పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ ఎదుట సీజేపీ ఆందోళన
దిగొచ్చిన పోలీసులు..72 గంటల్లో అరెస్టు చేస్తామని హామీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జంతర్‌మంతర్ వద్ద జులై 23న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళన సందర్భంగా జరిగిన ఘటనపై హిందుత్వ కార్యకర్తగా చెప్పుకునే స్వతంత్ర భరద్వాజ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భరద్వాజ్‌పై సెక్షన్ 307, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాతో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, సీజేపీ కార్యకర్తలు పటేల్‌చౌక్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ ఆందోళన చేపట్టారు. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భరద్వాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. సంజయ్‌కుమార్‌పై దాడి జరిగినప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నామని అశుతోష్ రాంకా తెలిపారు. ఘటనకు సంబంధించి భరద్వాజ్‌పై కఠినమైన క్రిమినల్ సెక్షన్లు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం సెక్షన్ కూడా నమోదు చేయాలన్నారు. సౌరవ్ దాస్ మాట్లాడుతూ దాడి గురించి బహిరంగంగా మాట్లాడుతున్న వ్యక్తి ఇంకా బయట ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు అధికార బీజేపీ ఒత్తిడికి లొంగి చర్యలు తీసుకోవడం లేదని, దళిత కుటుంబానికి చెందిన సంజయ్, ఆయన కుమార్తెపై జరిగిన దాడిని తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించారు. పోలీసుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భరద్వాజ్‌కు రాజకీయ పలుకుబడి కారణంగా పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.
భరద్వాజ్..వైరల్ వీడియోతో దుమారం
నీట్ నిరసనల సమయంలో సీజేపీ కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్‌పై దాడి చేశానని, ఆయన తల పగలగొట్టానని, రాజకీయ నేపథ్యం కారణంగా తనపై చర్యలు తీసుకోలేదని భరద్వాజ్ ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానిం చిన వీడియో వైరల్ కావడంతో వివాదం తలెత్తింది. దీంతో భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని, కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.
72 గంటల్లో అరెస్టు
ఎఫ్‌ఐఆర్‌లో సంబంధిత చట్టపరమైన సెక్షన్లు చేర్చాలన్న తమ డిమాండ్‌ను పోలీసులు అంగీకరించారని సంజయ్ ఆజాద్ తెలిపారు. నిందితులను 72 గంటల్లో అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని చెప్పారు. ఢిల్లీ పోలీసులపైనా, రాజ్యాంగంపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఘటన అనంతరం తన తండ్రికి కుట్లు వేయాల్సి వచ్చిందని, పోలీసులు చర్యలు తీసుకో వడంలో జాప్యం చేస్తున్నారని నిషు ఆజాద్ పేర్కొన్నారు. నిందితుడిపై ఎందుకు కఠినమైన సెక్షన్లు నమోదు చేయలేదని ఆమె ప్రశ్నించారు. న్యాయం కోసం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవాలని కోరారు. నిషు ఆజాద్‌కు రాహుల్‌గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలపడంతో జంతర్‌మంతర్ ఘటన ఢిల్లీలో మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది.
మాట మార్చిన భరద్వాజ్
తనపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర భరద్వాజ్ స్పందిస్తూ.. తాను ఆత్మరక్షణ కోసమే తిరగబడ్డానని తెలిపారు. తన వద్ద దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. 10–15 మంది తనను చుట్టుముట్టడంతో ఆత్మరక్షణకు ప్రయత్నించగా సంజయ్ తలకు దెబ్బ తగిలిందన్నారు. రాహుల్‌గాంధీ, ఇతరులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న పాడ్‌కాస్ట్ క్లిప్ నకిలీదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.
బలహీన సెక్షన్లు నమోదు
భరద్వాజ్‌పై బలహీనమైన సెక్షన్లు నమోదు చేశారని తొలుత సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులతో గంటల తరబడి చర్చలు నిర్వహించిన అనంతరం సంజయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చారు. హత్యాయత్నం అభియోగాన్ని వర్తింపజేయాలా లేదా అన్నది వైద్య పరీక్షల ఆధారంగా నిర్ణయించనున్నట్లు పోలీసులు తెలిపారు. నిషు ఆజాద్ చేసిన అత్యాచార బెదిరింపుల ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించారు.
భరద్వాజ్‌పై హత్యాయత్నం కేసు నమోదు
- Advertisement -
- Advertisement -



