కొండా సురేఖ బర్తరఫ్‌తో తెరపైకి మంత్రివర్గ విస్తరణ
సామాజిక సమీకరణలు, సీనియారిటీనే కీలకం .. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు
పరిశీలనలో ఆది శ్రీనివాస్, రాంచందర్ నాయక్, బాలూనాయక్ పేర్లు
పీసీసీ చీఫ్, స్పీకర్ పేర్లు కూడా…? అధిష్టానం, సీఎం నిర్ణయమే ఫైనల్ : కాంగ్రెస్ వర్గాలు
బి.వి.యన్.పద్మరాజు
రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణపై పడింది. అధికార పార్టీలో ఇందుకు సంబంధించిన హడావుడి అప్పుడే మొదలైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అవి ముగి యగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుం దని, సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదిం పులు, సమాలోచనలు పూర్తి చేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం (అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి) రాష్ట్ర క్యాబినెట్‌లో 18 బెర్తులున్నాయి. కాగా ఇప్పటికే 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకు న్నారు. ఆ రెండు ఖాళీలతోపాటు ఇప్పుడు కొండా సురేఖ బర్తరఫ్‌తో మరో మంత్రి పదవి ఖాళీ అయ్యింది. అంటే ఇప్పటికిప్పుడు మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తే మొత్తం మూడు బెర్తులను నింపాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పలు అంశాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా సామాజిక సమీకరణలు, సీనియారిటీ, పార్టీకి విధేయులుగా ఉండటం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలతో మమేకం కావటం, వివిధ సందర్భాల్లో క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, పార్టీ కార్యక్రమాలను జయప్రదం చేయటం, ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ ఎస్‌ను ఎండగట్టటం తదితరాంశాల ప్రాతి పదికగా తీసుకోవాలని వారు నిర్ణయిం చారు.
ఈ విషయాలన్నింటిలో చేయి తిరిగిన వారిని తీసుకుంటే ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి లాభమని సీఎం భావిస్తున్నారు. అలాంటి వారికే మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆ తరగతికి చెందిన పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. వీటిలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖం గా వినబడు తోంది. ప్రతిపక్ష బీఆర్ ఎస్, బీజేపీ మీద ఎప్పటికప్పుడు విరుచుకు పడుతుండటంతోపాటు సీఎల్పీలో వరసగా ప్రెస్‌మీట్లు నిర్వహి స్తుం డటంతో ఆయన హైక మాండ్ దృష్టిలో పడ్డట్టు సమాచారం. ఆయన తోపాటు మరో విప్ బీర్ల ఐలయ్య, కార్పొరేషన్ చైర్మెన్ ఈరావత్రి అనిల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క మంత్రివర్గంలో కొనసా గుతున్నారు. కాగా లంబాడా సామాజి కవర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ రీత్యా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. వీరితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్
కుమార్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతీసారి వీరిద్దరి పేర్లు తెరపైకి వస్తుండటం గమనార్హం. అయితే వీరిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలంటే ముందుగా వారు ప్రస్తుతం నిర్వహి స్తున్న పదవులకు (పీసీసీ, స్పీకర్) రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ… పార్టీలో అందరినీ కలుపుకుని ముందుకుపోతూ వివాదర హితుడుగా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్‌ను, అసెంబ్లీని సుహృద్భావ వాతావరణం లో నడుపుతూ ఉన్న ప్రసాద్ కుమార్ ను ఆయా పదవుల్లోంచి ఇప్పటికిప్పుడు తొలగించే సాహసం హస్తం పార్టీ చేస్తుందా? అనేది సందేహాస్పదంగా ఉంది. ఒకవేళ వారితో ఆయా పదవులకు రాజీనామా చేయించి.. మంత్రివర్గంలోకి తీసుకున్నా, పీసీసీ పీఠానికి, స్పీకర్ పదవికి ఎవర్ని ఎంపిక చేయాలనేది కత్తిమీద సాములాంటిదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల పీసీసీ చీఫ్‌ను, స్పీకర్‌ను ఇప్పటికిప్పుడు కదలించకపోవచ్చనే వాదన బలంగా వినబడుతోంది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు.
కానీ ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఆశ నెరవేరకపోవచ్చు. వీరితోపాటు నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అయితే సుదర్శన్ రెడ్డి.. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతుండగా, ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మెన్ పదవిలో ఉన్నారు. అందువల్ల వీరిద్దరికి క్యాబినెట్‌లో చోటు దక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆ రీత్యా ఆయా జిల్లాల నుంచి ఒకరికి క్యాబినెట్‌లో చోటు కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు అక్కడి నుంచి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేకపోలేదని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతుండటం గమనార్హం. ఏదేమైనా క్యాబినెట్ కూర్పులో పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయమని వారు చెబుతున్నారు. మరి మూడు మంత్రి పదవులు ఎవరెవర్ని వరిస్తాయో వేచి చూడాలి.



