వ్యర్థాల్లో దాగిన ఆరోగ్య హెచ్చరిక
యాంటీబయాటిక్ నిరోధకతపై ముందస్తు సంకేతాలు
ప్రజారోగ్యానికి భవిష్యత్‌లో తీవ్ర సవాల్ : ప్రొ. పి.మురళీధర్‌రెడ్డి
నవతెలంగాణ–ఉస్మానియా యూనివర్సిటీ
నగరాల్లో ప్రతిరోజూ ప్రవహించే మురుగునీరు వ్యర్థాలను మాత్రమే మోసుకెళ్లడం లేదని, భవిష్యత్‌లో ప్రజారోగ్యానికి ఎదురయ్యే ముప్పులకు సంబంధించిన కీలక సంకేతాలను కూడా అందులో గుర్తించొచ్చని తాజా పరిశోధనలో ఒక సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా యాంటీబయాటిక్ నిరోధకతను ముందుగానే గుర్తించేందుకు మురుగునీటిలోని సూక్ష్మజీవుల జన్యు సమాచారాన్ని విశ్లేషించడం వల్ల ఉపయోగం ఉంటుందని పరిశోధకులు సూచించారు. వ్యర్థాల్లోనే ఆరోగ్య హెచ్చరిక దాగి ఉందంటున్నారు. ముఖ్యంగా “యాంటీబయాటిక్ నిరోధకత”ను ముందుగానే గుర్తించేందుకు మురుగునీటి జన్యు విశ్లేషణ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
నాలుగు నగరాలు.. 447 నమూనాలు
2022 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఢిల్లీ, ముంబయి, చెన్నయ్, కోల్‌కతా నగరాల్లోని 19 ప్రాంతాల నుంచి మొత్తం 447 మురుగునీటి నమూనాలను పరిశోధకులు సేకరించారు. వీటిలోని సూక్ష్మజీవుల జన్యు సమాచారాన్ని ‘షాట్‌గన్ మెటాజెనోమిక్స్’ అనే ఆధునిక సాంకేతికతతో విశ్లేషించారు. ఒకే నమూనాలో ఉన్న అనేక సూక్ష్మజీవుల జన్యు సమాచారాన్ని ఒకేసారి అధ్యయనం చేయడం ఈ సాంకేతికత ప్రత్యేకత. నాలుగు నగరాల్లోని సూక్ష్మజీవుల సమూహాల్లో గణనీయమైన తేడాలు కనిపించినప్పటికీ.. యాంటీబయాటిక్ నిరోధక జన్యువుల ధోరణిలో మాత్రం నగరాల మధ్య ఎక్కువ సారూప్యత కనిపించినట్టు పరిశోధనలో తేలింది.
టెట్రాసైక్లిన్,
బీటా-లాక్టమ్ మందులకు నిరోధకత
ముఖ్యంగా టెట్రాసైక్లిన్, బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్‌కు సంబంధించిన నిరోధక జన్యువులను గుర్తించారు. వీటిలో కొన్ని మొబైల్ జన్యు భాగాలతో అనుసంధానమై ఉన్నట్టు తేలింది. ఇవి ఒక బ్యాక్టీరియాలోని జన్యు సమాచారాన్ని మరో బ్యాక్టీరియాకు బదిలీ చేయడంలో ప్రముఖపాత్ర పోషించగలవు. దీంతో యాంటీబయాటిక్ నిరోధకత ఒక బ్యాక్టీరియా నుంచి మరో బ్యాక్టీరియాకు వ్యాపించే అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.
సూక్ష్మజీవుల ప్రపంచం
పట్టణ మురుగునీటిలో ఇంకా పూర్తిగా తెలియని సూక్ష్మజీవుల ప్రపంచం పెద్ద ఎత్తున ఉన్నట్టు వెల్లడైంది. సాధారణంగా యాంటీబయాటిక్ నిరోధకతను ఆస్పత్రుల్లో రోగుల నమూనాల ద్వారా పరీక్షించి గుర్తిస్తారు. మురుగునీటిని క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా ఒక ప్రాంతంలో ఏ రకాల నిరోధక జన్యువులు ఉన్నాయి, వాటి స్థాయి పెరుగుతుందా అనే విషయాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అందువల్ల మురుగునీటి పర్యవేక్షణను ప్రజారోగ్య పర్యవేక్షణలో అదనపు సాధనంగా అభివృద్ధి చేయొచ్చని పరిశోధన సూచిస్తోంది. ప్రజలు వైద్యుల సూచన మేరకే యాంటీబయాటిక్స్‌ను వినియోగించాలని సూచించారు.
సైన్స్ నుంచి సమాజానికి ముందస్తు హెచ్చరిక..
మురుగునీటిని ఇప్పటివరకు మనం ప్రధానంగా వ్యర్థాలుగా మాత్రమే చూశాం. ఆధునిక జన్యు సాంకేతికతతో పరిశీలిస్తే అందులో ఒక నగరంలోని సూక్ష్మజీవుల ప్రపంచంతో పాటు యాంటీబయాటిక్ నిరోధకతకు సంబంధించిన కీలక సమాచారం కూడా దాగి ఉందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. భవిష్యత్‌లో మురుగునీటి పర్యవేక్షణ ప్రజారోగ్యానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా మారితే, వ్యాధి తీవ్రత పెరగకముందే ప్రమాద సంకేతాలను గుర్తించి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
‘వన్ హెల్త్’ విధానంతో ఎదుర్కోవాలి
యాంటీబయాటిక్ నిరోధకత భవిష్యత్‌లో ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాల్‌గా మారే అవకాశం ఉంది. మురుగునీటిలోని సూక్ష్మజీవుల జన్యు సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా యాంటీబయాటిక్ నిరోధక జన్యువుల ఉనికిని, వాటి వ్యాప్తి ధోరణులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. మానవ ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం పరస్పరం అనుసంధానమై ఉన్నందున ‘వన్ హెల్త్’ విధానంతో ఏఎంఆర్‌ను ఎదుర్కోవాలి. మురుగునీటి పర్యవేక్షణను శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే ఆరోగ్యపరమైన ముప్పులను ముందుగానే గుర్తించి తగిన ప్రజారోగ్య చర్యలు చేపట్టేందుకు ఉపయోగపడుతుంది.
డా. పి. మురళీధర్‌రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర విభాగం, ఓయూ
మురుగు నీటిలోనే ముప్పు జాడ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



