Tuesday, March 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికూలిన ఆశలు!

కూలిన ఆశలు!

- Advertisement -

ఖమ్మం వెలుగుమట్లలో చోటుచేసుకున్న కూల్చివేతలు కేవలం ఇళ్ల ధ్వంసం కాదు, ప్రజల ఆశలు, భద్రత భావం, ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం నేలమట్టం కావడం. పేదలకు భూదాన్‌గా లభించిన భూముల్లో పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న గూళ్లను హఠాత్తుగా కూల్చివేయడం హృదయ విదారకం. ముందస్తు నోటీసులు లేకుండా, పోలీసు బలగాల మధ్య ప్రజలను బయటకు లాగి ఇళ్లను కూల్చడం ప్రజా పాలనగా ఎలా చెప్పగలం? మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు, రోగులు, నిస్సహాయులై రోడ్డున పడి విలపిస్తుంటే, కొన్ని రోజుల క్రితమే ఇవే ఇండ్లచుట్టూ తిరిగి ఓట్లడుక్కున్నవాళ్లు ఇప్పుడెక్కడున్నారు? భూదాన్‌ ఉద్యమం లక్ష్యం భూమిలేని వారికి భూమి అందించడం. అలాంటి భూముల్లో పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఆ లక్ష్యానికే విరుద్ధం. భూమి ట్రస్ట్‌దైనా, ప్రభుత్వానిదైనా-పేదల నివాసహక్కును రక్షించడం ముందుండాలి. ఇళ్లు కడతామని చెప్పే ప్రభుత్వం ఇప్పటికే ఉన్న గృహాలను ధ్వంసం చేయడం ఎలా సమర్థించగలం? ఇందిరమ్మ పేరుతో గృహనిర్మాణం చేపడతామని చెప్పే ప్రభుత్వం, దానంగా ఇచ్చిన భూమినే తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రజాపాలన స్ఫూర్తికి విరుద్ధం.

ఈ వ్యవహారంలో న్యాయస్థానాల ఆదేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.బాధితుల పక్షాన స్టేటస్‌ కో, ఇంజంక్షన్‌ ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు జరగడం ఆందోళనకరం. కోర్టు ఆదేశాల్ని లెక్కచేయక పోతే ప్రజలకు న్యాయవ్యవస్థపై ఎలా నమ్మకం మిగులుతుంది? ఈ మధ్య ప్రభుత్వంలో ఉన్నకొందరు, న్యాయస్థానాల ఆర్డర్లను ఖాతరు చేయకుండా, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వెలుగుమట్లలో పేదలు కట్టుకున్న ఇండ్లపై స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్నా, లేక్కచేయకుండా ఇండ్లను కూల్చేసినట్లే, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎల్లమ్మ గుడి పక్కన సర్వే నెంబర్‌ 264లో స్టేటస్‌ కో ఉన్న ఖాళీ స్థలంపై దేవాదాయ శాఖ ఈఓ అక్రమంగా పిల్లర్లు నిర్మించి మరీ కోర్ట్‌ ఆర్డర్‌లను ధిక్కరించాడు. అందులో ఒకమంత్రి ప్రమేయం ఉన్నందున, ఆ కబ్జాఖోరుపై చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, బాధితులు ఇక ఈ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందనే ఆశలు వదులుకున్నారు. కొంత ఆలస్యమైనా సరే, కోర్టుపైనే నమ్మకం పెట్టుకున్నారు. ప్రభుత్వం, చట్టం పేదలపై కఠినంగా, ప్రభావశీలులపై సడలింపుగా ఉంటే ప్రజా స్వామ్య సారాంశమే ప్రశ్నార్థకమవుతుంది.

ఈ ఘటనల నేపథ్యంలో మరో ఆందోళనకర ధోరణి స్పష్టమవుతోంది. కొందరు అధికారాన్ని ప్రజాసేవకు కాకుండా వ్యక్తిగత లాభాల కోసం వినియోగిస్తున్నారనే భావన ప్రజల్లో బలపడుతోంది. అధికార పార్టీపై విశ్వాసం తగ్గితే, ఆ నాయకులు మరో పార్టీ కండువా కప్పుకోవడం కొత్త విషయం కాదనే అభిప్రాయం ఉంది. ఇటీవలి పరిణామాలు చూస్తే, ఇతర పార్టీల నుంచి చేరిన కొందరి చర్యలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఒక రహస్య ఎజెండాతో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతున్నది. పార్టీ అధిష్ఠానం దీనిపై తక్షణం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో తెలంగాణలో ఆ పార్టీ మనుగడ సవాలుగా మారే అవకాశం ఉంది.

వెలుగుమట్ల స్థానికుల్లో మరో అంశం, భూముల విలువల పెరుగుదల. అభివృద్ధి పనులతో భూముల ధరలు పెరగడం, ప్రభావశీలుల ఆసక్తులు పెరగడం ఈ కూల్చివేతల వెనుక కారణమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పారదర్శకత లేకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. బాధితులను పరామర్శించేందుకు వెళ్లే మీడియాను అడ్డుకోవడం, బాధలను వ్యక్తపరుస్తున్న వారిని ”పేయిడ్‌ ఆర్టిస్టులు”గా కించపరచడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. తప్పు చేయనప్పుడు ప్రభుత్వానికి భయమెందుకు? ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

ఇప్పటికే జరిగిన నష్టం పూడ్చలేనిది. వేరే చోట భూమి, ఇళ్లు ఇస్తామని చెప్పడం సరికాదు. అలా చేస్తే, ప్రభావవంతుల లక్ష్యం ఆ చోటనుండి పేదలను జరపడమేనని అర్థం అయిపోతుంది. అందుకోసమే హఠాత్తుగా బుల్దోజర్లతో ఇళ్లను కూల్చేశారని, అధికారాన్ని చేతిలో పెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని రుజువు అయిపోతున్నది. అదే స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో కాకుండా, ఈ దురాగతానికి పాల్పడ్డ వారి సొమ్ముతో కట్టాలి. లేదంటే బాధ్యులపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించినట్లయితే, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారానే వ్యవస్థలపై విశ్వాసం నిలుస్తుంది. గౌరవ న్యాయస్థానం ఈ ధిక్కారాన్ని సుమోటోగా తీసుకుని ఇండ్లను కూల్చేసిన వారిని శిక్షించాలి, పేదలకు న్యాయం చేయాలి. వెలుగుమట్ల ఘటన ఒక ప్రాంతానికే పరిమితం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి పరీక్ష. ప్రజల గూళ్లను కాపాడలేని పాలన, ఎన్ని అభివృద్ధి పనులు చేసినా, ప్రజల హృదయాల్లో స్థానం ఎలా సంపాదించుకోగలదు? ఇప్పటికైనా ఆత్మపరిశీలన అవసరం. లేకపోతే ప్రజాస్వామ్యం, కఠిన తీర్పు చెప్పే రోజు దూరంలో ఉండదు.

సయ్యద్‌ రఫీ
9966025325

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -