Saturday, September 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగత ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ముప్పు

గత ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ముప్పు

- Advertisement -

ముంపు సమస్యపై సీఎం నేతృత్వంలో కేంద్ర పెద్దలను కలుస్తాం : మంత్రి పొంగులేటి
భద్రాచలం ఆలయ నిర్మాణ పనులపై అసంతృప్తి
నాణ్యత పాటించాలని సూచన
నవతెలంగాణ-భద్రాచలం

​గతంలో పదేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ వైఫల్యంతోనే మనకు పోలవరం ముప్పు పొంచి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరి వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామపంచాయతీలను ఆంధ్రాలో విలీనం ‌చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌‌నినో ప్రభావంతో ప్రస్తుతం వరదలు లేకున్నా.. భవిష్యత్ లో భద్రాచలం నుంచి ములుగు వరకు సాధారణం కంటే 20-25 అడుగుల వరకు అధికంగా బ్యాక్ వాటర్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతంలో సీడబ్ల్యూసి, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలు విన్నవించినా.. వారు పట్టించుకోలేదని తెలిపారు.
పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణలో ముంపు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. పార్లమెంట్ సమావేశాల నాటికి తెలంగాణ ఎంపీలు, గోదావరి పరీవాహక ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి, పోలవరం వరద ముప్పు తీవ్రతను వివరించి, పునః పరిశీలించాలని కోరతామని చెప్పారు.
భద్రాచలం ఆలయ పునః నిర్మాణాల్లో వేగం పెంచాలి
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పునః నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆలయ నిర్మాణ పనుల్లో ప్రతి రోజూ మూడు షిఫ్ట్ లుగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని 24 గంటలు పని జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 25శాతం పనులే జరిగాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం వహించొద్దని చెప్పారు. దేవాదాయశాఖ పై తమకు ఎంతో నమ్మకం ఉందని, నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా ఆలయ నిర్మాణాలు జరిపించాలని సూచించారు. అదేవిధంగా ఆలయానికి తీసుకొనే రాళ్ళ నాణ్యత కచ్చితంగా ఉండాలని, మేలిమి కలిగిన వాటిని ఉపయోగించాలని సిబ్బందికి సూచించారు. పనులు దగ్గరుండి చూసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీ.ఓ రాహుల్ ను మంత్రి ఆదేశించారు. ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అనుమతి తీసుకొని తక్షణమే మంజూరు చేయిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో ఆలయ ఈ.ఓ దామోదర్, క్షేత్ర కన్సల్టెంట్ ప్రతినిధులు సత్య కృష్ణ, సూర్యనారాయణమూర్తి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -