ఈ పోస్టుపై మాజీ మంత్రి
కొండా సురేఖ ఖండన
మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘త్వరలో బిగ్ అప్‌డేట్’ ఉంటుందని తాను ప్రకటించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి కొండా సురేఖ ఖండించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలో ‘‘త్వరలో బిగ్ అప్‌డేట్. ‘వెయిట్ ఈజ్ ఆల్‌మోస్ట్ ఓవర్’..’’ అంటూ ఆసక్తికర పోస్టు వైరల్ అయింది. దీనిపై కొండా సురేఖ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వివిధ సోషల్ మీడియా వేదికల్లో నా పేరుతో ప్రసారమవుతున్న పోస్టులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీడియా ప్రతినిధులు, ప్రజలు కేవలం అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నాం…’’ అని పోస్టు చేశారు.
రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుస ఇంటర్వ్యూలతో కాంగ్రెస్ సర్కార్‌పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించడం.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవహారశైలి ఎలా ఉండేదన్న ప్రశ్నకు సురేఖ స్పందిస్తూ… “కేసీఆర్ చాలా మంచి వ్యక్తి. తమను ఎప్పుడు కలిసినా ఎంతో గౌరవంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారు” అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీలో పని చేసినన్ని రోజులు కేసీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం అడిగిన వెంటనే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. నాడు కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి దక్కకుండా పార్టీలోని కడియం శ్రీహరి వంటి కొందరు సీనియర్ నేతలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని తెలిపారు. కానీ కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని మిగిలిన వారి నామినేషన్లను ఉపసంహరింపజేసి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూశారని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీవ్ర అసంతృప్తితో, బర్తరఫ్ వేటుతో బయటకు వచ్చిన కొండా సురేఖ.. కేసీఆర్ పాలనను, ఆయన వ్యక్తిత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కేసీఆర్‌పై సురేఖ చేసిన సానుకూల వ్యాఖ్యల నేపథ్యంలో కొండా దంపతులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందా? అనే ప్రచారం జోరందుకుంది.
బర్తరఫ్ ఉత్తర్వులు జారీ
కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి సలహా మేరకు ఆమెను వెంటనే తొలగిస్తూ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా నోటిఫికేషన్ ఇచ్చినట్టు సీఎస్ సంజయ్ జాజు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 164 (1) మేరకు గవర్నర్ కు ఉన్న అధికారంతో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించారు.
త్వరలో బిగ్ అప్‌డేట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



