో కిషన్‌ను సైతం బెంచ్‌కు పరిమితం చేసే సూచనలు లేవు. బౌలింగ్‌ లైనప్‌లోనూ భారత్‌ ఎటువంటి మార్పులు చేసేందుకు ఆలోచన చేయటం లేదు. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకున్నారు. మాంచెస్టర్‌లోనూ బౌలింగ్‌ కాంబినేషన్‌లో మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అర్థ సెంచరీలతో రాణించారు. కానీ, శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడుగా పరుగులు సాధించలేదు. లోయర్‌ ఆర్డర్‌లో శివమ్‌ దూబె ఫామ్‌లోకి రావటం శుభపరిణామం. వరుస వైఫల్యాలతో ఒత్తిడి, బెంచ్‌పై వైభవ్‌ సూర్యవంశీ ఎదురుచూపులతో నేడు సంజు శాంసన్‌ భారీ స్కోరు చేయటం అతడికి అత్యవసరం.

ఆర్చర్‌ వస్తున్నాడు
చెస్టర్‌ లె స్ర్టీట్‌లో సకిబ్‌ మహమూద్‌ మూడు వికెట్లతో మెరిసినా.. మాంచెస్టర్‌లో అతడు బెంచ్‌పై కూర్చోనున్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టులో ఆడిన నేరుగా టీ20 జట్టుతో చేరిన జోఫ్రా ఆర్చర్‌కు తొలి మ్యాచ్‌లో విశ్రాంతి లభించింది. జోఫ్రా ఆర్చర్‌ నేడు ఆడనుండటంతో సకిబ్‌ మహమూద్‌కు నిరాశ తప్పటం లేదు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, ఓపెనర్‌ జోశ్‌ బట్లర్‌ భారీ స్కోర్లు బాదటంపై గురి పెట్టారు. లోకల్‌ స్టార్‌ ఫిల్‌ సాల్ట్‌ 2025 సెప్టెంబర్‌ తర్వాత తొలిసారి ఇక్కడ ఆడనున్నాడు. అప్పటి మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయంగా 141 పరుగులు చేసిన ఫిల్‌ సాల్ట్‌.. సొంత మైదానంలో మరోసారి మ్యాజిక్‌ చేయాలని చూస్తున్నాడు. జాకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, శామ్‌ కరణ్‌ సైతం ప్రభావం చూపిస్తే ఆతిథ్య జట్టుకు తిరుగుండదు. విల్‌ జాక్స్‌, లియాం డాసన్‌, ఆదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, జోశ్ టంగ్‌లు బౌలింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నారు.

పిచ్‌, వాతావరణం
మాంచెస్టర్‌ పిచ్‌ సంప్రదాయంగా స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌కు అనుకూలం. కానీ ఇదే సమయంలో క్రీజులో నిలిస్తే బ్యాటింగ్‌కు సైతం సహకారం లభిస్తుంది. గతంలో ఇక్కడ జరిగిన ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ గణాంకాలే నిదర్శనం. నేడు భారత్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను సిద్ధం చేశారు. పిచ్‌పై కొంత పచ్చిక కనిపిస్తోంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రానా, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తి. ఇంగ్లాండ్‌ : ఫిల్‌ సాల్ట్‌, జోశ్‌ బట్లర్‌ (వికెట్‌కీపర్‌), హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జాకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, శామ్‌ కరణ్‌, విల్‌ జాక్స్‌, లియాం డాసన్‌, ఆదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, జోశ్‌ టంగ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -