Sunday, July 5, 2026
E-PAPER
Homeజాతీయంమణిపూర్ ఓటర్ల జాబితా విడుదల

మణిపూర్ ఓటర్ల జాబితా విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మణిపూర్ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదివారం విడుదల చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)–2026 కోసం గణన ప్రక్రియ మే 30 నుంచి జూన్ 28 వరకు నిర్వహించినట్లు సీఈఒ కార్యాలయం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల నుంచి 19.34 లక్షలకు పైగా గణన పత్రాలు సేకరించినట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఒ) కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 20,93,076 మంది ఓటర్లలో 19,34,399 మంది గణన పత్రాలు సమర్పించారని, ఇది మొత్తం ఓటర్లలో 92.42 శాతానికి సమానమని పేర్కొంది.

ఈ ప్రక్రియలో 43,000 మంది మరణించిన ఓటర్లను (2.06 శాతం), 1,08,283 మంది నివాసం మారిన, అందుబాటులో లేని లేదా ఇతర వర్గాలకు చెందిన ఓటర్లను (5.17 శాతం) గుర్తించినట్లు తెలిపింది. అలాగే, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన 7,394 మంది ఓటర్లను గుర్తించామని, వారి పేర్లు ఒక్క చోట మాత్రమే కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఈ సవరణ కార్యక్రమాన్ని 60 మంది ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓలు), 84 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌ఓలు), 317 మంది బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, 2,956 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీలు పాల్గొనగా, బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏలు) సంఖ్య 5,003 నుంచి 6,363కు పెరగడం రాజకీయ పార్టీల భాగస్వామ్యం, పారదర్శకత మరింత పెరిగినట్లు సూచిస్తోందని సీఈఓ కార్యాలయం పేర్కొంది.

అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులు (ఐడీపీలు) కూడా ఓటర్ల జాబితా సవరణలో పాల్గొనేలా జిల్లా నోడల్ అధికారుల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. అలాగే, జూలై 1, 2026 నాటికి లేదా అంతకు ముందే 18 ఏళ్లు పూర్తి చేసుకున్న అర్హులైన పౌరులు ‘ఫారం–6’ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్యను 2,956 నుంచి 3,041కు పెంచామని, దీంతో ఏ పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్ల సంఖ్య 1,200కు మించకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది. ముసాయిదా జాబితాపై పేర్ల నమోదు, సవరణ, తొలగింపులకు సంబంధించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను జూలై 5 నుంచి ఆగస్టు 4 వరకు స్వీకరిస్తారని, ఓటర్లు తమ దరఖాస్తులను బీఎల్‌ఓలు లేదా ఈఆర్‌ఓలకు నేరుగా సమర్పించవచ్చని తెలిపింది. అలాగే ‘ఓటర్స్ సర్వీస్ పోర్టల్’,(ఈసీఐనెట్) మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని వెల్లడించింది. అన్ని క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబర్ 2లోగా పరిష్కరించి, తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -