ఈ విషయం తేలికగా అర్ధం కావడానికి ముందు వాణిజ్య ప్రపంచంలో రెండు దేశాలు మాత్రమే ఉన్నాయనుకుందాం. వాటిలో ఒకటి వాణిజ్యంలో మిగులు కలిగి వుంటే, అప్పుడు రెండో దేశానికి అంతే మోతాదులో వాణిజ్య లోటు ఉంటుంది. స్వేచ్ఛా వాణిజ్య నియమాలు అమలవుతు న్నప్పుడు మొదటి దేశం తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని దాదాపుగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే స్థితిలో ఉంటుంది. పోటీలో వెనుకబడ్డ రెండో దేశం తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగల పరిస్థితిలో ఉండదు.
ఇప్పుడు వాణిజ్య మిగులులో ఉన్న దేశం తన కార్మికుల కొనుగోలుశక్తిని పెంచి దేశీయ వినియోగాన్ని పెంచిందనుకుందాం. అప్పుడు దాని ఎగుమతులు ఆ మేరకు తగ్గిపోతాయి. ఆ మేరకు దాని వాణిజ్య మిగులు కూడా తగ్గుతుంది. ఏ మేరకు ఈ దేశపు వాణిజ్య మిగులు తగ్గుతుందో, ఆ మేరకు రెండో దేశపు లోటు తగ్గాలి. ఇదెలా జరుగుతుందో చూద్దాం. మిగులు ఉన్న దేశం తన దేశీయ వినియోగాన్ని పెంచింది. అప్పుడు ఆ దేశం ఎగుమతులు ఆ మేరకు తగ్గుతాయి. అప్పుడు వాణిజ్య లోటు ఉన్న దేశంలోని దేశీయ ఉత్పత్తిదారులకు అంతకు మునుపటికన్నా ఎక్కువ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. వారి ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియో గించుకునే అవకాశం వస్తుంది. అలా వినియోగించుకోవడం ద్వారా అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. దానితో బాటు ఉపాధి కూడా పెరుగుతుంది. దాని వలన అక్కడ వినియోగమూ పెరుగుతుంది. అంటే వాణిజ్య మిగులు ఉన్న దేశంలో కార్మికుల వినియోగం పెరిగితే, దాని పర్యవసానంగా వాణిజ్య లోటు ఉన్న దేశంలో కూడా ఉత్పత్తి, వినియోగం పెరుగుతాయి.
మరోలా చెప్పాలంటే, వాణిజ్య మిగులు ఉన్న దేశం తన మిగులును తగ్గించుకునేలా, తన దేశీయ వినియోగాన్ని పెంచేలా దానిపై వత్తిడి తేగలిగితే, మొత్తంగానే ఉత్పత్తి, ఉపాధి, వినియోగం పెరుగుతాయి, వాణిజ్య ఖాతాలో అసమానతలూ తగ్గుతాయి. అంటే అన్ని దేశాలకూ ప్రయోజనం కలుగుతుంది.
కాని ప్రస్తుతం అమలౌతున్న అంతర్జాతీయ వాణిజ్య ఏర్పాటు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. అది వాణిజ్య మిగులు ఉన్న దేశాన్ని వదిలిపెట్టి లోటు ఉన్న దేశం మీద ఒత్తిడి తెస్తోంది. వానిజ్య లోటు ఉన్న దేశం తన దేశీయ వినియోగాన్ని ఇంకా తగ్గించుకుని మరింత ఎక్కువగా తన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా వాణిజ్య లోటును పూడ్చుకోవాలని చెప్తోంది. దేశీయ వినియోగాన్ని తగ్గించుకోవడం వలన దేశంలోకి వచ్చే దిగుమతులు తగ్గుతాయని, అందువలన వాణిజ్య లోటు తగ్గుతుందని అంటోంది. అయితే ఇలా చేస్తే ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి తగ్గిపోతుంది, ఉపాధి తగ్గిపోతుంది, దానితోబాటు ప్రపంచం మొత్తం మీద వినిమయమూ తగ్గిపోతుంది.
వాణిజ్య ఖాతాలలోని అసమానతలను సర్దుబాటు చేయడానికి ఇప్పుడు మనముందు రెండు దారులు ఉన్నాయి. మొదటి దారి: వాణిజ్య మిగులు ఉన్న దేశం తన దేశీయ వినియోగాన్ని పెంచుకుని తద్వారా ఎగుమతు లను తగ్గించుకోవడం. ఈ దారిని అనుసరిస్తే ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, వినియోగం-అన్నీ పెరుగుతాయి. ఇక రెండో దారి: వాణిజ్య లోటు ఉన్న దేశం తన వినిమయాన్ని తగ్గించుకోవడం. ఈ దారిని అనుసరిస్తే అప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి, వినియోగమూ తగ్గుతుంది.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు కారణం ప్రపంచం మొత్తం మీద వినియోగం తగ్గిపోవడమే కదా. ఈ సంక్షోభాన్ని దాటి బయట పడాలంటే ముందు ప్రపంచ వినిమయాన్ని పెంచడం తప్పనిసరి. ఒకవేళ వాణిజ్య మిగులు ఉన్న దేశం తన దేశీయ వినిమయాన్ని పెంచడానికి, కార్మికుల ఆదాయాలను పెంచడానికి సిద్ధంగా లేకపోయినా, ఎగుమతులను తగ్గించు కుంటే చాలు. అప్పుడు వాణిజ్య లోటు ఉన్న దేశాలు తమ ఉత్పత్తిని పెంచుకోగలుగుతాయి. దానికి అనుగుణంగా ఉపాధి, వినియోగం పెరుగుతాయి.
కాని ఈ మెరుగైన మొదటి దారిని వదిలిపెట్టి నష్టదాయకమైన రెండో దారిలోనే ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. 1944లో బ్రెట్టన్‌వుడ్ కవలలను (ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్) స్థాపిస్తున్నప్పుడే ఆర్థికవేత్త కీన్స్ ఈ విషయంలో హెచ్చరించాడు. వాణిజ్య మిగులు ఉన్న దేశాలను సర్దుబాటు చేసుకుని మిగులును తగ్గించుకోవాలన్నాడు. కాని ఆ రోజుల్లో అమెరికా ఎప్పుడూ వాణిజ్య మిగులుతో కొనసాగేది. అందుచేత కీన్స్ సలహాను వ్యతిరేకించింది. ఇతర దేశాలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలంటే వాటితో జరిపే వాణిజ్యంలో తాను మిగులులో ఉండడం అవసరం అనుకుంది. అందుచేత తన దేశంలోని కార్మికుల జీతాలను పెంచడానికి, తద్వారా దేశీయ వినియోగాన్ని పెంచడానికి సిద్ధపడలేదు. ఏ పెట్టుబడిదారీ దేశం తన కార్మికుల జీతాలను పెంచడానికి ప్రాధాన్యతనిస్తుంది చెప్పండి?
అయితే, 1944 నాటికి ఇప్పటికి మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చేశాయి. 1944 నాటికి వాణిజ్య మిగులును కలిగివున్న అమెరికా 1970 దశకం నుండీ అదే పనిగా వాణిజ్య లోటును కొనసాగిస్తూ వస్తోంది. తను మిగులులో ఉన్నప్పుడు వాణిజ్య లోటు సర్దుబాటును వ్యతిరేకించిన అమెరికా ఇప్పుడు లోటులో పడింది కదా. మరి ఇప్పుడు సర్దుబాటు చేయమని ఎందుకు అమెరికా పట్టుబట్టడం లేదు? అన్న ప్రశ్న కొందరికి రావొచ్చు. ఇందుకు మూడు కారణాలున్నాయి.
మొదటిది: ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాద శిబిరానికి నాయకురాలిగా ఉంది. అలా నాయకత్వ స్థానంలో ఉండే దేశం ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి అనేక ప్రాంతాల్లో సైనిక స్థావరాలని నిర్వహించవలసివుంటుంది. అప్పుడు అది ఎక్కడా తిరుగుబాట్లు తల్తెకుండా అణచివేయ గలుగుతుంది. ఆ సైనిక స్థావరాల నిర్వహణ కోసం ప్రపంచం అంతటా తను చాలా ఖర్చు చేయవలసివుంటుంది. అందుచేత దాని వాణిజ్య లోటు పెరుగుతుంది. అందుకే అమెరికా తన వాణిజ్య లోటు పెరగడం పట్ల ఎంతమాత్రమూ ఆందోళన పడడం లేదు.
రెండవది: ఇప్పుడు డాలర్ అనేది ప్రపంచ వ్యాప్తం గా ఆమోదించబడుతున్న కరెన్సీగా ఉంది. తన వద్ద డాలర్ చెల్లదు అన్న దేశమేదీ లేదు. అన్ని దేశాలూ తమ వద్ద ఎక్కువ మొత్తంలో డాలర్లను నిల్వ ఉంచుకోడానికి ప్రయ త్నిస్తాయి. అలా ప్రపంచానికి అవసరమైన డాలర్లను, డాలర్ల రూపంలో రుణాలను అందించడానికి అమెరికా కావలసినన్ని డాలర్లను తయారు చేసుకోవచ్చు. అందు చేత అర్జెంటుగా తన వాణిజ్య లోటును పూడ్చుకోవాలనే తొందరేదీ అమెరికాకు లేదు.
మూడవది: ఇప్పుడు అమెరికా ఇతర దేశాల నుండి చేసుకుంటున్న దిగుమతుల్లో అత్యధికభాగం తూర్పు ఆసియా దేశాల నుంచి వస్తున్నాయి. ఆ సరుకులని అమెరికన్ పెట్టుబడులతోటే ఆ యా దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికాలో అంతవరకూ సాగిన ఉత్పత్తి కార్యకలాపాలను చౌకగా కార్మికులు లభించే ఆదేశాలకు ఇదివరకే తరలించారు. ఇప్పుడు అమెరికా తన వాణిజ్య లోటును తగ్గించుకోవడం అంటే ఆ దేశాల నుండి దిగుమతులను తగ్గించడం. అంటే ఆ దేశాల్లో ఉన్న అమెరికన్ పెట్టుబడికి నష్టం కలిగించడం . ఇటువంటి దిశగా ఏ అమెరికన్ ప్రభుత్వమూ, అనివార్యమైతే తప్ప, చర్యలు తీసుకోదు.
పై మూడు కారణాల రీత్యా, తన వాణిజ్య లోటు భారీగా పెరుగుతున్నా, అమెరికా, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో ఎటువంటి మార్పునూ డిమాండ్ చేయడం లేదు. తన డాలర్లను ప్రపంచ వ్యాప్తంగా కుమ్మరించడం ద్వారా అమెరికా ఇప్పటి దాకా నిశ్చింతగా ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో పరిస్థితులు మారాయి. చైనా తన విదేశీ మారకపు నిల్వలలను డాలర్ల రూపంలో ఉంచుకోడానికి సిద్ధంగా లేదు. ఉన్న డాలర్ నిల్వలను వదిలించు కోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది తక్షణమే అమెరికాకు ముప్పుగా పరిణమించకపోయినా రాబోయే రోజుల్లో డాలర్ ఆధిపత్యం కొనసాగకుండా పోయే పరిస్థితులు వస్తాయన్న భయం మొదలైంది. అందుచేత ఇప్పుడు అమెరికా తన వాణిజ్య లోటును తగ్గించుకోవలసిన అవసరాన్ని గుర్తిస్తోంది. ఐతే, అందుకోసం అది అనుసరిస్తున్న మార్గం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తంగా బలపరిచేదిగా మాత్రం లేదు. ఈ మధ్య కాలంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ వాణిజ్య ఒప్పందాల్లోని హేతు విరుద్ధతను సరి చేసేవిగా లేవు.
తమ తమ దేశాలలోని డిమాండ్ ను తగ్గించి ఎగుమతులను పెంచాలంటూ ఇతర ‘లోటు’ దేశాలకు సలహాలిస్తున్న అమెరికా తన భారీ లోటును తగ్గించుకోడానికి తన దేశీయ డిమాండ్ ను తగ్గించుకుని తాను కూడా ఎగుమతులను పెంచుకోవాలని అనుకోవడం లేదు. అందుకు భిన్నంగా తన దేశంలో ఉపాధిని, ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం ట్రంప్ రెండు ఆయుధాలను ప్రయోగిస్తున్నా డు. మొదటిది: సుంకాలను బాగా పెంచివేయడం. వాటిని అంగీకరించేలా భాగస్వామ్య దేశాల మెడలు వంచి వాటిని ఒప్పించడం (ఈ దేశాల జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది). ఈ ఒప్పందాల్లో ఏ దేశం ఎంత మొత్తంలో అమెరికా నుండి సరుకులను దిగుమతి చేసుకోవాలో స్పష్టంగా ఉంటుంది. అదే సమయంలో ఆ దేశం నుండి అమెరికా ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవాలో అదే విధంగా స్పష్టపరిచి వుండదు. ఇటువంటి ఒప్పందాలను గనుక అంగీకరించకపోతే అటువంటి దేశాల మీద మరింత ఎక్కువగా సుంకాలను విధిస్తుంది అమెరికా. అందుచేత చాలా దేశాలు ఒప్పందాలను అంగీకరించడానికే మొగ్గు చూపుతాయి. ఇటువంటి ఒప్పందాల వలన అమెరికా ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతులు తగ్గి వాటిని దేశీయంగా అమెరికాలోనే ఉత్పత్తి చేయవలసిన అవసరమూ పెరుగుతుంది. దాని వలన అక్కడ ఉపాధి కూడా పెరుగుతుంది. కాని అదే విధమైన ప్రయోజ నాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద వేరే ఎక్కడా కలగవు. అమెరికా కేవలం తనకు మాత్రమే ప్రయోజనం ఉండే విధంగా ఒప్పందాలను చేసుకోడానికి ఇతర దేశాల మెడలమీద కత్తి పెట్టి వాటిని ఒప్పిస్తోంది.
ఇలా తన ఆర్థిక వ్యవస్థకు మాత్రమే ప్రయోజనం కలిగే విధంగా ఉండే ఒప్పందాలను ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత ఎక్కువగా వాటిని ఈ ప్రపంచం మీద బలవంతాన రుద్దేందుకు అమెరికా రాబోయే రోజుల్లో ఎక్కువ ఊపుతో తయారౌతుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
అమెరికాకు ఒక న్యాయం -తక్కిన ప్రపంచానికి మరో న్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



