Saturday, September 5, 2026
E-PAPER
Homeజాతీయంజీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 
రాకెట్ ప్రయోగం సక్సెస్‌

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 
రాకెట్ ప్రయోగం సక్సెస్‌

- Advertisement -

అడ్వాన్స్‌డ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌-05 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
జియో సింక్రనస్‌ ప్లాట్‌ఫామ్‌లో మొట్టమొదటి ఉపగ్రహం ఇదే

సూళ్లురుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌‌వీ- ఎఫ్‌ 17 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. దేశంలోనే తొలిసారి జియో-ఆర్బిట్ కోసం ఉద్దేశించిన అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం ఈఓఎస్‌-05ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో రియల్ టైమ్ ఇమేజరీ అందించడంలో ఈ ఉపగ్రహం ఎంతో కీలకం కానుంది. ​రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి వేకువజామున 2గంటల 55నిమిషాలకు జీఎస్‌ఎల్‌‌వీ- ఎఫ్‌ 17 రాకెట్ అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్‌-05ను నింగిలోకి మోసుకెళ్లింది. సబ్‌-జియో‌సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. సుమారు 8నెలల విరామం తర్వాత ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టింది. జీఎస్‌ఎల్‌‌వీ సిరీస్‌లో ఇది 19వ రాకెట్‌ ప్రయోగం. 2,268 కిలోల బరువు ఉన్న ఈఓఎస్‌-05 ఉపగ్రహం సరిహద్దు ప్రాంతాలను వేగంగా, స్పష్టంగా కెమెరాలతో పరిశీలించనుంది. తుపానులు వరదలు, భూకంపాలను నిమిషాల వ్యవధిలోనే గుర్తించనుంది. ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలను జారీ చేయనుంది.

పంటల ఆరోగ్యం, భూ వినియోగంలో మార్పులను పరిశీలించనుంది. అంతేకాక సరిహద్దుల సమాచారాన్ని రియల్‌ టైమ్‌లో సేకరించనుంది. దేశ రక్షణరంగంలో ఈ ఉపగ్రహం కీలకం కానుంది. ​ అయితే వరుసగా ఎదురైన వైఫల్యాల తర్వాత ఇస్రో సాధించిన ఈ విజయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు చేపట్టిన 18 ప్రయోగాల్లో ఈ రాకెట్ 6సార్లు పూర్తిస్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. 2021లో మిషన్ ప్రయోగం 307సెకన్ల తర్వాత క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో విఫలమైంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ మిషన్‌ను విజయవంతంగా చేపట్టారు. అంతకుముందు ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌‌వీ- సీ62 రాకెట్ కీలకమైన మూడోదశలో తలెత్తిన లోపం కారణంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరలేకపోయింది. 2025 మే నెలలో చేసిన పీఎస్‌ఎల్‌‌వీ- సీ61 ప్రయోగం కూడా మోటార్ కేస్‌లో ప్రెజర్ సమస్యల వల్ల సక్సెస్ కాలేదు.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే 
తొలి మానవరహిత మిషన్‌
మరోవైపు ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవరహిత మిషన్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో చైర్మెన్‌ ‌వి. నారాయణన్‌ వెల్లడించారు. దీనికోసం వివిధ పరిశ్రమలు, ఇతర సంస్థలతో కలిసి ఇస్రో బృందం అత్యంత ప్రణాళికాబద్ధంగా, ముమ్మరంగా పనిచేస్తోందని తెలిపారు. ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవే‌శపెట్టిన అనంతరం ఇస్రో చైర్మెన్ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈఓఎస్-05 ప్రయోగం ద్వారా ఇస్రో తొలి విజయాన్ని నమోదు చేసిందని పేర్కొన్న ఆయన, కష్టానికి దక్కే ప్రతిఫలం మరింత కష్టపడటమేనని ఉద్ఘాటించారు. దేశ బహుళ అవసరాల నిమిత్తం భూమిని నిశితంగా పరిశీలించేందుకు 36,000 కి.మీ.లు జియో సింక్రోనస్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచుతున్న మొట్టమొదటి ఉపగ్రహం ఇదే కావడం విశేషమని అన్నారు.​”ఈ ఏడాది మేం మరో 6 ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనితోపాటు ఇదే క్యాలెండర్ సంవత్సరంలో గగన్‌యాన్ మానవరహిత వాహకనౌక ప్రయోగాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 6 ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్నాం.”

వి. నారాయణన్‌, ఇస్రో ఛైర్మెన్‌
​ఇస్రో శాస్త్రవేత్తలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అభినందనలు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. ‘అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించిన మరో అతిపెద్ద పేలోడ్‌ ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మో‌డీ దార్శనిక నాయకత్వంలో భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ అంతరిక్ష శక్తిగా మన దేశం బలపడుతోంది’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -