ఆర్మీ కార్యదర్శిగా ఆడమ్ టెల్లె
రిపబ్లికన్ నేతలతో సుదీర్ఘ అనుబంధం
అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై పెరుగుతున్న ప్రశ్నలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మరో కీలక పదవిలో మార్పు చోటుచేసుకుంది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్తో విభేదాల నేపథ్యంలో ఆర్మీ సెక్రెటరీ డాన్ డ్రిస్కాల్ ఈ వారం రాజీనామా చేసిన తర్వాత.. ఆయన స్థానంలో తాత్కాలిక ఆర్మీ కార్యదర్శిగా ఆడమ్ టెల్లెను ట్రంప్ నియమించారు. ఆర్మీలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ మార్పులు ట్రంప్ పరిపాలనలోని అంతర్గత విభేదాలపై మరోసారి దృష్టిని మళ్లించాయి.
ప్రస్తుతం టెల్లె అమెరికా ఆర్మీకి చెందిన సివిల్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు రిపబ్లికన్ రాజకీయ వర్గాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 20 ఏండ్లకు పైగా రిపబ్లికన్ సెనేటర్ల వద్ద పనిచేసిన ఆయన.. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో వైట్‌హౌస్‌లో కూడా పనిచేశారు.
ట్రంప్‌నకు సన్నిహిత రాజకీయ అనుబంధం
ట్రంప్ తొలి పాలనలో సుమారు 18 నెలలు వైట్‌హౌస్‌లో పనిచేసిన టెల్లె.. అప్పట్లో అధ్యక్షుడికి సెనేట్‌తో సంబంధాల విషయంలో ప్రధాన అనుసంధానకర్తగా వ్యవహరించారు. అనంతరం 2021 నుంచి 2025 వరకు టెన్నెసీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ బిల్ హాగెర్టీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు.టెల్లె నియామకాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల’లో ప్రశంసించారు. టెల్లెను ‘గొప్ప దేశభక్తుడు’గా అభివర్ణించిన ట్రంప్.. ఆయనను అందరూ గౌరవిస్తారని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రశంసల వెనుక ఆర్మీ ఉన్నతస్థాయిలో నెలకొన్న విభేదాలపై ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆర్మీకి అత్యున్నత పౌర అధికారి అయిన డాన్ డ్రిస్కాల్ తన పదవికి రాజీనామా చేయడానికి కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే రక్షణ మంత్రి హెగ్సెత్తో ఆయనకు విభేదాలు ఉన్నట్టు అమెరికా మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. డ్రిస్కాల్‌కు సన్నిహితంగా ఉన్న ఆర్మీ అధికారుల్లో కొందరిని కూడా ఈ ఏడాది ట్రంప్ రక్షణ శాఖ చీఫ్ హెగ్సెత్ తొలగించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో డ్రిస్కాల్ రాజీనామా కేవలం వ్యక్తిగత నిర్ణయమా లేక ట్రంప్ రక్షణ శాఖలో కొనసాగుతున్న అంతర్గత అధికార పోరాటానికి సంకేతమా అన్న చర్చ మొదలైంది. మొత్తంగా డ్రిస్కాల్ ఆకస్మిక రాజీనామా, హెగ్సెత్తో విభేదాల వార్తలు, ఆయనకు సన్నిహితుల తొలగింపుల తర్వాత టెల్లె నియామకం.. ట్రంప్ రెండో పాలనలో రక్షణ వ్యవస్థలో అంతర్గత సమన్వయం, అధికార సంబంధాలపై మరోసారి సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ట్రంప్ పాలనలో మరో కీలక మార్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



