Saturday, September 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మక్క సాగర్‌ బ్యారేజీకి వేగంగా ఎన్‌ఓసీ ఇవ్వాలి

సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి వేగంగా ఎన్‌ఓసీ ఇవ్వాలి

- Advertisement -

ముంపు బాధితులను ఆదుకుంటాం
అవసరమైతే ముందుగానే 
పరిహారం జమ
4.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
న్యూఢిల్లీలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌సాయితో మంత్రి ఉత్తమ్‌ భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

సమ్మక్క–సారక్క బ్యారేజీకి నిర్మాణ అనుమతిని (ఎన్‌ఓసీ) వీలైనంత త్వరగా జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ముంపునకు గురయ్యే భూములు, ఇండ్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుందని హామీనిచ్చారు. అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, పరస్పర సహకారం, సంప్రదిం పుల ద్వారా పెండింగ్‌ అంశాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయితో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాలు, బ్యాక్‌వాటర్‌ ప్రభావం, ముంపునకు గురయ్యే భూములు, నివాస గృహాలు, బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసీ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో పూర్తి జలాశయ మట్టం వరకు నీటిని నిల్వ చేసి, ప్రాజెక్టు నిర్దేశిత సాగునీటి ప్రయోజనాలను రైతులకు అందించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సహకరించాలని ఉత్తమ్‌ కోరారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భూములు, ఇండ్లు, ఇతర ఆస్తులకు పరిహారాన్ని అంచనా వేసి పూర్తిస్థాయిలో చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే పరిహారానికి అవసరమైన నిధులను ముందుగానే జమ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకు నేందుకు వీలుగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఎన్‌ఓసీ జారీ చేయాలన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిం చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

ములుగు జిల్లాలో
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై సమ్మక్క సాగర్‌ బ్యారేజీని నిర్మించారని మంత్రి చెప్పారు. మొత్తం 1,143 మీటర్ల పొడవున్న ఈ బ్యారేజీకి 59 రేడియల్‌ గేట్లు ఉన్నాయనీ, పూర్తి జలాశయ మట్టం- ఎఫ్‌ఆర్‌ఎల్‌ 83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా దీనిని రూపొందించారని గుర్తుచేశారు. సాగునీటి అవసరాల కోసం గోదావరి నది నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ పరిధిలోని 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం సమ్మక్క సాగర్‌ ప్రధాన ఉద్దేశమన్నారు. అసలు నీటి వనరు నుంచి తగినంత నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ఆయకట్టుకు సమ్మక్క సాగర్‌ ద్వారా నమ్మకమైన సాగునీటి సరఫరా కల్పించనున్నామని చెప్పారు. దీనికితోడు రామప్ప–పాకాల అనుసంధాన కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని కొంత ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు మార్గమధ్యంలోని గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చడం కూడా ప్రాజెక్టు లక్ష్యాల్లో భాగంగా ఉందన్నారు.

మరో 30 వేల ఎకరాలు
సమ్మక్క సాగర్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ రెండో దశ పరిధిలోని ఐదు జిల్లాల్లో మొత్తం 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ప్రతిపాదించారని చెప్పారు. ఇందులో సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్‌లో 96,494 ఎకరాలు, ఖమ్మంలో 85,774 ఎకరాలు, వరంగల్‌లో 22,422 ఎకరాలు, జనగామలో 1,111 ఎకరాల ఆయకట్టు ఉందని మంత్రి వివరించారు. రామప్ప–పాకాల అనుసంధాన కాలువ కింద ములుగు జిల్లాలో 8 వేల ఎకరాలు, వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 22 వేల ఎకరాలు కలిపి మొత్తం 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు వివరించారు. ఈ విధంగా పాత ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు కొత్త ప్రాంతాలకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టుగా సమ్మక్క సాగర్‌ నిలవనుందని గుర్తుచేశారు.

ఎన్‌ఓసీతోనే అనుమతులకు మార్గం
సమ్మక్క సాగర్‌కు మూలమైన పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి పథకానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో అనుమతి లభించిందని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం చేపట్టిన రీ–ఇంజినీరింగ్‌లో భాగంగా బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని తుపాకులగూడెంకు మార్చారని తెలిపారు. ప్రాజెక్టుకు 2017లో పరిపాలనా అనుమతులు మంజూరు కాగా, 2020లో దీనికి సమ్మక్క సాగర్‌గా నామకరణం చేశారని వివరించారు. 2024 డిసెంబర్‌లోనే సవరించిన పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రాజెక్టుకు 2020లోనే పర్యావరణ అనుమతి లభించిందనీ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను 2021 ఆగస్టులో కేంద్ర జల సంఘానికి సమర్పించారని గుర్తుచేశారు. ఇప్పటికే పలు సాంకేతిక అనుమతులు లభించినప్పటికీ, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ రాకపోవడంతో అంతర్రాష్ట్ర అంశాల పరిశీలన పెండింగ్‌లో ఉందన్నారు. బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వతోపాటు మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అనుమతి ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని అభిప్రాయపడ్డారు.

నిరంతర సంప్రదింపులు
సమ్మక్క సాగర్‌ ఎన్‌ఓసీ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలోనూపలుమార్లు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయితో చర్చించారు. 2025 సెప్టెంబర్‌ 22న రాయ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో ప్రాజెక్టు ప్రాధాన్యం, తెలంగాణ రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం 2026 జూన్‌ 11న హైదరాబాద్‌లో మరోసారి సమావేశమై ఎన్‌ఓసీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా న్యూఢిల్లీలో తాజాగా భేటీ అయి, నిరభ్యంతర పత్రాన్ని సాధ్యమైనంత త్వరగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముంపు ప్రభావిత కుటుంబాల హక్కులు, ప్రయోజనాలను సంపూర్ణంగా పరిరక్షిస్తూనే సమ్మక్క సాగర్‌ ద్వారా నిర్దేశించిన సాగునీటి ఫలాలను రైతులకు అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, నిరంతర సంప్రదింపుల ద్వారా పెండింగ్‌ అంశాలను పరిష్కరించి, సమ్మక్క సాగర్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిని కోరారు.

బ్యాక్‌వాటర్‌ అధ్యయనానికి రూ.9.883 కోట్లు
సమ్మక్క సాగర్‌ బ్యారేజీ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే బ్యాక్‌వాటర్‌ ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.9.883 కోట్లను బీజాపూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ జలవనరుల శాఖకు చెల్లించిందని చెప్పారు. ఈ మొత్తాన్ని 2026 ఏప్రిల్‌ 29న విడుదల చేసినట్టు తెలిపారు. పూర్తి జలాశయ మట్టం, అత్యధిక వరద నీటిమట్టానికి సంబంధించిన డీజీపీఎస్‌ సర్వేలు పూర్తయ్యాయని ఛత్తీస్‌గఢ్‌ జలవనరుల శాఖ 2026 ఆగస్టు 7న తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందదని వివరించారు. ప్రస్తుతం లైడార్‌ డ్రోన్‌ సర్వేలతోపాటు క్షేత్రస్థాయి సమాచార సేకరణ కొనసాగుతున్నట్టు చెప్పారు. ఈ అధ్యయనాల ఆధారంగా ముంపు ప్రభావిత ప్రాంతాలు, భూములు, ఇండ్లు ఇతర ఆస్తుల వివరాలను నిర్ధారించి పరిహార ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -