Tuesday, July 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధోన్మాదులను చంపాల్సిందే

యుద్ధోన్మాదులను చంపాల్సిందే

- Advertisement -

ఖమేనీ అంత్యక్రియలకు
భారీగా తరలి వస్తున్న జనం
ట్రంప్‌, నెతన్యాహూలపై ప్రజాగ్రహం

టెహ్రాన్‌ : ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నగర వీధులు ప్రజా సందోహంతో కిక్కిరిసిపోయాయి. అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులలో ప్రాణాలు కోల్పోయిన మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ప్రజానీకం కన్నీరుమున్నీరవుతున్నారు. కొందరైతే ఆగ్రహం పట్టలేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూలను హతమార్చాలని డిమాండ్‌ చేశారు. ఉదయం ప్రార్థనలు ప్రారంభం కావడానికి ముందే ప్రజలు పెద్ద ఎత్తున గ్రాండ్‌ మొసల్లాకు చేరుకున్నారు. ఇరాన్‌ పతాకాలతో పాటు ప్రతీకారానికి చిహ్నంగా ఎర్ర జెండాలను, ఖమేనీ చిత్ర పటాలను పట్టుకొని అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంత్యక్రియలు ప్రారంభమైన రోజుతో పోలిస్తే జనం తాకిడి చాలా ఎక్కువగా ఉంది. వాతావరణం ఉద్రేకపూరితంగా కన్పించింది.

ఇంకా ఎందుకు జీవించి ఉన్నాడు?
‘ప్రపంచంలోనే అత్యంత నీచమైన వ్యక్తి ఇంకా ఎందుకు జీవించి ఉన్నాడు? ట్రంప్‌కు ఈ ప్రపంచం ఇక ఎంత మాత్రం మంచి ప్రదేశం కాదు. మన ఇమామ్‌ను చంపిన వ్యక్తిని మనం ఎందుకు చంపకూడదు? మనం అలా చేయకపోతే అవమానకరం అవుతుంది’ అని మహమ్మద్‌ రసూలీ అనే కవి జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. రసూలీ ప్రసంగిస్తున్నంత సేపూ ప్రజలు కరతాళధ్వనులతో తమ మద్దతు తెలియజేశారు. ‘ట్రంప్‌ను చంపాల్సిందే’ అని రాసి ఉన్న ప్లకార్డు ఓ వ్యక్తి చేతిలో కన్పించింది.

రాజకీయ, సైనిక నాయకత్వం సమక్షంలో…
అమెరికా-ఇజ్రాయిల్‌ సేనల దాడులు మొదలైన తర్వాత ఇరాన్‌ రాజకీయ, సైనిక నాయకత్వం బహిరంగంగా కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. ‘మీరు మనుషులను చంపగలరు. కానీ ఆదర్శాలను కాదు’ అని అర్మేనియాలోని ఇరాన్‌ రాయబారి ఖలీల్‌ షిర్ఘోలామీ అన్నారు. పశ్చిమ దేశాలకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవని మండిపడ్డారు. శత్రువులపై పగ, ఖమేనీ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మహమ్మద్‌ బఘేల్‌ జోల్గదర్‌ చెప్పారు. కాగా యుద్ధ సమయంలో ప్రజలకు దూరంగా ఉన్న పలువురు నేతలు, సైనికాధికారులు అంత్యక్రియలలో కనిపించారని ‘ది గార్డియన్‌’ పత్రిక తెలిపింది. ఖమేనీ కుమారులు ముస్తఫా, మసూద్‌, మెయిసామ్‌లు తండ్రి శవపేటిక పక్కనే నిలబడ్డారు. సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మాత్రం హాజరు కాలేదు. భార్య అంత్యక్రియలకు కూడా ఆయన వెళ్లలేదు. ఖోమ్‌కు చెందిన 97 ఏండ్ల మతగురువు నేతృత్వంలో ప్రార్థనలు జరిగాయి. యుద్ధోన్మాదానికి బలైన 14 నెలల ఖమేనీ మనుమరాలి శవపేటికను చూసి జనం భోరున విలపించారు. ఖమేనీ జన్మస్థలమైన మషద్‌లోని ఇమామ్‌ రెజా మందిరంలో ఖననం చేయడానికి ముందు పార్థివ దేహాన్ని ఇరాన్‌, ఇరాక్‌ మీదుగా ఊరేగింపుగా తీసికెళతారు.

ఊరేగింపుగా…
ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొనేందుకు ప్రజలు సోమవారం నల్లని దుస్తులు ధరించి భారీగా తరలి వచ్చారు. ఖమేనీ భౌతికకాయం ఉన్న శవపేటికతో పాటు ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా ఓ ట్రక్కుపై ఉంచారు. శవపేటికలను టెహ్రాన్‌ వీధుల మీదుగా మెహ్రాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిస్తు న్నారు. ఈ ప్రయాణానికి 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఊరేగింపు సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కవాతు జరిపారు. ఒక చోట బిల్‌బోర్డుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తలకు తూటాను గురి పెట్టి ఉన్న చిత్రాన్ని పై నుంచి కిందికి వేలాడదీశారు. దానిపై ప్రదర్శకులు రాళ్లు రువ్వుతూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ‘అమెరికా మా తండ్రిని చంపే సింది’ అని ఆ బిల్‌బోర్డుపై రాసి ఉంది. అమెరికా, బ్రిటన్‌ పతాకాలకు ప్రజలు నిప్పు పెడుతుండగా నల్లని చాదర్‌లు ధరించిన మహిళలు నల్ల అక్షరాలతో ‘ట్రంప్‌ను చంపండి’ అని రాసి ఉన్న ఎర్రని ప్లకార్డులను పైకెత్తి పట్టుకు న్నారు. మరికొందరు అమెరికా, ఇజ్రాయిల్‌ నేతల ముఖాలపై తుపాకీ గురి పెట్టినట్లు చిత్రీకరించిన పోస్టర్లను ప్రదర్శిం చారు.

ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌
మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ సైనిక దళాల అధిపతి మేజర్‌ జనరల్‌ అమిర్‌ హతామీ చెప్పారు. ‘నేరానికి పాల్పడిన వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతీకారేచ్ఛతో ఇరాన్‌, దాని ప్రజలు రగిలిపోతున్నారన్న విషయాన్ని గుర్తించాలి. వారిని వదిలే ప్రసక్తే లేదు. ఇది మా నిర్ణయం. ఫలితాన్ని సాధించే వరకూ విశ్రమించం’ అని అన్నారు.

కనిపించని మొజ్తాబా
అంత్యక్రియల ఊరేగింపుకు లక్షలాది ప్రజలు హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు. ఖమేనీ కుమారుడు, సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మాత్రం ఈ కార్యక్రమంలో కన్పించలేదు. అయితే ముగ్గురు కుమారులు మాత్రం హాజరయ్యారు. దేశాధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, రివల్యూషనరీ గార్డ్స్‌ అధిపతి అహ్మద్‌ వాహిది కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -