నవతెలంగాణ – హైదరాబాద్ : భారత ఎన్నికల చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ‘ధర్తి పకడ్’ నాగర్మల్ బాజోరియా (96) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పాట్నాలోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. చాలా సార్లు ఎన్నికల బరిలో నిలిచి, ఒక్కసారి కూడా గెలవకపోయినా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడమే ముఖ్యమని చాటిచెప్పిన ఆయన మృతితో ఒక శకం ముగిసింది.1930లో లాహోర్‌లో జన్మించిన నాగర్మల్ కుటుంబం, దేశ విభజనకు ముందే బిహార్‌లోని భాగల్పూర్కు వలస వచ్చింది. అక్కడ వ్యాపారం చేస్తూనే సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు. వార్డు స్థాయి ఎన్నికల నుంచి లోక్‌సభ, విధానసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల వరకు సుమారు 280కి పైగా ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఓటమి ఎదురైన ప్రతీసారి, “నేను ఎన్నికల్లో ఓడిపోను, ప్రజలే ప్రతీసారి ఓడిపోతున్నారు” అని చెప్పడం ఆయన నైజం. తన ఓటమిని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు.
దేశ రాజకీయాల్లో దిగ్గజాలుగా వెలిగిన ఇందిరా గాంధీ (రాయ్‌బరేలి), రాజీవ్ గాంధీ (అమేథి), అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అడ్వాణీ, ప్రణబ్ ముఖర్జీ వంటి వారిపై కూడా ఆయన పోటీకి నిలిచారు. 1997లో వాజ్‌పేయికి వ్యతిరేకంగా 100 గాడిదలతో ప్రచారం నిర్వహించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 1969లో రాష్ట్రపతి అభ్యర్థి వి.వి. గిరిపై నామినేషన్ వేయడంతో పాటు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 17-18 సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.



