జల్లా క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు
తిలక్ వర్మ, సిరాజ్‌తో లీగ్‌కు మరింత జోష్
టీజీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు
నిత్యం వివాదాలు, అంతర్గత కుమ్ములాటలతో వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎట్టకేలకు క్రికెట్‌కు పెద్దపీట పడుతోంది. ఇప్పుడూ కొన్ని వివాదాలు చుట్టుముట్టినా, క్రికెట్ వ్యవహారాలపైనే అపెక్స్ కౌన్సిల్ దృష్టి నిలుపుతోంది. అందుకు నిదర్శనమే అత్యంత విజయవంతంగా సాగుతున్న టీజీ20 తొలి సీజన్. తెలంగాణ టీ20 ధమాకా లీగ్ దశ ముగుస్తున్న తరుణంలో టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ చెర్మన్ ఆగం రావుతో నవతెలంగాణ స్పెషల్ చిట్‌చాట్…
నవతెలంగాణ-హైదరాబాద్
అది నా ఆలోచనే
కలా? నిజమా? అన్నట్టు ఉంది. టీజీ20 వంటి టోర్నమెంట్ నిర్వహించగలమా అనే దశ నుంచి విజయవంతంగా లీగ్ చేయటం ఎంతో సంతృప్తిగా ఉంది. స్టేట్ లెవల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించటం కల నిజమైనట్టుగా ఉంది. లీగ్ దశ మ్యాచ్‌ల్లో జిల్లాల క్రికెటర్లు అద్బుతంగా రాణిస్తున్నారు. ప్రతి జట్టు నలుగురు జిల్లాల క్రికెటర్లను తీసుకోవాలని, తుది జట్టులో ఇద్దరిని ఆడించాలని లీగ్ చైర్మన్‌గా నా ఆలోచన. వైట్‌బాల్ ఫార్మాట్లో జిల్లాల క్రికెటర్లు బాగా రాణిస్తారు. కంబైడ్జ్ జిల్లా జట్టు ఏ లీగ్ చాంపియన్. బి లీగ్‌లో నల్గొండ జట్టు విజేత. అందుకే జిల్లా క్రికెటర్లు మెరుగ్గా ఆడుతున్నారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సైతం ఆహ్లాద కరంగా కనిపిస్తోంది. సీనియర్ ఆట గాళ్లు.. జూనియర్, జిల్లాల క్రికె టర్లకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఐపీఎల్ తరహా వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది.
జిల్లాల క్రికెటర్లదే భవిష్యత్
భవిష్యత్‌లో టీజీ20 లీగ్‌లో జిల్లా క్రికెటర్లదే పైచేయి కానుంది. తొలి సీజన్‌లో కచ్చితంగా ఇద్దరు ఆటగాళ్లను ఆడించాలనే నిబంధన పెట్టాం. ఇప్పుడు ప్రతి ప్రాంఛైజీ ప్రతిభాన్వేషణ బృందం నాణ్యమైన క్రికెటర్లను వెతికే పనిలో ఉంది. లీగ్‌తో పాటు ఈ ఏడాది పాటు జిల్లాల క్రికెటర్లపై ఫోకస్ ఉండనుంది. విక్రమ్ నాయక్, గణేష్, జిఎస్‌కె రెడ్డి, నారాయణ తేజ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. జిల్లాల క్రికెటర్లలో ప్రతిభకు కొదవ లేదు. ఇన్నాండ్లూ వారికి సరైన వేదిక దొరకలేదు. టీజీ20 లీగ్‌తో ఆ కొరత తీరనుంది. అందుకే, వచ్చే సీజన్‌లో ప్రతి జట్టులో నలుగురు కంటే ఎక్కువ మంది జిల్లాల క్రికెటర్లే ఆడతారని బలంగా నమ్ముతున్నాను. అప్పుడు ఆ రూల్‌తో పనే ఉండదు. అంతకంటే ఎక్కువ మందే ఆడతారు. జిల్లాల్లో క్రికెట్ అకాడమీలు, మౌలిక సదుపాయాల కల్పనకు హెచ్‌సీఏ ఇటీవలే రోడ్‌మ్యాప్ రూపొందించింది. అయినా, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో అభివృద్ది చేయాల్సి ఉంది. తెలంగాణ అంతటా, అన్ని జిల్లాల్లో సదుపాయాలు కల్పించాలి. టీజీ20 లీగ్ లాభాలను జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి వెచ్చించాలని కోరతాను.
లీగ్‌లో ఐపీఎల్ జట్ల స్కౌటింగ్
ఐపీఎల్ వేలంలో మన క్రికెటర్లను ఎవరూ తీసుకోవటం లేదనే అసంతృప్తి మనలో ఉండేది. టీజీ20 లీగ్ మ్యాచ్‌లు చూసేందుకు ఐపీఎల్ ప్రాంఛైజీలు ప్రతిభాన్వేషణ (స్కౌటింగ్) బృందాలను పంపిస్తున్నాయి. ప్రతి రోజు ఐపీఎల్ జట్ల స్కౌటింగ్ టీమ్స్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తి చూపించ బోతున్నాయి. ఇప్పటికే కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ జట్ల ట్రయల్స్‌కు హాజరయ్యే స్థాయిలో రాణించారు. టీజీ20 లీగ్ నుంచి సుమారు 20-25 మంది క్రికెటర్లు ట్రయల్స్ కోసం ఐపీఎల్ ప్రాంఛైజీలను ఆకర్షించనున్నారు.
అభిమానుల నుంచి విశేష ఆదరణ
టీజీ20 మ్యాచ్‌లకు ఓ 5-6 వేల మంది వస్తారని అంచనా వేశాం. కానీ ప్రతి రోజు స్టేడియానికి 10-15 వేల మంది వస్తున్నారు. వారాంతాల్లో ఏకంగా 20 వేల మంది స్టేడియానికి వస్తున్నారు. శుక్రవారం నుంచి స్టేడియం సీటింగ్ కెపాసిటీ పెంచుతున్నాం. ప్లే ఆఫ్స్‌కు, ఫైనల్‌కు స్టేడియంలో పూర్తి సీటింగ్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. అభిమానులు, ప్రేక్షకులు టీజీ20 మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తిగా రావటం ఎంతో సంతోషంగా ఉంది. టెలివిజన్, డిజిటల్ వేదికల్లోనూ వీక్షణలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
కరీంనగర్‌లో 18 రకాల పిచ్‌లు
గత ఏడెనిమిదేండ్లుగా హెచ్‌సీఏలో క్రీయాశీలకంగా ఉన్నాను. జిల్లాల నుంచి క్రికెటర్లు ఎదగాలనే ఆలోచనలతో వచ్చాను. జిల్లాల్లో మౌలిక సదుపాయాలపై హెచ్‌సీఏపై ఒత్తిడి తీసుకొచ్చాను. కరీంనగర్ క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అక్కడే ఓ మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయాలనే భావించాను. తెలంగాణకు రోల్‌మోడల్ ఉండేలా ఆ గ్రౌండ్ సిద్ధమైంది. సొంత నిధులు, సన్నిహితులు, స్నేహితుల సహకారంతో పాటు హెచ్‌సీఏ మద్దతుతో 9 ఎకరాల్లో గ్రౌండ్ ఏర్పాటు చేశాను. టర్ఫ్, సిమెంట్, నల్ల మట్టి, ఎర్రమట్టి ఇలా 18 రకాల పిచ్‌లను ఏర్పాటు చేశాం. అక్కడే ఓ అకాడమీ పెట్టాలనే ఆలోచన ఉంది. బీసీసీఐ ప్రమాణాలతో కూడిన గ్రౌండ్ సిద్ధమైంది. హెచ్‌సీఏ ఏ-డివిజన్, కాకా టీ20 టోర్నమెంట్ మ్యాచ్‌లు సైతం జరిగాయి. తెలంగాణ జిల్లాల మౌలిక సదుపాయాల కల్పనకు కరీంనగర్ గ్రౌండ్ స్ఫూర్తిదాయకంగా ఉండబోతుంది.
గంట కూడా నిద్రపోలేదు!
తిలక్ వర్మ టీజీ20 లీగ్‌లో ఆడటం ఆటగాళ్లలో సరికొత్త స్ఫూర్తి నింపింది. ఆదివారం శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్-ఏను చాంపియన్‌గా నిలిపిన తిలక్ వర్మ… సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుని, ఆ రోజే మెదక్ ఫాల్కన్స్ తరఫున బరిలోకి దిగి కెప్టెన్సీ, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సిన తిలక్ వర్మ వంద శాతం ప్రదర్శన ఇచ్చాడు. ఛేదనలో సహచర బ్యాటర్లలో ధైర్యం నింపుతూ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ సెంచరీతో లీగ్‌లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించాడు. తిలక్ వర్మ ఆడటం ఆటగాళ్లతో పాటు అభిమానులకు ప్రేరణ ఇచ్చింది. టీజీలీగ్ మ్యాచ్ అనంతరం అదే రోజు తిలక్ వర్మ నేరుగా ఐర్లాండ్ పర్యటనకు బయల్దేరాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ కనీసం ఒక్క గంట కూడా నిద్రపోలేదు. క్రికెట్ పట్ల తిలక్ వర్మ అంకితభావం అసమానం.



