జాతీయ దృఢత్వానికి నిదర్శనమే పాఠశాలల ఆరంభం
నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఏవీ అడ్డుకోలేవు
విద్యార్థులకు క్యూబా అధ్యక్షులు డియాజ్ కానెల్ ఉద్బోధ
హవానా : ‘‘విద్యార్ధులతో తరగతి గదులు, టీచర్లతో పాఠశాలలు క్యూబాలో వున్నంత కాలమూ దేశం వుంటుంది, మాతృభూమి వుంటుంది. విప్లవం కూడా వుంటుంది. సోషలిజం కూడా వుంటుంది.’’ అని క్యూబా అధ్యక్షులు, క్యూబా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఫస్ట్ కార్యదర్శి అయిన డియాజ్ కానెల్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుడు మెండివ్ యువ మార్టికి బోధిస్తున్న పాఠశాల ఆనవాళ్ళను కలిగివున్న ప్రదేశమైన పాత హవానాలోని ప్రముఖ పాసియో డెల్ ప్రాడియోలో క్యూబా అధ్యక్షుని పత్రికా బృందంతో డియాజ్ కానెల్ మాట్లాడారు. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం ప్రతి ఒక్కరి గురుతర బాధ్యత అని కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. క్యూబా విప్లవ యోధుడు ఫైడెల్ కాస్ర్టోకు ఇది ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. చుట్టూ పిల్లలు, టీనేజర్లు, యువకులు అందరూ గుమిగూడి వుండగా ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మూడు ముఖ్య అంశాలను విలేకర్లతో పంచుకున్నారు. అందులో మొదటిది ఈ ఏడాది పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభంతో తరగతి గదుల్లో నెలకొన్న విజయమని ప్రస్తావించారు. రెండవది, సమిష్టి ప్రయత్నంతో సాధించిన ఫలితాలని అన్నారు. ఇక మూడవది-మార్పులు, పరివర్తనలతో మునిగిపోయిన సమయంలో బోధనలో, అభ్యాసంలో మనం ఎదుర్కొంటున్న సవాలు అని అన్నారు.
అమెరికా సుదీర్ఘ ఆంక్షల కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఇంధన కొరత, ఉపాధ్యాయులు, ఇతర సామాగ్రి, పరికరాలు ఇలా అన్నీ కొరతగానే వున్నా 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న క్యూబా ధృఢ నిశ్చయాన్ని అధ్యక్షులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. విద్య పట్ల విప్లవానికి వున్ననిబద్ధత, జాతీయ ధృఢత్వానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులె దురైనా విద్యను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. తరగతి గదుల్లోనే విజయం నెలకొంటుందని అన్నారు. విద్యా వ్యవస్థను ఎలాగైనా సుస్థిరంగా కొనసాగించాలని ఉపాధ్యాయులు, కుటుంబాలు, కమ్యూని టీలు, సంస్థలు, వ్యవస్థలు ఇలా అన్నీ భావించాయని, వారందరి సమిష్టి కృషి ఫలితమే ఈ రోజని వ్యాఖ్యానించారు. దేశాన్ని, విప్లవాన్ని, సోషలిజాన్ని పరిరక్షిం చుకోవాలంటే ముందుగా విద్యను పరిరక్షించుకోవడం అత్యంత అవశ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గానికి కూడా అధ్యక్షుడు ఒక విజ్ఞప్తి చేశారు. ‘మీ మీ కుటుంబాల్లో మీరు అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు, మీ అవసరాలను తీర్చేలా మీ వేతనాలు లేవు, అయినాఈ సమయంలో మీ నిబద్ధత, అంకిత భావం మాకు చాలా అవసరం.’’ అని పేర్కొన్నారు. కేవలం విజ్ఞానాన్ని అందించే వారు మాత్రమే కాదు మన ఉపాధ్యాయులు, అంతకుమించి ఒక జాతిగా, ప్రజలుగా మనకు అత్యంత దృఢత్వాన్ని అందించే వారని కొనియాడారు. అనంతరం విద్యార్థలను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘కేవలం మీ కోసమే ఇదంతా’ అని అన్నారు. మనకు నేర్చుకునే సమయంలో ఏవి వున్నా లేకపోయినా మన అభ్యాసానికి, నేర్చుకోవాలనే మన జిజ్ఞాసకు అవేమీ అడ్డురాదని ఆయన స్పష్టం చేశారు.
బడి ఉన్నంతకాలం విప్లవం ఉంటుంది !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



