నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ప్రాంతాల్లో శనివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పోలీసు – ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లను తనిఖీ చేయగా, 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్నట్లు గుర్తించారు.
అలాగే ఒక తల్వార్, 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, కొనుగోలు చట్టరీత్యా నేరమని పేర్కొన్న ఎస్పీ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి వ్యసనానికి గురైన వారి వివరాలు అందిస్తే డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసు శాఖ సహకరిస్తుందని తెలిపారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడుల మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రజల సమాచారమే నేరాల ఛేదనకు కీలకమని పేర్కొన్న ఎస్పీ, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటి, వ్యాపార సంస్థ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, బిక్కనూర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



