స్పష్టం చేసిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం జీవో 123 కింద అంగీకారంతో భూములు ఇచ్చిన రైతులకు భూపరిహారంతో పాటు పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం తీసుకుని అంగీకార పత్రాలపై సంతకాలు చేశారనే కారణంతో పునరావాస ప్రయోజనాలను నిరాకరించరాదని తేల్చి చెప్పింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, తొగుట, రాంపూర్ ప్రాంతాలకు చెందిన రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ఈ తీర్పును ఇచ్చారు. జీవో 214లో పునరావాస వ్యయాన్ని భూ పరిహారం నుంచి వేరు చేసినందున రెండూ వేర్వేరు ప్రయోజనాలని పేర్కొంది. 2017 చట్ట సవరణకు 2014 జూన్ 2 నుంచి పూర్వ ప్రభావం ఉన్నందున అర్హులైన రైతులకు పునరావాస హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి పిటిషనర్ అర్హతను అధికారులు విడిగా పరిశీలించి, వాదనలు విన్న అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే పొందిన ఇండ్లు, ఇతర ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుని మిగిలిన ప్రయోజనాల్లో సర్దుబాటు చేయాలని, ఒకే ప్రయోజనం రెండుసార్లు ఇవ్వొద్దని పేర్కొంది. దరఖాస్తు తిరస్కరిస్తే కారణాలతో ఉత్తర్వులు ఇవ్వాలని, ఉత్తర్వుల ప్రతులు అందిన ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి అర్హులకు ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. జీవో 123, 214ల చట్టబద్ధతపై ఈ తీర్పులో అభిప్రాయం చెప్పడం లేదని, ఆ అంశం డివిజన్ బెంచ్ పరిధిలో ఉందని తెలిపింది.
భూ పరిహారం ఇచ్చినా పునరావాసమూ ఇవ్వాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



