Saturday, September 5, 2026
E-PAPER
Homeజాతీయంసీఎంను ప్రశ్నిస్తే దాడులా?

సీఎంను ప్రశ్నిస్తే దాడులా?

- Advertisement -

ముస్లింలమని తెలిసిన తర్వాత మరింతగా కొట్టారు : ఇద్దరు మహిళా జర్నలిస్టుల ఆరోపణలు
ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్న కార్యక్రమంలో ఘటన

న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధారణ మహిళలకే కాదు.. మహిళా జర్నలిస్టులకూ విలువ లేకుండా పోతోంది. ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆమెను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన తనను, తన తోటి ఉద్యోగి నఫీసా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సాకేత్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని జర్నలిస్ట్ షహీన్ ఖాన్ ఆరోపించారు. అక్కడ తమపై దాడి చేయడంతో పాటు మానసిక వేధింపులకు గురిచేశారని ఆమె వివరించారు. అంతేకాకుండా తమ పేర్లు తెలుసుకున్న పోలీసులు తాము ముస్లింలమని గుర్తించిన తర్వాత దాడి మరింత ఎక్కువైందని ఆరోపించారు.
పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం… ఓ ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు. ఆ సమయంలో ఆమెను ప్రశ్నించేందుకు షహీన్ ఖాన్ ప్రయత్నించగా పోలీసులు ఆమెను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తనను కొట్టారని షహీన్ ఆరోపించారు. నఫీసా ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మానసికంగా వేధించారని ఆమె పేర్కొన్నారు. నఫీసా శరీరంపై కనిపించిన గాయాలను కూడా ఆమె వీడియోలో చూపించారు. పోలీసు సిబ్బంది తన పేరు అడిగి ‘ఖాన్‌’ అని తెలుసుకున్న తర్వాత దాడి మరింత తీవ్రంగా మారిందని షహీన్ ఖాన్ ఆరోపించారు.
జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
ఈ వ్యవహారంపై దేశంలోని ప్రముఖ జర్నలిస్టు సంఘాలు కూడా స్పందించాయి. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ప్రెస్ అసోసియేషన్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సాకేత్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాజకీయంగా దుమారం
మహిళా జర్నలిస్టులపై దాడి విషయంలో కాంగ్రెస్, ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆప్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఇద్దరు మహిళా రిపోర్టర్లను ముఖ్యమంత్రిని ప్రశ్నించినందుకు పోలీసులు క్రూరంగా కొట్టారని ఆరోపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుని, ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆప్ నేత సోమనాథ్ భారతి కోరారు. ఢిల్లీ పోలీసుల రాజ్యంగా మారిందా? అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. ఒక జర్నలిస్ట్ ముస్లిం అని పోలీసులు తెలుసుకున్న తర్వాత దాడి తీవ్రత పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -