Saturday, September 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనౌకలపై దాడులు ఆపితేనే ఇరాన్‌తో చర్చలు : వాన్స్

నౌకలపై దాడులు ఆపితేనే ఇరాన్‌తో చర్చలు : వాన్స్

- Advertisement -


ఒత్తిడి కోసం అన్ని చర్యలనూ పరిశీలిస్తున్నాం
పోరు ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేను..
ఇరాన్‌నే అడగండి
వాషింగ్టన్ :
ఇరాన్ విషయంలో ఏం చేయాలనే దానిపై అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ఆర్థిక, సైనిక, దౌత్య, రహస్య చర్యలు సహా అనేక మార్గాలు తమ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. అయితే ఇరాన్‌తో ఇప్పుడప్పుడే చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు ఆపేంతవరకూ ఆ దేశంతో చర్చలు జరపబోమని అన్నారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వాన్స్ అధ్యక్షభవనంలో విలేకరులతో మాట్లాడారు. ‘దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి స్పష్టంగా ఉంది. వాణిజ్య నౌకలపై దాడులు ఆపేంతవరకూ ఇరాన్‌తో చర్చించబోమని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు’ అని గుర్తు చేశారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ జరుపుతున్న దాడులు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రయత్నాలు ముందుకు సాగడానికి ప్రధాన అడ్డంకిగా మారాయని చెప్పారు. చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇరాన్ ఆపేయాలని సూచించారు. ఇరాన్‌పై తాము చేపట్టిన సైనిక చర్యల కారణంగానే హార్ముజ్‌లో నౌకాయానం పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరిగే వరకూ ఘర్షణలు కొనసాగుతాయా అని విలేకరులు ప్రశ్నించగా ‘నేను దానిని యుద్ధంగా అనుకోవడం లేదు’ అని అన్నారు. ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదని, ఆరు వారాల తర్వాత ప్రధాన ఆపరేషన్స్ ముగిసిపోయాయని చెప్పుకొచ్చారు. అయితే కొన్ని ప్రాంతాలలో తిరిగి పోరు ప్రారంభమైందని, ఇరాన్‌తో ఉద్రిక్తతలు పరిష్కారం కాలేదని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితికి ముగింపు లభిస్తుందా అని అడిగిన ప్రశ్నకు వాన్స్ బదులిస్తూ నిర్దిష్టమైన గడువు ఏదీ చెప్పలేనని, నౌకలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఇరాన్ నిర్ణయంపై అది ఆధారపడి ఉంటుందని చెప్పారు. అసలు ఈ ప్రశ్నను ఇరాన్‌నే అడగాలని సూచించారు. పరిస్థితి క్షీణిస్తే ఇరాన్‌పై వేర్వేరు రూపాలలో ఒత్తిడిని కొనసాగిస్తామని అన్నారు. వెనిజులా చమురు నిల్వలపై నియంత్రణను అమెరికాకు బదిలీ చేసేందుకు ఉద్దేశించి కుదుర్చుకున్న ఒప్పందంతో అంతర్జాతీయ చమురు ధరలు దిగివచ్చాయని చెప్పారు. ఇరాన్‌పై తాము చేసిన యుద్ధానికి తగినంత సహకారం అందించని మిత్రదేశాలపై ఆయన మండిపడుతూ ఇంధన సంక్షోభాన్ని ట్రంప్ ఒంటిచేత్తోనే నిరోధించారని కొనియాడారు. ఇరాన్‌లోని సిరిక్ నగరంలో వివాహ వేడుకపై అమెరికా జరిపిన దాడి గురించి ప్రశ్నించగా దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఒకవేళ సైన్యం తప్పు చేస్తే గుణపాఠం నేర్చుకుంటుందని వాన్స్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -